ఒంటరితనం
శ్రీమతి శారద అశోకవర్ధన్

ఒంటరితనాన్ని
ఒక్కక్షణమైనా భరించలేను.
అంతకన్నా తుంటరుల మధ్య
మనగలుగుతా నేను.
ఒంటరితనం భయంకర రాక్షసి
ఒంటరిని చేసి మనస్సుని,
జాలంవేసి పట్టేసి జ్ఞాపకాల గతంలో
సముద్రంలోని అలల్లా ఎగిరెగిరి పడేస్తుంది
కడలిలోని హోరులా బోరుమని ఏడిపిస్తుంది.
అంతటితో ఊరుకోదు ఒంటరితనం
ఒక పట్టాన ఒదిలి పెట్టదు
గింజుకున్నా మనం వర్తమానపు కోరుకల్ని
వలవేసి పట్టేసి సమిధల్లా వాడుతుంది
మండుతూన్న మనస్సుకి.
ఈ మంటల్లోంచి
వెలుగే ఒస్తుందో చీకటే నిలుస్తుందో
తెలియని అయోమయావస్థ భవిష్యత్తు
చిత్తైన మనస్సుకి ఊహకందని శిఖరాల ఎత్తు.
అందుకే నాకు ఒంటరితనమంటే భయం
తెలిసిన నిజంకన్న
తెలియని అబద్ధం నయంలా,
నలుగురిలో వుంటే అన్నీ
నవ్వుతూ భరిస్తాను,
కానీ ఝడిపించే ఒంటరితనాన్ని
ఒక్క క్షణమైనా భరించలేను.



