TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
అమ్మ మాట వినకపోతే
నేనూ, మా అన్న ఉండేవాళ్ళం, మా యింటికల్లా పిల్లలం. మా ఇంటికెవరేనా పిల్లలొస్తే మాకెంతో సంతోషంగా ఉండేది. ఎవరూ లేనప్పుడు, మేం చదవనప్పుడూ మేమిద్దరం ఆడుకునేవాళ్లం.
ఇలా ఉంటుంటే- మా యింటికి చుట్టాలొచ్చారు. వాళ్లతో వాళ్ల పిల్లలు ముగ్గురు వచ్చారు- సూర్యం, భాస్కరం, నారాయణ. మాకు లేక లేక నేస్తాలు దొరకడం మూలాన్నీ, మా నాన్నగారు ఇంట్లో లేని మూలాన్నీ ఆ వేళ మధ్యాహ్నం అంతా ఆటలాడేశాం. ఆ వేళ పౌర్ణమి రాత్రి వెన్నెట్లో దొంగాటాడుదాం అని పెంద్రాళే అందరం అన్నాలు తినేశాం. మా అన్నావాళ్ళు అప్పుడే మా యింటి ముందర సిద్ధంగా కూర్చున్నారు.
నేను కూడా వెళ్ళిపోతుంటే, మా అమ్మ అంది-"నాయనా! పొద్దున్నుంచి పుస్తకం ముట్టుకోలేదు కదా! ఇప్పుడేనా చదవరాదూ? రాత్రిళ్ళు ఆటలేమిటీ? పురుగూ పుట్రాను!" అంది. నేనన్నానూ-"అమ్మా! పొద్దున్నేకదే పుస్తకాల పెట్టి సర్దేనూ? పుస్తకం ముట్టుకోలేదంటావేం?" అని, అమ్మ ఒద్దంటున్నా కూడా వినకుండా పెరట్లోకి పారిపోయాను.
సరే, దొంగాటకి పంటలేసుకున్నాం. సూర్యం దొంగయ్యాడు. ఉన్నవాళ్ళలోకి నేనే కొంచెం చిన్నవాణ్ణి. అందుచేత నన్నే సూర్యం తరిమాడు. పరిగెడుతూ కంగారులో ఓ కప్పని తొక్కాను. బెదిరిపోయి నాలాగే గెంతుతున్న ఆ కప్ప నా కాళ్ళకింద పడింది. ఆ కంగారుతో వరండాలోకి పరిగెత్తాను. పొద్దున్న తిని పారేసిన అరిటిపండు తొక్కమీద కాలు పడింది. అది బోరగిల్లా ఉందేమో, పడీ పడ్డంతోటే కాలు జారి కింద పడ్డాను. తలకి, మోచేతికి దెబ్బలు తగిలాయి.
అప్పుడే ఆఫీసునుంచి వస్తున్న మా నాన్నారు నన్నప్పుడు తీసుకెళ్ళి పక్క మీద పడుకోబెట్టి సేదతీర్చిన తరువాత, తాపీగా నే చెప్పిందంతా విని ఫక్కున నవ్వి, అన్నారు: "చూశావా! అమ్మకి పెంకి సమాధానం చెప్పి, అమ్మ వద్దంటున్నా ఆటకి వెళ్ళినందుకు ప్రతిఫలం చూశావా! అమ్మ మాటే వినుంటే నీకు ఈ తిప్పలే లేకపోను గదా" అని బుద్ధి చెప్పారు. తక్కిన పిల్లలంతా బొమ్మల్లా నిలబడిపోయారు.
అప్పడ్నించి నేను అమ్మ చెప్పినట్లు విని బుద్ధిగా ఉంటున్నాను.
- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో