Facebook Twitter
అతి తెలివి

అతి తెలివి

 

ఓ ధనవంతుడికి తెలివితక్కువ కొడుకు ఒకడు ఉండేవాడు. ధనవంతుడికి తన కొడుకంటే చాలా ప్రేమ, వాడి తెలివితేటల మీద చాలా నమ్మకం. తన తర్వాత వ్యాపారాన్ని బాగా పెంచుతాడని ఆశ పడేవాడు.
కొడుకు వ్యాపారంలోకి వచ్చీ రాగానే "నేను ప్రపంచానికి అటు వైపున ఉన్న ఫలానా ద్వీపంతో వ్యాపారం చేస్తాను" అన్నాడు. "ఓడ నిండా సరుకులు తీసుకెళ్తాను; అక్కడినుండి వచ్చేప్పుడు విలువైన వస్తువులు తెచ్చి ఇక్కడ అమ్ముతాను!" అన్నాడు.

ధనవంతుడు సంతోషంగా ఒక ఓడను సిద్ధం చేసాడు. దాన్ని సరుకులతో నింపాడు. ఒక వంద కోట్ల రూపాయలు కూడా అందులో ఉంచాడు. "ఆ ద్వీపం మీద బంగారం ధర తక్కువ, రాళ్ల ధర ఎక్కువ బాబూ! కాబట్టి నువ్వు తిరిగి వచ్చేటప్పుడు ఓడ నిండా మంచి బంగారాన్ని తీసుకురా" అని చెప్పాడు కొడుకుతో.

"నీకెందుకు నాన్నా, అంతా నా మీద వదిలెయ్యి! ఏవి మంచివో అవే తెస్తాను!" అన్నాడు కొడుకు, తండ్రి చెప్పేది ఏమీ వినకుండానే.

అతను ఆ ద్వీపానికి చేరుకుని, తన దగ్గరున్న సరుకులన్నీ‌ మంచి లాభానికి అమ్మేసాడు. ఇక తిరిగి వస్తాడనగా, "ఇక్కడ ఏమేమి మంచి వస్తువులు ఉంటాయి?" అని వాకబు చేసాడు.
అక్కడ నిజంగానే బంగారం ధర తక్కువ; రాళ్ల ధర ఎక్కువ. "బంగారుదేమున్నది, రాళ్లైతే చాలా మంచివి కదా! " అన్నారు అక్కడి జనాలు. "అందుకనే రాళ్ల ఖరీదు ఎక్కువ చూడు- అవే విలువైనవి !"

"విలువైనవే తీసుకెళ్ళాలి" అనుకున్న కొడుకు, ఓడనిండా రాళ్లను వేసుకొని రాజ్యానికి తిరిగి వచ్చాడు. "అక్కడ ఉన్నవాటన్నిటిలోకీ ఇవే విలువైనవి. ఇవే రేటు ఎక్కువ" అని గర్వంగా చెప్పుకున్నాడు కూడా!

ఇది విన్న వ్యాపారి గుండె ఒక్కసారిగా ఆగినట్లైంది.

Courtesy..
kottapalli.in