Facebook Twitter
ప్రస్తుత ప్రస్థావన! - శారదా అశోకవర్ధన్

ప్రస్తుత ప్రస్థావన!


- శారదా అశోకవర్ధన్

 

పోరా దండుకు పోరా ముందుకు

పోరా తోసుకు వడివడిగా

దోచుకుపోరా దాటుకుపోరా

దూసుకుపోరా తోసుకుపోరా

పోరా పోరా వేగంగా!

దాడులు చేసి దోపిడి చేసి

కత్తి కటార్లతో తలనరికేసి

మొగాడినైతే ప్రాణం తీసి

ఆడది అయితే మానం తీసి

తేరగా దొరికిన సొమ్మును తీసి

బ్యాంకులో ఖాతా ఓపెన్ చేసి

బీదా బిక్కి చచ్చేలాగా

చిన్నా పెద్దా ఏడ్చేలాగా

దొరికిన సరుకును కొనిపారేసి

బ్లాకులో డబ్బులు సంపాదించి

మేడలు మిద్దెలు కట్టిపడేసి

కార్లూ బార్లూ నడుపుతుపోతూ

పోరాదండుకు పోరా తోసుకు

పోరా పోరా వేగంగా!

అప్పుడు చూడరా నీ తడాఖా

చూస్తూ పో ఆ తమాషా

సలాములు నీకే సన్మానాల్ నీకే

గులాములు చేసే హంగామా నీకే

రాజకీయ రంగప్రవేశానికి

టిక్కెట్టులు నీకే బంగారపు బిస్కెట్టులు నీకే

పట్టుదలతో సాధిస్తే మెట్టుమెట్టు

అంతస్థులు నీకే !

అప్పుడు

దంచేసేయ్ ఉపన్యాసాల్

చించేసేయ్ నీతి శాస్త్రాల్

దేశమంటే మనుషులు కాదని

దేశమంటే మట్టి ముద్దలని

తేల్చేసెయ్ ఒక్క మాటలో

చచ్చు జనాభా చావనీయమని

పుచ్చు సమాజం పుచ్చనీయమని

కాల్చేసెయ్ కసితీరా తోటివారిని

కూల్చేసెయ్ పూరికొంపలని

పీకేసెయ్ చెట్టూ చేమను

పెంచేసెయ్ ఆస్దీ పాస్దీ !

అయితే,

ఇంత తతంగం చేసేశాక

ఇసుమంతైనా పొక్కనీయక

నీలోనే అన్నీ ఇముడ్చుకుని

సిగ్గూ ఎగ్గూ ఒదిలేసి

పట్టేసెయ్ అందరి కాళ్ళూ వేళ్ళూ

బతికేసెయ్ ఎలాగో ఓలాగు

అంతకన్నా ఎందుకు నీతులు

నీకెందుకు నీతులు గోతులు

తీసి గొంతులు పిసికే

నీ కెందుకు సూక్తులు

చరిత్ర వొద్దు మనుషులు వొద్దు

మనిషిగ బతికే మార్గం వొద్దు

పద్దులు వొద్దు హద్దులు వొద్దు

నువ్వంటే నీకే ముద్దు

అందుకే లేదేదీ అడ్డు

పోరా దండుకు పోరా ముందుకు

పోరా పోరా ఎదుగుతుపో!

అయితే,

ఒక్కటి మాత్రం మరవకురా

ఎప్పటికీ అది సత్యంరా

ఎంత దోచినా ఎంత దాచినా

నువ్వూ చావక తప్పదురా

మణి మాణిక్యాలెన్నున్నా

మట్టిలోనె నువు కలియుటరా

మంటలోనె నువు మాడుటరా

వెంటరారు నీ వాళ్లెవరూ

జంట గూడరు నీ స్నేహితులు

గడప దాటదు నీ సతి

కాటి దాటరు నీ సుతులు

అంతకాడికి ఎందుకు మోసం

మెలేయుట మీసం పట్టరాని పౌరుషం

ఎందుకురా ఒడిగట్టుట పాపం

ముడిగట్టుట పైకం

అందరి మేలూ కోరే విధముగ

బతికే మార్గం చూడగలేవా

మానవత్వం మంట గలపక

మనిషి లాగా బతక నేర్వర

రారా ముందుకు రారా తోసుకు

రారా దూసుకు రా.....రా...... రా......!

పైసా నిలవదు ఎల్లకాలము

పదవులు కావు శాశ్వతమ్ము

మనుషుల్లాగా బతికేటందుకు

మానవతను పెంచేటందుకు

మారణహోమం మానేటందుకు

కుల మత బేధం కూల్చేటందుకు

భాషా భేదం మాపేటందుకు

ప్రాంతీయ తత్వం పారద్రోలగ

హద్దులు చెరిపి ఎల్లలు తుడిపి

సమ సమాజం నిర్మించేందుకు

నవ భారతం సృష్టించేందుకు

దూసుకురారా దాటుకురారా

తోసుకు రారా రా.... రా... రా.....

రారా రారా వేగంగా

రారా రారా దైర్యంగా!