చలికాలమని బెంగ ఎందుకు పిల్లల రక్షణ ఇలా సులువు!!
చలికాలం అంటే అందరికీ వణుకు పుడుతుంది. ఈ కాలంలో జబ్బుల సమస్యలు కూడా ఎక్కువే. కేవలం చలి మనల్ని వణికిస్తుందనే మాట అటుంచితే చలి వల్ల చర్మం దెబ్బతింటుంది, శ్వాస సంబంధ సమస్యలు ఎక్కువ అవుతాయి, దానికి అనుబంధంగా వచ్చే సమస్యలు బోలెడు. పెద్దవాళ్లే ఈ సమస్యకు కుదేలైపోతారు. అలాంటిది ఎంతో సున్నితమైన చర్మం, మరెంతో తక్కువ ఇమ్యూనిటీ కలిగిన చిన్న పిల్లల మాటేమిటి?? వారికి స్వేట్టర్లు వేసి రక్షణ ఇవ్వడం నుండి తినడానికి ఇచ్చే ఆహార పదార్థాల వరకు ప్రతి ఒక్కటీ సవాల్ విసిరేదిగా ఉంటాయి.
అయితే చలికాలంలో చిన్నపిల్లల సంరక్షణ పెద్ద సమస్య కాదు, కొన్ని జాగ్రత్తలు పాటించాలంతే అంటున్నారు పిల్లల వైద్యులు. పిల్లల కోసం పెద్దలకు కొన్ని చిట్కాలు..
పైన చెప్పుకున్నట్టు పెద్దల కంటే పిల్లల చర్మం సున్నితత్వం ఎక్కువ. కాబట్టి కాస్త చలిగాలి సోకినా చాలా తొందరగా ప్రభావం అవుతుంది. అంతేనా చర్మం పగుళ్లు వచ్చి మంట పుడుతుంది. వాటికి ఏమి చేయాలో తెలియని పసితనం పిల్లలది. చలికి దురద పెడితే బాగా గోకేస్తుంటారు. ఆ తరువాత అది కాస్తా మంట పుట్టి పెద్ద సమస్య అయ్యి కూర్చుంటుంది. అందుకే పిల్లలకు రాత్రి సమయాల్లో మాశ్చరైజర్ రాయాలి. చర్మం ఏమైనా ఎఫెక్ట్ అయి ఉంటే పిల్లలు రాత్రి సమయంలో నిద్రపోతారు కాబట్టి చర్మం కొలుకోవడానికి తగినంత సమయం ఉంటుంది. అలాగని ఉదయం రాయకూడదని కాదు. రాత్రి సమయాల్లో మాశ్చరైజర్ ప్రభావవంతంగా పని చేస్తుంది.
పిల్లల కోసం ఎంచుకునే మాశ్చరైజర్ క్రీములు ఎప్పుడూ సహజత్వంతో నిండినవై ఉండాలి. ఎక్కువ ఘూఢత ఉన్నవి, కెమికల్స్ ఎక్కువ యూజ్ చేసినవి, కృత్రిమ రంగులతో నిండినవి అసలు ఎంచుకోకూడదు.
ఇక పిల్లలకు తరచుగా ఎక్కువ ఎదురయ్యే సమస్య పెదవులు పగలడం, అలాగే పెదవుల మూలల్లో చీలడం. ఇది ఒక్కసారి వచ్చిందంటే తగ్గడం చాలా కష్టమవుతుంది. ఏమైనా తినడానికి పెదవులు తెరచినప్పుడు మూలలు సాగి చీలిన ప్రాంతంలో రక్తస్రావం కావడం జరుగుతుంది. దీనికి చక్కని సొల్యూషన్ పెట్రోలియం జెల్లీ. వైట్ పెట్రోలియం జెల్లీలో ఎలాంటి కెమికల్స్ ఉండవు. ఇది ఎలాంటి ఇన్ఫెక్షన్ ఇవ్వదు. కాబట్టి పెట్రోలియం జెల్లీని గంటకు ఒకమారు రాస్తూ ఉంటే ఒకరోజులోనే ఈ సమస్య తగ్గిపోతుంది. ఇక తరువాత ఈ సమస్య రాకూడదంటే డైలీ రాత్రి పడుకునే ముందు పెట్రోలియం జెల్లీ అప్లై చేయాలి.
పిల్లలకు సాధారణంగానే చిరాకు తెప్పించే విషయం డైపర్. పెద్దలకు సౌకర్యంగా ఉంటుందని, పిల్లలు బట్టలను పాడు చేయకుండా ఉంటారనే కారణంతో డైపర్లు వాడుతున్నారు ఈ కాలంలో. అయితే వాటిని అపుడపుడు చెక్ చేస్తుండాలి. లేకపోతే డైపర్ల వల్ల పిల్లలకు రాషెస్ వచ్చి చర్మం దెబ్బతింటుంది. అలాగే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు.
చల్ల నీళ్లు, చల్లని ఆహారం, ఐస్ క్రీమ్స్, కేక్స్ లాంటి ఆహార పదార్థాలు పిల్లలకు పెట్టకూడదు.
ఎక్కువ సమయం స్నానం చేయించడం, స్నానం సమయంలో శరీరాన్ని పదే పదే రుద్దడం చేయకూడదు. అలాగే చలి కాలం కదా అని స్నానానికి మరీ వేడినీళ్లు ఉపయోగించకూడదు. స్నానం తరువాత పొడి గుడ్డతో శుభ్రంగా తుడవాలి, తరువాత మాశ్చరైజర్ రాయాలి. వేసే దుస్తులు వెచ్చదనాన్ని ఇచ్చేలా కాస్త వదులుగా ఉండాలి. చలి అనే నెపంతో బిగుతు దుస్తులు వేయకూడదు. ఉన్ని దుస్తులు వేయడం మంచిది.
పిల్లలకు చర్మ సంబంధ సమస్యలు వచ్చినప్పుడు కొబ్బరి నూనె లాంటి సహజ మార్గాలతో తగ్గకపోతే ఇతర సొంతవైద్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.
◆నిశ్శబ్ద.