శిశువుకు తల్లిపాలు పట్టడం వల్ల ఆ శిశువు ఇంటెలిజెన్స్‌ కోషియెంట్‌ (ఐ.క్యు) పెరుగుతుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. శిశు జననంనుంచి ఏడాదిపాటు తల్లిపాలు ఇవ్వడం వల్ల ఆ శిశువు మేధాశక్తి పెరిగినట్లు పరిశోధనల ద్వారా వెల్లడైంది.

 

శిశు జననం తరువాత ఏడాది కంటే తక్కువ సమయం తల్లిపాలు తాగిన చిన్నారులతో పోల్చి చూసినప్పుడు... ఏడాది వయస్సు వచ్చే వరకూ తల్లిపాలు తాగిన చిన్నారులలో ఐ.క్యు. స్థాయి నాలుగు పాయింట్లు పెరిగింది. ఈ చిన్నారులు మూడేళ్ల వయస్సులో వారికి చెప్పే విషయాలను అర్థం చేసుకోవడంలోనూ, ఏడేళ్ల వయస్సు వచ్చే నాటికి పెద్ద పెద్ద పదాలతో కూడిన మాటలను, గుర్తులను అర్థం చేసుకోవడంలోనూ ఇతర చిన్నారుల కంటే ముందంజలో ఉన్నారు.

 

శిశు జననం తరువాత తల్లి పాలు ఇవ్వడం వల్ల ఆ శిశువుకు అవసరమైన పోషకాలన్నీ అందుతాయనే విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు శిశువు సాధారణ ఆరోగ్య రక్షణకు తల్లిపాలు ఎంతో అవసరం.

 

శిశువు సాధారణ ఆరోగ్యం, పెరుగుదల, అభివృద్ధికి తల్లిపాలు అత్యవసరమని, తల్లిపాలు ఇవ్వడం వల్ల శిశువుల్లో హఠాన్మరణాలు సంభవించవనీ, మధుమేహం టైప్‌1 వంటి సమస్యలను నివారించవచ్చునని ఆ అధ్యయనాలు వెల్లడించాయి.

 

శిశు జననం తరువాత తల్లిపాలు ఇవ్వనిపక్షంలో చిన్నారులకు అనేక రుగ్మతలు చుట్టుముట్టే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఎదుగుతున్న కొద్దీ వారికి చెవిలోనూ, శ్వాస కోశాల కింది భాగంలోనూ ఇన్‌ఫెక్షన్లు, మూత్రకోశ వ్యవస్థకు చెందిన రుగ్మతలు, బాక్టీరియల్‌ మెనింజైటిస్‌ మొదలైన పలు సమస్యలు వస్తాయని ఆ అధ్యయనాల్లో వెల్లడైంది.