చిన్న పిల్లలతో తల్లిదండ్రులు ఎలా నడుచుకోవాలి. వారితో ఎలా మెలగాలి. వారిని ఏ విధంగా సరైన మార్గంలో పెట్టాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. కానీ పిల్లలతో మనం ఎలా ఉండకూడదు. మనం వల్ల పిల్లలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? అని ఆలోచించారు. మరి అసలు పిల్లల కోసం తల్లిదండ్రులు ఏం చేయాలో మూడు ముక్కల్లో తెలుసుకుందామా...!

 

మీరు పిల్లలపై చూపించే కోపం చాలా తగ్గించుకోవాలి. ఎందుకంటే మీరు ప్రతి చిన్న విషయానికి కూడా కోపం తెచ్చుకుంటే వారికి ఉండే చిన్నపాటి ఓపిక నశించి, మీ మాటలకే ఎదురుచేప్పే పరిస్థితి వస్తుంది. కాబట్టి... ఏ విషయాన్నైనా కూడా చాలా సున్నితంగా చెప్పాలి. మీరు ఒకవేళ సిగరెట్, గుట్కా, మందు తాగడం వంటి చెడు అలవాట్లు కలిగి ఉన్నట్లయితే మీ పిల్లలు కూడా వాటిని అనుసరించే అవకాశం ఉంది. కాబట్టి మీరు అలాంటి వాటిని దూరం చేసుకోవడం వల్ల మీకు, మీ పిల్లలకు మంచిదే.

 

 

పిల్లల్ని ప్రతి క్షణం కూడా చదువుకోమని పోరుపెట్టడం వారికి చదువు పట్ల అయిష్టత ఏర్పడేలా చేయవచ్చు. అలా వారికి మాటిమాటికీ చెప్పడంతో వల్ల చదువుపై విరక్తి కలుగుతుంది. దీంతో పూర్తిగా చదువుపై ధ్యాస తగ్గిస్తారు. కాబట్టి మీరు కూడా అప్పుడప్పుడు ఏదైనా మంచి పుస్తకాలు చదవటం ప్రారంభించండి. దాంతో మీ పిల్లలు కూడా మీతో పోటీ పడి మరి చదువుతారు.

 

మీరు మీ పెద్దవాళ్ళతో ఎలా ప్రవర్తిస్తారో, ఎలా మాట్లాడుతారో, వారికి ఎలాంటి గౌరవ మర్యాదలు ఇస్తున్నారో... మీ పిల్లలు కూడా అలాగే నడుచుకుంటారు. మీరు చేసే ఏ పని అయినా కూడా మీ పిల్లల మనస్తత్వాలపై పడుతుంది. కాబట్టి మీరు పిల్లలతో మాట్లాడే తీరు ఎంత ముద్దుగా, కచ్చితంగా, ప్రేమగా, ఆప్యాయంగా ఉంటుందో వారు అంత మంచివారుగా, మంచి మాటలు మాట్లాడేవారుగా తయారవుతారు.