తెలుగువన్-అక్షరయాన్ సంయుక్తంగా నిర్వహించిన ఉగాది కవితల పోటీలో కన్సొలేషన్ బహుమతి రూ. 516 గెలుపొందిన కవిత
యుద్ధం మనకేం కొత్త కాదు అనాది నుండి అతివకు
‘అవనిలో సగం ఆకాశంలో సగం' భాగమంటూ
శాసన సభలో సీట్లకు ...ఇంట్లోని పాట్లకు
నిర్భయ ఉదంతానికి దిశ న్యాయానికి
బాధితుల రక్షణకు బాధ్యులైన వారి శిక్షకు
ఇంటా బయటా సమాన హక్కులకు శారీరక మానసిక రక్షణకు
కన్నబిడ్డలను కన్నవాళ్ళను నమ్ముకున్న వాళ్ళను
నట్టేట ముంచకుండా వారిని రక్షిస్తూ మనల్ని మనం పరిరక్షించుకుంటూ
కంటికి కనపడని యుద్ధాలెన్నో చేసాం
అందుకే యుద్ధం మనకు కొత్తకాదు
కాని ఇప్పుడు చేయాల్సిన యుద్దమే కొత్త ...
యుద్ధం చేయాల్సింది ఏ వ్యక్తీ పైనో ఏ పాలకుల పైనో కాదు
కంటికి కనబడకుండా క్షణ క్షణం రాకాసి భూతంలా
విజృంభిస్తున్న ‘కోవిడ్ -19’ వైరస్ మీద
మన మనో సంకల్పాన్ని మన భారత సంస్కృతీ సంప్రదాయాల్ని
పరీక్షించడానికి వస్తున్న మహమ్మారి మీద
పూర్వం మశూచి ప్లేగులెన్ని చూడలేదు
నిబ్బరంగా అందరొక్క తాటిపై నిలబడి ఎన్ని తరిమేయలేదు
ఐకమత్యంగా దీక్షబూని ఎన్ని అవాంతరాలను నివారించలేదు
ఈ పవిత్ర భూమిపై ఎన్ని నూతనావిష్కరణలు పురుళ్ళు పోసుకోలేదు
సహకారం, పరోపకారమే మిన్నయని ఎన్నిసార్లు నిరూపించలేదు
ప్రతి మహిళా నారీ శక్తిగా మారి కుటుంబానికి లక్ష్మణ రేఖ కావాలిప్పుడు
ఉన్నదాంట్లో కలోగంజో కల్సి తిందామని కట్టుబాటు చేయాలి
కుటుంబ సభ్యులంతా కల్సి ఉండే ఈ సమయం
యోగా వ్యాయామాలతో సద్వినియోగ పరుచుకునేలా
వ్యక్తిగత పరిశుభ్రత సామాజిక దూరం పాటిస్తూ
రోగనిరోధక శక్తి పెంచే మన వంటింటి చిట్కాలు అమలుచేస్తూ
అన్ని పనుల్లో అందరినీ భాగస్వామ్యం చేస్తూ
పాలకుల మాట పాటిస్తూ రోడ్లపైకి రాకుండా సహకరిస్తూ
కరోనాపై ప్రత్యక్ష పోరాటం చేస్తున్న
ఆపద్బాంధవులైన వైద్యులు, పోలీసులు, పారామెడికల్ సిబ్బంది
రక్షక భటులు, కొరియర్లు, వాలంటీర్లకు
శతధా సహస్రదా వందనాలర్పిస్తూ
వాక్సిన్ మందులకన్నా మిన్నగా ‘సామాజిక దూరం' కనుగొన్న
అమలుపరుస్తున్న పాలకులకు నమోవాకాలర్పిస్తూ
భౌతికంగా ఒక్కరొక్కరుగా విడిపోయినా
ఐకమత్యంగా ఉండి కరోనాను తరిమేద్దాం
పరిశుభ్రతతో కరోనాను పాతేద్దాం
సామాజిక దూరంతో సంక్రమణం కాకుండా చంపేద్దాం
ఇంటికే పరిమితమై వంటికి ఇంటికి కుటుంబానికి సమాజానికి సాయం చేద్దాం
భావితరానికి మార్గదర్శకంగా నిలుద్దాం
- నామని సుజనాదేవి
