ప్రేమమాయ౦ - సోమంచి ఉషారాణి
ప్రేమమాయ౦
- సోమంచి ఉషారాణి

ప్రేమిస్తే జగమంతా ప్రేమమయం
పెళ్ళయితే అదేమిటో ప్రేమమాయం
ప్రేమించినపుడు పొంగిపొరలే ప్రేమ
పెళ్ళయితే కనబడదు దాని చిరునామా!
ప్రేమించినపుడు చిరునవ్వు రువ్వితే చాలు
మరచిపోతామంటారు ముల్లోకాలు
పెళ్ళయితే 'ఎవడ్ని చూసి నవ్వుతున్నావు?
దవడ పేలిపోతుందంటారు!'
ప్రేమమైకంలో అరచేయి తగిలితే చాలు
అమరసుఖాల తేలుతారు
పెళ్ళయితే ఏమిటలా మీదపడతావు సానిలా
పవిట సరిచేసుకోమంటారు సంసారిలా!
ప్రేమ మత్తులో నిషాచూపుల హుషారులో
విషమిచ్చినా అమృతతుల్యం
పెళ్ళయితే కషాయంలా తగలడిందేం కాఫీ?
నషాళాని కంటిందే దరిద్రపు ముఖమంటారు
ప్రేమ మజాలో పలుకే బంగారమాయె
వేలకు వేలు కట్నమెందుకంటారు
పెళ్లి కాగానే లక్షల కట్నం తెలీదని
సలక్షణంగా తగలెడతారదేమిటో!



