Facebook Twitter
కీలుగుర్రం

కీలుగుర్రం

 

- రేణుక

 

పూర్వం ఒక దేశాన్ని ఓ అందమయిన రాజు పాలించేవాడు. ఆ రాజుకు ఒక భార్య ఉండేది. వారి రాజ్యం సిరిసంపదలతో, పాడిపంటలతో తులతూగేది.

ఒకసారి, రాజు వేటకని అడవికి వెళ్ళాడు. ఆ అడవిలోని రెండు ఆడదయ్యాలు రాజును చూసి, అందగాడయిన ఆ రాజును ఎలాగయినా పెళ్ళాడాలనుకొన్నాయి. నేను చేసుకొంటానని ఒకటంటే, కాదు, రాజు నావాడన్నది మరో దయ్యం. రెండూ న్యాయంకోసం మరో దయ్యం దగ్గరికి వెళ్ళాయి. ’రాజు వేటాడుతున్న అడవికి తూర్పుకు ఒకరూ, పడమటికి మరొకరూ వెళ్ళండి. రాజు ఏ దిక్కుకు వస్తే ఆ దిక్కున ఉన్నవాళ్లు రాజును పెళ్ళి చేసుకోండి’ అని చెప్పింది ఆ దయ్యం. రాజును పెళ్ళాడిన వారు గెలిచినట్లు, మరొకరు ఓడినట్లు. మరి ఓడినవారు గెలిచినవారు చెప్పినట్టు వినాలి’ అని కూడా తీర్పు చెప్పిందది.

దయ్యాలు రెండూ అందుకు అంగీకరించాయి. వాటిలో పెద్దదేమో తూర్పుకూ, చిన్నదేమో పడమటికీ వెళ్ళాయి. ఆరోజున రాజు తూర్పు వైపుకు వెళ్ళాడు! ఇక తూర్పువైపునున్న పెద్దదయ్యం అందమైన కన్యగా మారి రాజుకు ఎదురుపడింది. రాజు ఆమె అందానికి ముగ్ధుడయి, ఆమెను పెళ్ళిచేసుకొని తనతో తీసుకెళ్ళాడు.

రాజును పెళ్ళాడిన పెద్ద దయ్యం వెంటనే తనప్రాణాలను ఓ చిలకలో ఉంచి, దాన్ని ఓడిపోయిన దయ్యానికిచ్చింది. "ఏడు చెరువులూ, ఏడు నదులూ, ఏడు సముద్రాలూ దాటి, అక్కడున్న పెద్ద మర్రితొర్రలో ఉంటూ తన ప్రాణాలను కాపాడుతూ ఉండమ"ని చెప్పి పంపేసింది. అలా అది తన ప్రాణాలకు రక్షణ తెచ్చుకోవటంతోపాటు తన పోటీదారుకు దేశ బహిష్కారం కూడా చేయగల్గింది.

ఆ సమయంలోనే రాజు మొదటి భార్య గర్భవతి అయ్యింది. కొన్నాళ్ళు గడిచాయి. రెండవ రాణిగా ఉంటున్న పెద్ద దయ్యానికి రాజభవనంలోని తిండి ఏమాత్రమూ రుచించలేదు. రోజూ దొరికిన ప్రతి జంతువునూ తినే దానికి ఆ తిండి ఎలా నచ్చుతుంది, మరి?! ఒక ఉపాయం ఆలోచించి ఒక నాటి రాత్రి బయటికి పోయి కోటలోని జంతువులను తిని వచ్చింది.
ఉదయాన్నే భటులు పరుగుపరుగున వచ్చి, రాజుతో జంతువులన్నీ మాయమయ్యాయన్న విషయాన్ని చెప్పారు. రాజు తగిన ఏర్పాట్లు చేయించాడు. సరిగ్గా అప్పుడే రాజు గారి మొదటి భార్యకు రెండవ భార్యమీద అనుమానం వచ్చింది. అది తెలుసుకొన్న రెండవ భార్య, మరునాటి రాత్రి ఆహారం కోసం వెళ్ళివచ్చి, రాణి పక్కన రక్త మాంసాలను వేసి, రాణి మూతికీ, చేతులకూ రక్తాన్ని పూసింది. మరునాడు ఉదయమే భటులొచ్చి విషయాన్ని రాజుతో చెప్పారు. ఇంతలోనే రాజు రెండవ భార్య వచ్చి, రాణిగారి గదిలో రక్తమాంసాలున్నట్లు చెప్పింది. అది చూసి రాజు, తన మొదటి భార్యే జంతువులన్నింటినీ చంపి తింటున్నదని అనుకొని, ఆమె కళ్ళు పీకి, అడవిలో వదలి రమ్మన్నాడు. భటులు, రాజుమాటను పాటించారు. అడవిలో ఉన్న గుడ్డి రాణిని ఒక ముని చేరదీశాడు. ఆమెకు ఒక కొడుకు కుడా పుట్టాడు. ఆ ముని, ఆ అబ్బాయికి అన్ని విద్యలూ, నేర్పాడు. ఇదిలా ఉండగా, రాజు రెండవ భార్యగా ఉంటున్న దయ్యం రాజ్యంలోని చాలా జంతువులను , తినేసింది. రాజ్యంలో కరువు తిష్ఠ వేసింది. మరోవైపున రాకుమారుడు విద్యాభ్యాసం ముగించుకొని, దేశాటనకు తన కీలుగుర్రం ఎక్కి బయలుదేరాడు.

ఒక నాటి రాత్రికి రాజుగారి కోటను చేరాడు. ఆకాశంలోనుండి చూస్తున్న రాకుమారునికి, కోటలోని ఏనుగును తింటున్న ఓ దయ్యం కనిపించింది. అంతలోనే ఆ దయ్యం కూడా రాకుమారుణ్ణి చూసి, రాణిగా మారి కోటలోకి మాయమయింది. దాన్ని రాకుమారుడు గమనించాడు.

దయ్యం వీడి పీడను ఎలాగయినా వదిలించుకోవాలని, మర్నాటి ఉదయం "తలనొప్పి, తలనొప్పి..." అంటూ నటనమొదలెట్టింది. రాజవైద్యుల వైద్యం రాణి తలనొప్పిని తగ్గించలేకపోయింది. అపుడు రాణి, "రాజా ! నా తలనొప్పి పోగొట్టే మందు ఇక్కడెక్కడా లభించదు. ఏడుచెరువులూ, ఏడు నదులూ, ఏడు సముద్రాలూ దాటి, అక్కడున్న పెద్ద మర్రి చెట్టు తొర్రలో నేనిచ్చే చీటీ ఇస్తే, నాకు కావలసిన మందు దొరుకుతుంద"ని చెప్పింది.

రాజు అంత దూరం పోయివచ్చేవారికోసం దండోరా వేయించాడు. మందు తెచ్చిన వారికి తన రాజ్యంలో సగ భాగాన్ని ఇస్తానన్నాడు. విషయాన్ని తెలుసుకున్న రాకుమారుడు, ఆ పని తను చేస్తానన్నాడు. రాజు సంతోషంతో, విషయాన్ని రాణికి చెప్పాడు. రాణి ఆ అబ్బాయిని చూసి "వీణ్ణి చంపి తిను" అని తన భాషలో ఒక చీటీని రాసి ఇచ్చి, ’ఇక వీడి పీడ వదిలిపోతుంది’ అనుకుని తృప్తి పడింది.

రాకుమారుడు ఆ చీటీని తీసుకొని తన కీలు గుర్రం ఎక్కి బయలుదేరాడు. ఏడు చెరువులూ, ఏడు నదులూ, ఆరు సముద్రాలూ దాటాక, రాకుమారునికి ఒక ముసలి దయ్యం, అనారోగ్యంతో కదలలేక కనిపించింది. రాకుమారుడు జాలితో ఆ దయ్యానికి సాయం చేశాడు. నాలుగు రోజులు అక్కడే ఉన్నాడు కూడా. నాల్గవ నాటి రాత్రి రాకుమారుని జేబులోని చీటీ కిందపడి, ముసలి దయ్యానికి దొరికింది. దయ్యం చీటీని చదివి "అయ్యో ! ఇంత మంచి అబ్బాయిని ఎవరో చంపాలని పన్నాగం పన్నారు. అలా జరగడానికి వీలు లేదు. వారినే అంతం చేయాలి" అని, ఆ చీటీని చించేసి, "ఇతన్ని బాగా చూసుకో . నా ప్రాణాలను ఇతని చేతికిచ్చి పంపు" అని మరో చీటీ రాసి రాకుమారుని జేబులో ఉంచింది.

మర్నాటి ఉదయం రాకుమారుడు బయలుదేరి ఏడవ సముద్రాన్ని దాటి, అక్కడున్న మర్రి తొర్ర వద్దకువెళ్ళి, ’ఎవరమ్మా లోపల?’ అని అడిగాడు. లోపలినుండి ఒక అందమైన ఆడ మనిషి వచ్చి, ఎవరు కావాలన్నది. రాకుమారుడు తన దగ్గరున్న చీటీని ఆమెకిచ్చాడు. ఆమె ఉత్తరాన్ని చదివి, తన యజమాని దయ్యం తన కొడుకునే పంపిందేమోననుకొని, అన్ని విషయాలూ రాకుమారుడితో చెప్పేసింది. దయ్యం ప్రాణాలున్న చిలుకను అతనికి ఇచ్చేసింది కూడా.

రాకుమారుడు మరునాడే బయలుదేరి, ఒక నాటి రాత్రికి కోటను చేరాడు. ఆ సమయానికి దయ్యపు రాణి కోటలోని గుర్రాలను తింటున్నది. అది చూసిన రాకుమారుడు, దయ్యం ప్రాణాలున్న చిలుక కాళ్ళనూ, రెక్కలనూ విరిచాడు. దయ్యం కాళ్ళూ, చేతులూ పోయి, బాధతో గట్టిగా అరిచింది. ప్రజలంతా వచ్చారు. రాజు కూడా వచ్చాడు. అందరూ అక్కడి పరిసరాలనుచూసి, భయపడ్డారు. రాకుమారుడు తన కీలు గుర్రం దిగివచ్చి "ఓ దయ్యమా ! ఇప్పటికయినా నిజం చెప్పమ"న్నాడు. దయ్యం జరిగినదంతా చెప్పేసింది. రాజు కోపంతో చిలుకను, దానితోపాటు దయ్యాన్ని చంపేశాడు.

తమ రాజ్యాన్ని గొప్ప ఆపద నుండి కాపాడినతను ఎవరని రాకుమారుణ్ణి అడిగాడు రాజు. రాకుమారుడు తన చరిత్రనంతా రాజుతో చెప్పాడు. అప్పుడు రాజు, తన తల్లిని చూపించమని రాకుమారుణ్ణి అడిగాడు. రాకుమారుడు తన తల్లిని చూపాడు. తన తప్పును గుర్తించిన రాజు రాణిని, కుమారుడిని క్షమాపణ వేడాడు. ఆ తరువాత అందరూ కలిసి సుఖంగా జీవించారు.

 

కొత్తపల్లి .ఇన్ సౌజన్యం తో