Facebook Twitter
తులసీదాసు దీవెన

గొప్ప రామభక్తుడైన   తులసీదాసు కాశీ క్షేత్రంలో  ఉంటూ రాముని  మహిమలు కీర్తిస్తూ గానం చేసేవాడు. ఆయన ఆశ్రమంలో నిత్యమూ రాముని కీర్తిస్తూ  భజనలు చేసేవారు. రామనామగానంతో పరిసరాలు మారుమోగేవి.  
అలా జరుగుతుండగా , ఒకరోజు  తులసీదాసు ఆశ్రమంలో నిత్య పూజా విధులు పూర్తి చేసి  హారతి ఇస్తుండగా  భక్తులందరితో బాటు ఒక భక్తురాలు  హారతి పుచ్చుకుని,  తులసీదాసు పాదాలకు  నమస్కరించింది. 
అలా చేయవద్దని ఆ భక్తురాలిని వారించాడు తులసీదాసు. పాదాలకు వొంగి నమస్కరించిందన్న అభిప్రాయంతో ఆ భక్తురాలిని   ‘దీర్ఘ సుమంగళీభవ’ అని ఆశీర్వదించాడు.  తనకి అందుబాటులో ఉన్న  పళ్లెంలోని  పువ్వులను, కొంత  కుంకుమను  చేత్తో అందుకుని  ఆమెకు ఇవ్వబోయాడు. 

కానీ ఆ భక్తురాలు భయంతో ఒక్క అడుగు  వెనక్కు వేసింది. 
 “అపచారం  అపచారం స్వామీ “ అంది భయం నిండిన కళ్లతో.  
ఆమె ప్రవర్తనకు ఆశ్చర్యపోయాడు తులసీదాసు. 
“ఏమైంది తల్లీ ! ఎందుకలా భయపడుతున్నావు? రాముని సన్నిధిలో ఉన్నావు . ఇక్కడ నీకేమీ భయం లేదు. విషయమేమిటో చెప్పు తల్లీ ” అని అడిగాడు   తులసీదాస్. 

 ఆ భక్తురాలు తన  కళ్ళలో కన్నీరు ప్రవహిస్తుండగా  “స్వామీ ! మీది అమోఘమైన వాక్కు అని తెలుసు. కానీ నాకంత  అదృష్టం లేదు”  అని బదులిచ్చింది. 

“ ఏం జరిగిందో చెప్పు తల్లీ. అది  నా వాక్కు కాదు. నా నోట సాక్షాత్తు రాముడు పలికించిన వాక్కు . నా పట్ల కాకుండా రాముడి పట్ల విశ్వాసం ఉంచి జరిగిందేమిటో చెప్పు” అన్నాడు  తులసీ దాసు దయగా.

ఆమె చెప్పడానికి ఇంకా సంశయిస్తుండడంతో తులసీదాసు   “శ్రీరాముడిది ఒకేమాట, ఒకే బాణం, ఒకే పత్ని అని తెలుసు కదా. ఆయన పలికించిన నా నోటిమాట అసత్యమౌతుందన్న మీ  అపనమ్మకానికి కారణమేమిటో చెప్పమ్మా?” అని మళ్లీ అడిగాడు. 

అప్పుడా భక్తురాలు  “ నా భర్త కాసేపటి క్రితమే చనిపోయాడు. ఇప్పుడు  శవ సంస్కారానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడి ఆచారం ప్రకారం నా భర్తతో కలసి సహగమనం చేయడానికి సిద్ధపడి,  ఆఖరిసారి మీ దర్శనం చేసుకుని శ్రీరాముణ్ణి  మ్రొక్కి వెళ్లడానికే వచ్చాను” అంది జాలి కలిగేలా.

ఆ మాటలకు  ఒక్క క్షణం కలత చెందాడు  తులసీదాసు. 

అయినప్పటికీ వెంటనే తేరుకుని “అమ్మా! నీవు సుమంగళివి. రాముని మాటకు ఎదురులేదు” అని ఆశీర్వదించాడు.  ఆమెను ధైర్యంగా ఇంటికి వెళ్లమన్నాడు.  
    
 ఆ భక్తురాలు మరోసారి రాముడుకీ , తులసీదాసుకి నమస్కరించి తిరిగి  ఇంటికి వెళ్లింది. 

  అప్పటికే బంధుమిత్రులు ఆమె రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఆ భక్తురాలు పాడె మీదున్న భర్త శవం చుట్టూ మూడుసార్లు   ప్రదక్షిణ చేసి భర్త  పాదాలకు నమస్కారం చేసింది. ఆ సమయంలో తులసీదాసు ఇచ్చిన  పువ్వులు ఆమె తలమీద నుండి శవం మీద పడ్డాయి. మరుక్షణం శవం కాళ్ళు కదిలిన భావన కలిగిందామెకు.  

కానీ మనసులోని ఆశ్చర్యాన్ని బయటకు కనబడనీయకుండా   భర్త  ముఖం వైపు చూసిందామె. అక్కడ అద్భుతం జరిగిందా అన్నట్టు ఆమె భర్త  ఊపిరి పీల్చుకుంటున్నాడు. అప్పటికి ఆమెకు నమ్మకం కలిగి  తన సంతోషాన్ని బయటకు వ్యక్తపరుస్తూ చుట్టూ  ఉన్న బంధువులను పిలిచి తన భర్త శరీరాన్ని చూడమంది. 

అక్కడకి చేరిన ప్రతి ఒక్కరూ ఒక వైపు ఆశ్చర్యం మరోవైపు సంతోషం పొందారు. మరుక్షణం ఆ భక్తురాలి భర్త శరీరానికి  కట్టిన కట్లు విప్పారు. అప్పుడు ఆమె భర్త కళ్లు తెరచి వారందరినీ చూసాడు. 

అదొక అద్భుత , అపురూప సంఘటనగా అక్కడి వారు చెప్పుకున్నారు.చనిపోయిన మనిషిని తులసీదాసు దీవెన బ్రతికించిందని ఘనంగా చెప్పుకున్నారు. 
అప్పటినుండి తులసీదాసు మీద ప్రజలకు మరింత భక్తివిశ్వాసాలు పెరిగాయి. రామభక్తి ఇంకా బలంగా  వ్యాపించింది.