TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
దయ్యం
- పి. సయ్యద్
అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఇద్దలు బాల మిత్రులు. రాము, సోము వారి పేర్లు. ఒక సారి రాము, తనకు కావాల్సిన నోటుపుస్తకం ఒకదాన్ని సోము దగ్గరినుండి ఇప్పించుకున్నాడు. తీసుకున్న నోట్సును సోముకి తిరిగి ఇవ్వడానికి రాత్రి సమయంలో వెళ్ళాడు.
రాత్రిపూట ఒంటరిగా తమ ఇంటికొచ్చిన రాముతో సోము అన్నాడట, "ఒరేయ్ రామూ! ఇంత రాత్రిలో ఒంటరిగా వచ్చావా? ఇలాగ ఇంకెప్పుడూ రాకురా!" అని. అప్పుడు రాము "ఎందుకు సోమూ?" అని అడిగాడట. "రాత్రి వేళల్లో దయ్యాలు తిరుగుతాయిరా! అందుకనే రాత్రిపూట తిరగరాదు" అన్నాడట సోము. "ఏంటీ, దెయ్యాలా! అవెక్కడుంటాయి రా?" అనడిగాడట రాము. "అవా! అదిగో ఆ చింత చెట్లమీదుంటాయి" అని రెండు చింత చెట్లను చూపించాడట సోము. అది విన్న రాము గట్టిగా నవ్వి, "దెయ్యాలూ లేవు, భూతాలూ లేవు" అన్నాడట. కానీ సోము మాత్రం ఒప్పుకోలేదట. పైగా "నీకు దెయ్యాలు లేవని నమ్మకం ఉంటే, రేపు రాత్రికి వెళ్ళి ఆ చింతచెట్టు కొమ్మ మీద ఒక మేకు కొట్టిరా రామూ!" అన్నాడట. రాము సరే నన్నాడట. నిజానికి వాడికి కూడా దయ్యాలుంటాయేమోనని అనుమానమే. కాని పైకి మాత్రం లేని గాంభీర్యం నటించాడు అంతే.
మరునాడు అమావాస్య. రాము మిత్రునికిచ్చిన మాట ప్రకారం ఆ రాత్రికి ఒక మేకు తీసుకొని, సోము చూపించిన చెట్టు దగ్గరకు వెళ్ళాడు. భయం భయంగానే చెట్టును ఎక్కాడు. అత్రంగా మేకును చెట్టుకు కొట్టబోయాడు. బదులుగా దాన్ని తన ప్యాంటుమీదనే కొట్టుకున్నాడు. ఇక దిగి రావాలని ప్రయత్నించిన రాముకి తన కాలినేదో పట్టుకున్నట్టుగా అనిపింది. చీకటి మాపున ఆ పట్టుకున్నదేమిటో తెలియలేదు. నిజంగానే దయ్యం పట్టుకున్నదనిపించింది వాడికి. ఉన్న ధైర్యం కాస్తా ఆవిరైపోయింది. మనస్సునంతా భయం ఆవరించింది. ఆ భయంతోనే వణికిపోయాడు. కొమ్మపైనుండి కిందికి పడి, కాళ్ళు చేతులు విరగగొట్టుకున్నాడు.
అనుమానం ప్రాణ సంకటం. ఏ పనినైనా చెయ్యాలంటే ధైర్యంగా చేయాలి. భయపడుతూ చేసిన పనులు సజావుగా కాకపోవటంలో ఆశ్చర్యమేమున్నది?
కొత్తపల్లి .ఇన్ వారి సౌజన్యం తో