కళ్ళు మనిషికి చాల ప్రధానమైనవి. అంధకారమైన జీవితము ఊహించడానికి కూడా సాహసించరు. కళ్ళను మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరి అలాంటప్పుడు మన కళ్ళ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇపుడు చూద్దాం.

చదివేటపుడు :

పుస్తకము 30 సెం.మీ. దూరము లో ఉంచుకోవాలి. నిటారుగా కూర్చొని చదవాలి. పడుకొని చదవకూడదు. సరిపడా వెలుతురు ఉండాలి. కదులుతున్న కుర్చీలో కూర్చొని చదివితే కళ్ళకు శ్రమ కలుగుతుంది.

టెలివిజన్ చూస్తున్నప్పుడు :

ఒక గంటకు మించి విడవకుండా టివి చూడడము మంచిదికాదు. టీ.వీ. చూస్తున్నపుడు శరీరాన్ని పలురకాల భంగిమల్లో ఉంచడం చాలామందికి అలవాటు. అయితే వెన్నెముకకి ఊతమిచ్చే కుర్చీలో కూర్చొని tv చూడడము కంటికి మేలుచేస్తుంది. TV చూసేటపుడు మనకు tv కి కనీసము 3 మీటర్లు దూరము ఉండాలి. చీకటిగా ఉన్న గదిలో కూర్చోని టీ.వీ. చూడడం కంటికి శ్రేయస్కరము కాదు. టివి చూస్తున్నపుడు వెలుతురు సరిపడా ఉండాలి. ఆ లైటు కూడా టివి వెనకవైపు ఎత్తులో ఉంటే మంచిది.

బండి నడిపేటప్పుడు :

బండి నడిపేటప్పుడు సన్ గ్లాసెస్ ని వాడాలి. సూర్యుని నుంచి వచ్చే అతి నీలిలోహిత కిరణాలు యు.వి. (ultra violet rays) కిరణాలు తాకిడికి కళ్ళకు హానికలగకుండా, దుమ్మి, ధూళి పడకుండా కళ్ళకు రక్షణగా ఉంటాయి. రాత్రులు బండి నడిపేటప్పుడు యాంటి గ్లేర్ గ్లాస్లు వాడాలి, ఎదురుగా వచ్చే వాహనాల హెడ్ లైట్ల కాంతిని తగ్గించి కళ్ళకు రక్షణ కల్పిస్తాయి.

కంప్యూటర్ తో పనిచేస్తున్నపుడు :

కంప్యూటర్ తెర మధ్యభాగానికి కాస్త పైన మీ చూపు ఉంటే మంచిది. రెప్ప వేయకుండా పనిచేయడము మంచిదికాదు. తరచుగా రెప్పలు వేస్తూ ఉండాలి. నిరంతరము పనిచేయకుండా మధ్యలో విరామము ఇవ్వాలి. కాళ్ళు నేలమీద ఆన్చి వెన్నెముకను నిటారుగా ఉంచి కూర్చొవాలి. మీ దృష్టి మరీ అంత తీక్షణముగా ఉండకూడదు. మరింత కాంతివంతముగా కనిపించేలా మానిటర్ లైటింగ్ యేర్పాటు చేసుకోవాలి. మానిటర్ మీద యాంటిగ్లేర్ స్క్రీన్ యేర్పాటు చేసుకుంటే మంచిది.