కాఫీ హెయిర్ మాస్క్.. ఇంట్లోనే ఇలా వాడి చూడండి.. షాకవుతారు..!
కెఫీన్.. కాఫీ, టీ లలో సాధారణంగా ఉండే రసాయనం. రోజూ ఉదయాన్నే కాఫీ, టీ తాగే వారు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. కెఫీన్ మెదడును ఉత్తేజపరుస్తుంది. శరీరానికి మంచి బూస్టింగ్ ఇస్తుంది. అయితే కాఫీ కేవలం ఇలా ఆరోగ్యానికే కాదు.. జుట్టుకు కూడా చాలా మంచిది. ఈ మధ్యకాలంలో చర్మ రక్షణ ఉత్పత్తులు, జుట్టు సంరక్షణ ఉత్పత్తులు కాఫీ ఆధారితంగా ఉన్నవి చాలా అందుబాటులోకి వస్తున్నాయి. కానీ వీటిలో రసాయనాలు ఉంటాయి. వీటికి బదులు ఇంట్లోనే కాఫీ హెయిర్ మాస్క్ ట్రై చేసి చూడండి. కాఫీని కూడా విభిన్న రకాలుగా ఉపయోగించవచ్చు. ఇది ఇచ్చే ఫలితాలు చూసి షాకవుతారు.
కాఫీ, పెరుగు..
కాఫీ, పెరుగు రెండూ మిక్స్ చేసి కాఫీ మాస్క్ తయారు చేయవచ్చు. పెరుగులో కాఫీ పౌడర్ మిక్స్ చేసి జుట్టు కుదుళ్ల నుండి జుట్టు పొడవునా అప్లై చేయాలి. ఇది జుట్టుకు మంచి పోషణ ఇస్తుంది. జుట్టును మృదువుగా చేస్తుంది.
కాఫీ, ఆల్మండ్ ఆయిల్..
కాఫీ పొడిని, బాదం నూనెను కూడా కాఫీ మాస్క్ గా ఉపయోగించవచ్చు. కాఫీ పొడిని బాదం నూనెతో మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి పొడవునా అప్లై చేయాలి. ఇది జుట్టును బలపరుస్తుంది. జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది. ఆల్మండ్ ఆయిల్ లో విటమిన్-ఇ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు భలే సహాయపడుతుంది.
కాఫీ, తేనె..
తేనెను ఈ మధ్యకాలంలో జుట్టు సంరక్షణలో కూడా ఉపయోగిస్తున్నారు. కాఫీ పొడిలో తేనె మిక్స్ చేసి చిక్కటి మిశ్రమంలా తయారుచేసుకోవాలి. దీన్ని జుట్టు మూలాల నుండి అంచుల వరకు మొత్తం అప్లై చేయాలి. ఇది జుట్టుకు తేమను అందిస్తుంది. దీని వల్ల జుట్టు తిరిగి జీవం పోసుకుంటుంది. పొడిగా, టెంకాయ పీచులా ఉండటం తగ్గుతుంది. జుట్టు ఆరోగ్యంగా సిల్కీగా మారుతుంది.
కాఫీ, గుడ్డు..
జుట్టు సంరక్షణలో గుడ్డును చాలా కాలం నుండి వాడుతున్నారు. ఇది జుట్టు ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది. కాఫీ పొడిని గుడ్డులో కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. దీన్ని జుట్టుకు పట్టించాలి. ఇది జుట్టుకు ప్రోటీన్ ను అందిస్తుంది. జుట్టును బలపరుస్తుంది. జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా మారతాయి. జుట్టు పెరుగుదల బాగుంటుంది.
కాఫీ, నిమ్మరసం..
జుట్టు సంరక్షణలో నిమ్మకాయ చాలా రోజుల నుండి ఉంది. తలలో చుండ్రు, దురదలు, ఇన్ఫెక్షన్లు వంటివి నివారించడంలో నిమ్మకాయ బాగా పనిచేస్తుంది. కాఫీ పొడిని నిమ్మరసంలో కలిపి జుట్టు కుదుళ్లకు అప్లై చేయాలి. ఇది జుట్టును శుభ్రపరుస్తుంది.
కాఫీ, కొబ్బరినూనె..
వేరే పదార్థాలు ఏమీ లేకపోయినా కొబ్బరినూనెలో కాఫీ పొడి కలిపి తలకు పట్టించవచ్చు. ఇది జుట్టుకు మంచి పోషణ ఇస్తుంది. జుట్టు పొడిబారకుండా చేస్తుంది. జుట్టును బలపరుస్తుంది.
*రూపశ్రీ.
