TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
గురుభ్యోనమః
మనిషి జీవితంలో విద్య పోషించే పాత్ర చాలా పెద్దది. విద్య లేని వాడు వింత పశువు అన్నది పెద్దల మాట. విద్య లేకపోతే మనుషులేదో రాక్షసులు అవుతారని కాదు కాని విద్య వల్ల మనిషి కొన్ని విలువలు, క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని, తనకున్న ప్రాముఖ్యతను గుర్తించగలుగుతాడు. దురదృష్టవశాత్తు విద్య అనేది కేవలం సంపాదన కోసం అనే భావన చాలా గట్టిగా స్థిరపడింది ఈ రోజుల్లో. అయితే విద్యార్థిలోని ఆశక్తులను వెలికి తీసి అశక్తులుగా ఉన్నవారిని శక్తివంతమైన వారిగా తయారుచేసేవాడు ఉపాధ్యాయుడు. తల్లీ తండ్రీ గురువు, దైవం అన్నారు. మన పురాణాల్లో కూడా గురువు తర్వాతే దైవాన్ని స్తుతించారు.
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం అందరికి తెలిసినదే. అయితే ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన భారత మాజీ ఉపరాష్ట్రపతి మరియు మాజీ రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం ను ఇలా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం, రాధాకృష్ణన్ గారు అధ్యాపకుడిగా చేసిన కృషి మొదలైనవి తెలుసుకుంటే ఉపాధ్యాయ వృత్తి ఇంత శక్తి మంతమైనదా అనిపిస్తుంది.
ఉపాధ్యాయుడు అంటే??
ఉపద్యాయుడికి అనేక ఇతర పేర్లు ఉన్నాయి. గురువు, టీచర్, అధ్యాపకుడు ఇలా. అయితే పేర్లు ఎన్ని అయినా భావం మాత్రమే ఒక్కటే. శిక్షించేవాడో, శిక్షణ ఇచ్చేవాడో ఉపాధ్యాయుడు అవ్వడు. విద్యార్థులకు మార్గ నిర్దేశం చేస్తూ తాను మార్గదర్శిగా నిలిచేవాడు అసలైన ఉపాధ్యాయుడు అవుతాడు. కానీ ప్రస్తుత కాలంలో దీనికి పూర్తి వ్యతిరేకంగా ఉంది. విద్యావ్యవస్థ కూడా దీనికి కారణం అని చెప్పవచ్చు. ఎంతసేపు పాఠ్యాంశాలు పూర్తి చేయడం, పరీక్షలు పెట్టడం, ర్యాంకులు, మార్కులు వీటి గోడవలోనే విద్యార్థులను నడిపిస్తున్నారు నేటి ఉపాధ్యాయులు. ఇష్టంతో బోధించడం కంటే, కేవలం సాలరీ కోసం, కాస్త సెక్యురిటి ఉంటుందనే ఆలోచనతో ఉపాధ్యాయులుగా మారుతున్నవాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు.
విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం |
పాత్రత్వాత్ ధనమాప్నోతిధనాద్ధర్మం, తతః సుఖం ||
విద్య అనేది సక్రమంగా జరిగితే అది విద్యార్థిలో వినయాన్ని పోగు చేస్తుంది. వినయం ఉన్నపుడు విద్యార్థి అర్హత పొందగలుగుతాడు, అర్హత అనేది ఎప్పుడైతే కలుగుతుందో, అప్పుడు విద్యార్థి సంపాదనాపరుడు అవుతాడు. వినయం ద్వారా, అర్హత ద్వారా సంపాదించే డబ్బును ఆ వ్యక్తి కచ్చితంగా మంచి పనులకోసం ఉపయోగిస్తాడు. దీనివల్ల మనిషి జీవితం ధర్మబద్ధంగా కొనసాగుతుంది.
విద్య అనేది మనిషిని ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దగలదో చెప్పేది ఈ శ్లోకం. మరి అంతటి విజ్ఞానాన్ని విద్యార్థులకు అందించాల్సిన ఉపాధ్యాయుడు మళ్ళీ ఉత్తేజితుడై భావిభారత పౌరులుగా విద్యార్థులు మారడంలో తన వంతు పాత్ర పోషిస్తే. మన భారతం గొప్ప విద్యానిలయం అవుతుంది.
అలాగే జీవితంలో అమ్మ మొదటి గురువుగా మన జీవితానికి మొదటి అడుగు వేయిస్తుంది. తరువాత ఎదురయ్యే వాళ్ళు ఎందరో. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి నేర్పేవాళ్లే. అందుకే జీవితంలో ఎందరో అధ్యాపకులు. ఇంకా చెప్పాలంటే జీవితమే పెద్ద గురువు అని స్వామివివేకానందుడు ఊరికే అనలేదని అర్థం అవుతుంది.
ఉపాధ్యాయులు అందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. వృత్తికి వన్నె తెచ్చిన డా౹౹ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
◆ వెంకటేష్ పువ్వాడ