Facebook Twitter
వంకాయకి బదులు బీరకాయ!!

సాయంత్రం ఆరవుతుండగా చటుక్కున రామానికి ఓ గొప్ప ఆలోచనవచ్చింది. సమస్త ఇంటిగోలకు విరుగుడు  చెప్పగలిగేది రామగుండ స్వామి ఒక్కడే అని. అంతే వెంటనే ఆయన ప్రవచనం ఎక్కడుందో కనుక్కొని మరీ స్కూటర్‌ మీద రివ్వున వెళ్లాడు.  ఇసుకేసినా కిందపడని జనంతో రామగుండస్వామి ప్రవచనం చెప్పడానికి బుక్ చేసుకున్న స్టేడియం  నిండిపోయింది. సరిగ్గా ఏడవుతుండగా స్వామి దర్శనమైంది. ఆయనేం పెద్ద ఆజానుబాహుడేమీ కాదు గానీ ముఖం కనపడకుండా భక్తులకు కేవలం కుంకుమ బొట్లతోనే దర్శనమిచ్చాడు. ఆయన త్రిశూలం పక్కన బెట్టుకుని, చెంబులోంచి కాసిని నీళ్లు తాగి మైకు దగ్గరకు లాక్కున్నాడు. ‘శివోహం’ అన్నాడు గట్టిగా. అంతే అప్పటిదాకా మిర్చీలు, పావుబాజీలు, ఇంటిగొడవలతో సరదా కబుర్లలో ఉన్న భక్తులంతా అలెర్ట్‌ అయి ‘ఓహోం’ అన్నారు. 
నాయనలారా! మనసు ప్రశాంతతే ముఖ్యం. అదిలేకుంటే కొంప కొల్లేరే అవుతుంది. ఎంత పెద్ద భవంతిలో ఉన్నా, బంగారు దుకాణాలున్నా అది లేందే అడుగేయలేం. మన ఆలోచనలేవీ ముందుకు సాగవు. అంచేత దేన్ని గురించి ఎవరితోనూ కొట్లాటకు దిగవద్దు. చక్కగా నవ్వుతూ అన్ని భరించి మీ పని మీరు చేసుకుంటూ పోండి.  శివుడున్నాడు.. వాడే అంతా చూసుకుంటాడు! అనేసి స్వామి వారు ధ్యాన ముద్రలోకి జారుకున్నారు. ఓ పదిహేను నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి చూస్తే పట్టుమని పదిహేను మంది మిగిలారు, షామియానాలు, పట్టాలు ఎత్తుకెళ్లడానికి.  అయితే ప్రసంగం మధ్యలో ఒక్కమాట చెప్పారాయన.  ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టండి అని. మతిమరుపు పెరగకుండా ఉండడానికి గొప్ప సూత్రం అనుకున్నారాయన. దానికి ప్రశాంతతకి సంబంధమేమిటని రామానికి లేనిపోని అనుమానం తలెత్తింది.
 రాత్రి ఎనిమిదిన్నరకి ఇల్లు చేరిన రామానికి గేట్లోనే ఒక స్టీలు గ్లాసు కాలికి తగిలింది. అంతే ఒళ్లు మండిరది. లోపలికి వెళ్లి భార్య మీద అరిచాడు..గ్లాసు అలా పారేశావేమిటని. వచ్చేటప్పుడు తెచ్చారుగా గోల చేయకండి. పిల్లాడు ఆడుతూ అటు విసిరేసినట్టున్నాడు. మర్చిపోతానేమో వంటింట్లో గిన్నెల అరలోనే పెట్టండి. ఆనక వెతుక్కు చావాలి.. అని చిన్న హెచ్చరిక చాలా మర్యాదగా చేసింది. భోజనానంతరం ఓ అరగంట పచార్లు చేస్తూ వస్తువుల సర్దుడు కార్యక్రమ రహస్యం గురించి ఆలోచించాడు. వెంటనే లోపలికి వెళ్లి చూస్తూ డైనింగ్‌ టేబుల్‌ మీద అతని అద్దాలు, హాల్లో టేబుల్‌ మీద మనవడి విరిగిన బొమ్మతో పాటు సగం తిని వదిలేసిన అన్నం కంచం దర్శనమిచ్చాయి. రామానికి ఒళ్లు మండిరది. తీసి జాగ్రత్తగా ఏవి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేశాడు. భార్యారత్నం చూసి కాస్తంత నవ్వుకుంది.

మర్నాటి నుంచి చాలా స్ట్రిక్ట్‌గా ఆమె వదిలేసిన వస్తువులన్నీ వాటి స్థానాల్లోకి చేర్చడంలో నిమగ్నమయ్యాడు. గ్లాసులు, చెంచాలు, గిన్నెలు, పార్సిల్‌ కవర్లు వగైరాలన్నీ. ఆయన మర్చిపోయిన వాటిని మాత్రం  ఆమె   ససేమిరా ముట్టుకోలేదు.  ఆర్టిస్టిక్‌ మైండ్‌ లేదంటాడని ఆమె భయం. ఆయన తనలా గొప్పగా ఆలోచిస్తూ కనీసం హాలు వరకైనా నీట్‌గా ఉంచాలమ్మా అన్న గొప్ప రచయితల స్టేట్‌మెంట్లను ఆలవోకగా చెవులు వాచేట్టు ఉటంకించి చంపు తాడని కూడా ఆమె భయపడింది.  ఇలా నాలుగు రోజులు గడిచింది. ఐదో రోజు ఈ వస్తువులను వాటి స్థానాల్లో పెట్టడంలో తను చేయాల్సిన పని, చేస్తానని వాగ్దానాలిచ్చిన పనీ రెండూ ఒక్కసారిగా మర్చిపోయాడు రామం.  ఐదోరోజు ఉదయాన్నే ‘రామంగారూ.. ఇంతకీ నేను చెప్పిన పని అయిపోయిందా! పెద్దాయన ఒకటే ఫోన్‌ చంపుతున్నాడు సుమా’ అంటూనే లోపలికి వెళ్లాడు వెంకట్రావు. ఆయన్ను చూడగానే ఒక్కసారిగా సమస్త దేవతలు  కనిపించారు రామానికి. చచ్ఛాంరా ఫో! అనుకున్నాడు పైకే!

తాను చేయవలసిన పని అలానే ఉంది. హాలు సగం ముస్తాబయింది. వంటిల్లు అలానే ఉంది. వరండాలో  కుర్చీ కాలు విరిగి అలానేవుంది. రామం మనసులోంచి వెంకట్రావు వెళిపోయాడు! ఏమిసేతురా లింగా.. అని పాడు కోవడానికీ ఆయన క్షణం వీలుపడనీయలేదు. మెత్తగా తిట్టి మళ్లీ కలుద్దామన్నాడు.రామానికి ఉన్న ప్రశాంతతా పోయింది. స్వామిని తిట్టుకున్నాడు.. భార్యమీద విరుచుకుపడ్డాడు.. రాయాల్సిన కాయితాలతో మనవడు పతంగులు తయారీలో నానా కష్టాలు పడుతున్నాడు.

రామానికి కోపం నషాళానికి అంటింది.. మనవడు తన ఆర్టిస్టిక్‌ మైండ్‌తో చేసిన వంకరటింకర పతంగుని చూపించాడు. ఇప్పుడు తిట్టాలా, నవ్వాలా, ఏడవాలో అర్ధంకాలేదు. భార్యామణి భర్తగారి డొక్కు సర్దుడుని ఆమె ఆలోచనా పంథాలో సరిచేయడంలో తలమునకలై వంకాయకి బదులు బీరకాయ కూర  చేసేసింది.