Facebook Twitter
గనగనగనగా..

గనగనగనగా..

- టి.వంశి

అనగనగా ఇద్దరు మిత్రులు ఉండేవారు. ఇద్దరూ కలిసి అడవిగుండా ఆ పక్క ఊరికి వెళ్దామనుకున్నారు. దారిలో వారికి ఒక పెద్ద నల్లతాడు, ఒక అగ్గిపెట్టె దొరికాయి. ఇంకొంచెం దూరం పోగానే వారికి పుండుతో బాధ పడుతున్న ఒక గాడిద దొరికింది. దానిని నడిపించుకొని పోతుంటే వారికి దారిలో ఒక సున్నం డబ్బా, గడ్డపార కూడా దొరికాయి. ఇంతలో చీకటి పడింది. ’ఎట్లా’ అనుకుంటుండగానే ఒక గుహ కనిపించింది. దానిలో నిద్రపోదామనుకున్నారు. కానీ దానిలో దయ్యాలున్నాయి వారికేమో తెలియదు. ఒక తలుపు ఉంటే లోపలికి వెళ్ళి గొళ్ళెం పెట్టుకున్నారు. బయటినుండి రెండు దయ్యాలు వచ్చి తలుపు తీయమని అరవడం మొదలు పెట్టాయి. అవి ఎంత అరిచినా వీళ్లు తలుపు తెరవలేదు. అప్పుడు దయ్యాలు ’మీరు ఎవరు?’ అని అడిగాయి. వారు "మేము దయ్యాలము" అని చెప్పారు. "మిమ్మల్ని ఎలా నమ్మాలి?" అని అడిగాయి అవి. "మమ్మల్ని నమ్మాలంటే మా జుట్టు చూడండి" అని వాళ్ళు నల్లతాడును బయటికి చూపారు. "ఇంకా కావాలంటే మా ఉమ్మిని చూడండి" అని సున్నండబ్బాని కిటికీలోనుండి బయటికి వంచారు. దానితో బయటి దయ్యాలు భయపడ్డాయి. "మీ అరుపును వినిపించండి" అన్నాయి దయ్యాలు మళ్ళీ. వాళ్ళు అగ్గిపెట్టెతో నిప్పురాజేసి, గడ్డపారను ఎర్రగా కాల్చారు. దానితో గాడిద పుండును కాల్చారు. అది గట్టిగా అరిచి తలుపు విరిగేటట్లు ధనధనా తన్నింది. దాని వెనకే పరుగెత్తుకొచ్చిన మిత్రులిద్దరూ బయటికి దూకి, తమ చేతిలోని గడ్డపారతో దయ్యాల వెంటపడ్డారు. అవి రెండూ భయంతో తోకముడిచి పరుగుపెట్టాయి.