పుడమి తల్లి పదాలు -4
- పి. నీరజ
అదుపు తప్పిన ఖర్చు
తలకుమించిన ఖర్చు
పతనమునకు చేర్చు
ఓ పుడమి తల్లి
పదవి కోసము చెప్పు
తీపి మాటలు డప్పు
మనకు తెచ్చును ముప్పు
ఓ పుడమి తల్లి
కొంటె అల్లరి పిడుగు
రమణ రాసిన బుడుగు
గురువు పాలిట యముడు
ఓ పుడమి తల్లి
కోటికాంతుల వెలుగు
తేనె లొలికెడి తెలుగు
భాషలన్నిటి మెరుగు
ఓ పుడమి తల్లి
గాన గార్ధబ జంట
గాన పోటీ కంట
వెళ్లి పాడిన దంట
ఓ పుడమి తల్లి
రామనామ మధురిమ
అనుభవించిన హనుమ
తెలిపె జనులకు మహిమ
ఓ పుడమి తల్లి
తాను మెచ్చిన లలన
తెలివి తేటల లోన
అందె వేసిన జాణ
ఓ పుడమి తల్లి
నగ్న తార్ల జోరు
బూతు మాటల హోరు
తెలుగు సినిమా తీరు
ఓ పుడమి తల్లి
న్యూసు పేపరు లోన
కల్ల వార్తలు వున్న
నిజము తెలియుట సున్న
ఓ పుడమి తల్లి
మందులసలే లేని
వైద్యశాలలు అవని
భారతదేశపు ధరణి
ఓ పుడమి తల్లి
చదువు సంధ్యల యందు
ఆట పాటలందు
ప్రతిభ మనకే చెందు
ఓ పుడమి తల్లి
ప్రేమ అనుబంధాలు
భరత జాతి వరాలు
చెరిగి పోని పదాలు
ఓ పుడమి తల్లి
కుంభ కోణపు మంత్రి
జనుల కానని కంత్రి
మాట మర్చెడి కంత్రి
ఓ పుడమి తల్లి
పరుల ఇంటను అప్పు
తీసుకొనుటే తప్పు
తృప్తి లేనిచో ముప్పు
ఓ పుడమి తల్లి
సెక్సుకు విలువ వున్న
కథకు విలువలు సున్న
నేటి రచనలు కన్న
ఓ పుడమి తల్లి
బోరుకొట్టెడు కథలు
తెలుగు పలుకని ఘనులు
దూరదర్శను జనులు
ఓ పుడమి తల్లి
పసిడి పంటకు కరువు
నల్ల ధనమునకు నెలవు
రాజకీయపు ఎరుపు
ఓ పుడమి తల్లి
పారిజాతపు సుమము
అలకపురి పై రణము
తెచ్చె వైరము నిజము
ఓ పుడమి తల్లి
పగటి కలలను కనుచు
వున్న దానిని విడిచు
నరుడు చివరకు వగచు
ఓ పుడమి తల్లి చదువు
కొనుటకు వెళ్లు
యువతి యువకుల కాళ్లు
సినిమా హాలుకు మళ్లు
ఓ పుడమి తల్లి
జంట మర్రుల దోసె
గిరిని వేలిన మోసె
ఆలమందల కాసె
ఓ పుడమి తల్లి
అప్పు భార్యల కన్న
బృంద నాట్యము కన్న
రాధ చెలిమే మిన్న
ఓ పుడమి తల్లి
కృష్ణ పౌరుష నారి
సత్య గర్వపు నారి
కుంతి నిండగు నారి
ఓ పుడమి తల్లి
శకుని కపటపు కంత్రి
విదుర దేనువగు మంత్రి
సంజయు డలవగు మంత్రి
ఓ పుడమి తల్లి
విద్య వినయము నేర్చు
విద్య యోచన నేర్చు
విద్యమంచొన నేర్చు
ఓ పుడమి తల్లి
చెట్టు ఫలమును ఇచ్చు
గోవు పాలను ఇచ్చు
నరుడు శోకమును ఇచ్చు
ఓ పుడమి తల్లి
స్వాహ చేయుట వరకు
నాయకులకే ఇరుకు
లోటు బడ్జెటు మనకు
ఓ పుడమి తల్లి
పక్షిజాతికి వున్న
అయిక మత్యము మిన్న
మనకు అదియే సున్న
ఓ పుడమి తల్లి
కల్ల మాటలు వాని
దారి తెలియని వాని
వెంట వెళ్ళుట హాని
ఓ పుడమి తల్లి
గుడ్లగూబల జంట
గుడ్లు తినుటకు నంట
పగలు వెళ్లిన నంట
ఓ పుడమి తల్లి
జంతు జాలము అన్న
భూత దయతో వున్న
నరుడు ఉత్తము డన్న
ఓ పుడమి తల్లి
