మనసా! తెలుసా? - వడ్డెపల్లి కృష్ణ
మనసా! తెలుసా?
- వడ్డెపల్లి కృష్ణ
ఒడ్డు చేరేదాక ఎవడైన గానీయి
తెడ్డు వేయంటాడు మనసా!
ఏరు దాటంగనే ఏమిటో గాని మరి
ఎవరు నీవంటాడు తెలుసా?
ఓటు అడిగే నాడు ఏ నాయకుండైన
ఒదిగి దండం బెట్టు మనసా!
కాని గెలిచాడంటె కర్తవ్యమే మరచి
కాటేయ తలపెట్టు తెలుసా?
కష్టపడు నాడేమొ కన్నీటి ప్రతివాడు
కాదు విధేయత చూపు మనసా
కాలమే కలిసొచ్చి కలిమి పెరిగిందంటె
కళ్ళు మీదికి పోవు తెలుసా?
యవ్వనమ్మున మనిషి జీవితమ్మున వెలుగు
కొవ్వొత్తి లాంటిదే మనసా
కొవ్వు కాస్తా కరుగ ఆరి పోయేడు రీతి
కోరికలు అణగారు తెలుసా?



