Facebook Twitter
నవయుగ వైతాళికుడు

నవయుగ వైతాళికుడు


గురజాడ అప్పారావు
( 1862 - 1915 )

భాషా సాహిత్యాలు రచిస్తూ, దేశభక్తిని బోధిస్తూ, కళలూ దేశ హితానికి ఉపయోగపడాలంటూ ఆకాంక్షించిన నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు. వీరు 1862 సెప్టెంబర్ 21 న విశాఖ జిల్లా యలమంచిలి తాలుకా రాయవరం గ్రామంలో వెంకటరామదాసు, కౌశల్యమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించాడు. ప్రాథమిక విద్యనూ చీపురుపల్లిలో నేర్చుకున్నాడు. తరువాత బి.ఎ. వరకు విజయనగరంలో గిడుగు రామమూర్తితో కలిసి చదువుకున్నాడు. హై స్కూలు చదువులో ఉన్నప్పుడే శ్లోకాలు రాసేవాడట.

గురజాడ సాహిత్యంలో ప్రధానంగా మూడు విధాలుగా కొత్త మార్గాలను సృష్టించాడు. అవి భాష, వస్తువు, రూపం. గిడుగు రామ్మూర్తితో కలిసి వాడుక భాషను బహుళ ప్రచారంలోకి తేవడానికి తీవ్రంగా కృషి చేశాడు.కావ్యాలలో ఉపయోగించే భాష, మాట్లాడుకునే భాష ఒకే విధంగా ఉండాలని కేవలం ప్రచారం చెయ్యడం మాత్రమే కాకుండా వాడుకలో భాషలో '' కన్యాశుల్కం '' అనే నాటకాన్ని రాసి సంచలనం సృష్టించాడు.

వస్తువు కోసం ఏ పురాణాలని ఆశ్రయించాల్సిన పనిలేదని తమ ఎదురుగా ఉన్న ప్రజల జీవితాలనే కథ వస్తువులుగా తీసుకోవచ్చని చెప్పి ఎన్నో కథా కావ్యాలు రాసి ఆయా పాత్రలని తెలుగునాట చిరంజీవుల్ని చేయడమే కాకుండా ముత్యాల సరాలు అనే కొత్త ఛందస్సును సృష్టించి సంప్రదాయ బద్ధంగా వస్తున్న ఛందస్సులో నూతనత్వాన్ని ప్రతిపాదించాడు.


' తలుపు..తలుపు ' అంటూ తెలుగు కథానికా ప్రక్రియకి తలుపు తట్టిన గొప్పవాడు గురజాడ. ఆయన రాసిన '' దిద్దుబాటు '' అనే కథానిక తెలుగులో వచ్చిన మొట్టమొదటి కథానిక. ఇంకా అనేక కవితలు, వ్యాసాలు రాసి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేయడమే కాకుండా జాతిబందాలు అనే గొలుసులు జారిపోవాలని, మతాలన్ని మాసిపోయి జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగుతుందని, వర్ణ భేదాలన్నీ కళ్ళ కావాలని, ఈ లోకమంతా ఒక ఇల్లుగా ఉండాలని కోరుకున్న గొప్ప మానవతావాది గురజాడ.

గురజాడ 1884 లో విజయనగరం మహారాజా కాలేజి హైస్కూలులో ఉపాధ్యాయ పదవిని, ఆ తరువాత రెండేళ్లలోనే డిప్యూటి కలక్టర్ ఆఫీసులో హెడ్ క్లర్క్ పదవిని, మరు సంవత్సరం కళాశాలలో అధ్యాపక పదవిని నిర్వహించి ఆ తరువాతి సంవత్సరం రాజావారి ఆస్థానంలో చేరాడు. 1906 లో పాఠశాలల్లో తెలుగు బోధనా భాషకోసం తూర్పు జిల్లాల విద్యాధికారి జె.ఎ.ఏట్స్ తో, విశాఖపట్నం మిసెస్ ఎ.వి.ఎన్.కళాశాల ప్రిన్సిపాల్ పి.టి. శ్రీనివాస అయ్యంగారుతో, పర్లాకిమిడి కళాశాల అధ్యాపకుడు గిడుగు రామమూర్తితో కలిసి వాడుకభాష కోసం మహోద్యమాన్ని ప్రారంభించాడు. 1911 లో మద్రాసు యూనివర్సిటి బోర్డ్ ఆఫ్ స్టడీస్ లో సభ్యత్వం లభించింది. అయితే ఈ యూనివర్సిటి వాడుక భాషకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడంతో తన అసమ్మతిని తెలుపుతూ '' అసమ్మతి పత్రం '' సమర్పించాడు.

" దేశమును ప్రేమించుమన్న
మంచియన్నది పెంచునన్న
వొట్టి మాటలు కట్టిపెట్టోయి
గట్టిమేల్ తలపెట్టవోయి "
అంటూ దేశభక్తి గీతాన్ని రచించిన మన గురజాడ 1915 నవంబర్ 30 న మరణించాడు.