పిల్లలకు అసలైన బహుమతి ‘ఆత్మవిశ్వాసం’

 


పిల్లల్ని ఆనందపరచడానికి రకరకాల బహుమతులు ఇస్తుంటాం. వారికి ఇష్టమైనవి, అవసరమైనవి వెతికిమరీ కొని తెస్తాం. అయితే ఇవన్నీ అప్పటికి మాత్రమే ఆనందాన్నిచ్చేవి. అలాకాక పిల్లలకి ఎప్పటికీ ఉపయోగపడే అతి అమూల్యమైన, విలువైన బహుమతి ఒకటి వుందట. అది కేవలం తల్లిదండ్రులు మాత్రమే ఇవ్వగలిగింది. అదీ, అతి చిన్నవయసు నుంచి తప్పకుండా ఇవ్వాల్సిందిట. ఆ అమూల్యమైన బహుమతి పేరే ‘కాన్ఫిడెన్స్’. ఎందుకంటే, తనమీద తనకి నమ్మకం కలిగిన ఈనాటి పిల్లలు రేపు పెరిగి పెద్దయ్యి అదే నమ్మకంతో జీవితంలో తాము కోరుకున్న విజయాలని సొంతం చేసుకుంటారు అంటున్నారు మిచిగాన్ యూనివర్సిటీ పరిశోధకులు. ‘పిల్లలు - వారిలో ఆత్మవిశ్వాసం’ అన్న విషయంపై అధ్యయనం చేపట్టిన వీరు... 200 మంది తల్లిదండ్రులని, పిల్లలని ప్రశ్నించారు. వారి జీవనశైలిని అధ్యయనం చేశారు. తల్లిదండ్రులకు వారు సూచనలు, సలహాలు ఇచ్చారు.

తల్లిదండ్రులు తమ పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవాలని అనుకుంటారు. దాంతో అతి గారాబంగానే కాదు, ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. వాళ్ళని అరచేతుల్లో పెట్టి కాచుకుంటారు. పిల్లలు పెరిగి పెద్దవారవుతున్నకొద్దీ ఆ పట్టు బిగుస్తుందే కాని విడిపోదు. ఆ ప్రయత్నంలో కొన్నిసార్లు పిల్లలు ఎక్కడ చేజారిపోతారనే భయంతో ఎక్కువ కట్టడి కూడా చేస్తారు. తమ మాట విననప్పుడు విమర్శిస్తారు. ఇదంతా పిల్లల్ని పెంచడంలో భాగమే. వారి మంచికోరే తల్లిదండ్రులు చేసే పనులే. అయితే ఇదే మంచిది కాదు అంటున్నారు. నిపుణులు. ఎక్కడ పిల్లలు తప్పటడుగు వేస్తారోననే భయంతో వాళ్ళని అతిగా కట్టడి చేయడం, లేదా వాళ్ళ ప్రతి అడుగులో చేయందించడం మంచిది కాదంటున్నారు నిపుణులు.

పిల్లలకి తల్లిదండ్రులు తప్పకుండా ఇవ్వాల్సిన అమూల్యమైన బహుమతి ‘ఆత్మవిశ్వాసం’. ఈ బహుమతి ఇవ్వాలంటే తల్లిదండ్రులు మొట్టమొదటగా చేయవలసింది ఏంటో తెలుసా? పిల్లల చేతివేలుని వదిలేసి వారంతట వారు నడిచేలా చేయడం. ఆ ప్రయత్నంలో పిల్లలు పడతారు, లేస్తారు. ఆ క్రమంలోనే సరైన నడక రీతిని తెలుసుకుంటారు. చిన్నప్పుడు పిల్లలు నడక నేర్చుకునేటప్పుడు తల్లిదండ్రులు చేసే ఈ పనినే జీవితానికి అన్వయించుకోమంటున్నారు నిపుణులు. పిల్లలని స్వంతగా ఆలోచించనివ్వాలి. స్వంతగా వారి పనులు వారు చేసుకునేలా ప్రోత్సహించాలి. దానితోపాటు ఏ పనైనా స్వంతగా చేయడానికి ప్రయత్నించనివ్వాలి. వీటన్నిటిలో పిల్లలు మొదటిసారే సక్రమంగా చేయలేరు. అయినా వదిలేయాలి. ఆ పొరపాట్ల నుంచే పిల్లలు నేర్చుకుంటారు... ఎదుగుతారు అని నిపుణులు చెబుతున్నారు.

తల్లిదండ్రులుగా పిల్లల మంచిచెడ్డలు అన్నిటిని దగ్గరుండి చూసుకోవాలన్న తాపత్రయం వారిని ఎదగనివ్వకుండా చేస్తోందేమో ఒక్కసారి చూసుకోండి అంటున్నారు నిపుణులు. కష్టంగా అనిపించినా నిజమదే. ప్రతి క్షణం పిల్లలు ప్రతి విషయానికీ తల్లిదండ్రుల మీద ఆధారపడటం వారికి ముచ్చటగా అనిపించినా, పిల్లలకి స్వంత వ్యక్తిత్వం అన్నది లేకుండా చేస్తుంది కాబట్టి ఏ వయసు పిల్లలైనా వారి ఆలోచనలకి, వారి ప్రయత్నాలకి అవకాశం ఇవ్వాలిట. మూడేళ్ళ పిల్లాడు కూడా అమ్మ ఏది వద్దందో అది చేయడానికే ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో ‘‘నే చెప్పాను కదా వద్దు’’ అని ఖచ్చితంగా చెప్పడం కన్నా ‘‘ఎందుకు’’ అన్న ప్రశ్నకి సమాధానం చెప్పడం మంచిదని అంటున్నారు వీరు. ఆ ‘‘ఎందుకు’’ అన్న ప్రశ్న తల్లిదండ్రులని ఛాలెంజ్ చేస్తున్నట్టు, వారిని ఎదిరిస్తున్నట్టు అనుకుంటారు చాలామంది. కానీ ఆ ప్రశ్న వారిలో ధైర్యానికి, ఆత్మవిశ్వాసానికి, తెలుసుకోవాలన్న ఆసక్తికి ఉదాహరణగా తీసుకోవాలిట.

చిన్నప్పుడు పడ్డ పునాదిపైన పిల్లల వ్యక్తిత్వం రూపు దిద్దుకుంటుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళని పట్టు విడుపులతో పెంచితే వారిలో ఏదైనా ప్రయత్నించడానికి వెనకాడని ధైర్యం కలుగుతుంది. అలాగే ఏ పనైనా చేయడానికి ప్రయత్నిస్తే అందులోని సులువుని తెలుసుకోవచ్చన్న విషయం అర్థమవుతుంది. పిల్లలు చేసే పొరపాట్లు వారి ఎదుగుదలలో ఓ తప్పనిసరి ప్రాసెస్. వాటినుంచి వాళ్ళెన్నో నేర్చుకుంటారు. పెద్దలుగా వారు ప్రమాదపుటంచులకు వెళ్ళకుండా చూడటం మాత్రమే తల్లిదండ్రుల పని. వారి తప్పులను ఎంచొద్దు. ఆ తప్పులను ఎత్తి చూపించొద్దు. నీవల్ల కాదంటూ అన్నిట్లో వారికి సాయపడొద్దు. పిల్లల ఎదుగుదల క్రమమంతా ఓ చక్కటి ఆట. పిల్లలు ఒకోసారి గెలుస్తారు. మరోసారి ఓడిపోతారు. ఆ ఓటమిలోంచే మళ్ళీ ఎలా గెలవాలో వాళ్ళే నేర్చుకుంటారు. తల్లిదండ్రులుగా ఆ ఆటని చూస్తూ ఆనందించడమే మనం వాళ్లకిచ్చే అమూల్యమైన బహుమతి.


-రమ ఇరగవరపు