
మా వెనకవీధిలో రావుగారి కూతురు మాల. మా మనవడు తేజ పదో తరగతి చదువుతున్న స్కూల్లోనే ఏడో తరగతి చదువుతోంది. మంచిపిల్ల, బాగా చదువుతుంది. ఆ మధ్య ఏదోపోటీలో చిన్న ప్రైజ్ ఏదో వచ్చింది. అది చూపించడానికి మా యింటికి మొన్న ఆదివారం వచ్చింది. చిన్న షీల్డ్ మీద దాని పేరు రాసుంది. సేవాకార్యక్రమంలో బాగా పనిచేసినదానికి గుర్తింపుగా ఇస్తున్నామని రాసుంది. అందరం ఎంతో సంతోషించాం. మధ్యాన్నం దాకా ఇంట్లోనే ఉండి తేజకి చూపించండి అంటూ ఆ షీల్డ్‌ని మా ఆవిడకి ఇచ్చి వెళ్లింది. మధ్యాన్నం భ్పుోనాల టైమ్‌కి వచ్చాడు తేజా.
వాడికి దాని సంగతి చెప్పగానే అప్పటిదాకా ఫ్రెండ్స్‌తో ఆడివచ్చినవాడు ఒక్కసారిగా కసురుకున్నాడు. ఏదో చిన్నవాడులే అనుకున్నాం. గ్రౌండ్‌లో అప్పటికే బ్యాట్ గురించి గొడవపడి వచ్చాడని మోచేతికి తగిలిన దెబ్బల రహస్యం చెప్పాడు..అదీ వాడి అమ్మమ్మ మరీ అడిగితేగాని చెప్పలేదు. సరే ఇంతకీ మాల సంగతి మాత్రం వినిపించు కోలేదు. గదిలోకి పరుగున వెళ్లినవాడిని వాళ్ల బాబాయి బుజ్జగిండానికి శతవిధాలా ప్రయత్నించాడు. ప్లీజ్ బాబాయ్..నా మనసేం బాగాలేదు..కోపం తెప్పించకు.నేను వినను. దానికి ప్రైజ్ వస్తే నేనేం చెయ్యను?’ అని బాబాయ్‌ని గెంటేసినంత పనిచేశాడు.
‘అదిగాదు నాన్నా..మరీ అంత కోపమైతే ఎలారా?’ అంటూ వాళ్లమ్మ ముద్దాడబోయింది. ససెమిరా అని పరుగునబోయి వీధి గేటుదగ్గర వేపచెట్టువెనక నక్కి కూచున్నాడు. ఇంటిల్లపాదీ వాడిని శాంతింపచేసి లోపలికి తీసుకురావాలని విశ్వయత్నాలుచేసినా ఎన్ని ఆశలు చూపినా వినిపించుకోలేదు. పైగా అందరిమీదా అరిచాడు. నన్ను మోసం చేశారన్నాడు. నిన్ను మోసం చేయడవేవిట్రా పిచ్చివెధవా..అని వాళ్ల అమ్మమ్మ అరిచింది.
‘మొన్నటికి మొన్న లెక్కల టెస్ట్ పెడితే నా సాయం తీసుకునేగదా రవి, సుకుమార్ మంచి మార్కులు తెచ్చు కుంది. అంతెందుకు గత ఆదివారం మ్యాచ్‌లో గొడవయితే రవిగాడికి మద్దతుగా వుండి దెబ్బలు తిన్నదీ నేనేగా నన్ను ఎందుకు గుర్తించలేదు. వాడినే మీరంతా సమర్ధించారు. బాగా అడాడు, బాగా స్కోర్ చేశాడని నాన్న కూడా అన్నారు. అలా అంటారు. మాలా వాళ్ల డాడీ కూడా అంతే..సురేష్‌గాడు వాళ్ల తమ్ముడిని కొడితే నేనే కాపాడాను. కానీ ఆయన మాత్రం నీ వల్లే అంతా జరుగుతోందిరా అన్నారు. పైగా హెడ్‌మాస్టర్ పిలిచి కొట్లాటలు, గిల్లికజ్జాలుపెట్టడం కాదురా ఆ తెలుగు నాలుగు ముక్కలు నేర్చుకోవచ్చుగా అని శ్రీలక్ష్మి ముందు తిట్టారు. ఎంత అవమానించారు! ఇదేమీ మీకు తెలీదు..’ అనీ కోపగించుకుని ఏకంగా గోడెక్కి కూచున్నాడు.
అవన్నీ సరేరా.. ఇప్పుడు మరీ అంత కోపగించుకోవాల్సిందేమీ లేదు. నువ్వు తెలివిగలవాడివే.. కానీ అదేదో చదువుమీద, నీ మీద కాస్తంత చూపరా.. వాళ్ల గొడవెందుకు? అంటూ తేజ పిన్నీ, మా ఆవిడా ఏక కంఠంతో అరిచి మరీ చెప్పారు. ప్రభావం శూన్యం!
‘పోయిన నెల బాలా వాళ్ల ఏరియాలో ఎవరితోనో గొడవపడ్డావట? నీకేమన్నా వెర్రా, పిచ్చా? సురేషో, సావనీరో..ఏదో పేరు.. వాడు ఎలా వుంటే నీకేమిట్రా? వాళ్ళింటి దగ్గర చెట్టు పీక్కొస్తానంటావేమిటి? నీకు బుద్ధుందా పైగా చెప్పాచెప్పటకా మొన్నెపుడో గులాబీ మొక్కలు పీకిపడేసి మీకలానే కావాలని వాళ్లని తిట్టావట? నీవయసెంత? నువ్వెంతరా? అలా వాళ్లని బెదిరిస్తావా? నువ్వేమైన రౌడీవా, ముఠా వుందా? పిచ్చివెధవ? పళ్లు రాలగొడతా యింకోసారి అటుగా వెళ్లావంటే!’ అని వాడి బాబాయ్ స్వరాన్ని నేనూ అందుకున్నాను. తేజ ముఖం ఎర్రగా అయింది. ఉక్రో షంతో ఉన్నాడు. చిన్న రాయి ముక్క తీసుకుని వీధిలోకి విసిరాడు.
‘వీడేదో చదువులో కాస్తంత వెలగబెడుతున్నాడని, స్థిరంగా ఉంటాడని వీధిలో అనుకుంటున్నారంతా ఇటు చూస్తే కోపిష్టి, గొడవలమారిగా తయారేవిటే నీ కొడుకు’ అంటూ అమ్మ మా ఆవిడకి క్లాస్ పీకింది. సాయింత్రం ఆరవుతుండగా మాల పరుగున వచ్చింది. దీనిచేత చెప్పిస్తేనన్నా దిగివస్తాడని అంతా భావించాం. ఆ పిల్ల వస్తూనే తేజని గోడమీద కూచోని వుండడం చూసి ‘హాల్లో కూడా కూచోవచ్చురా!’ అంటూ గేలిచేసింది.
‘నీ బొందే.. బోడి ప్రైజ్ నువ్వూ!’ అనేశాడు. ‘నేను పోటీలో గెలిచి సాధించింది. నీలా తన్నులు, తిట్లూ తినలేదు.. గుర్తుంచుకో!’ అన్నదా పిల్ల. ‘అవును మామ్మగారూ.. వీడు మొన్న క్లాసులో నా ఫ్రెండ్‌ని తిట్టాడు.. సాయింత్రం దాని అన్న వచ్చి ఒక్కటి పీకాడు.. చెప్పలేదా!’ అంది మాల.
తేజకి కోపం మూడింతలై ఒక్కసారిగా గోడ దూకి దాన్ని వెంబడించాడు. మాల పరుగున వెళ్లి హాల్లో కుర్చీల వెనక దాక్కుంది. అందరం అలా హాల్లో చేరాం. మా ఆవిడ దాన్ని దగ్గరికి తీసుకుని రక్షించింది.
‘ఏంటే వాగుతున్నావ్.. నేను రాసిచ్చింది చదివి, నాలుగు ముక్కలు రాసి, మాట్లాడగానే నీవో పెద్ద విజేతవా? నిజానికి ఆ షీల్డ్ నాది. నీ పేరుందని నీదయిపోదు.. గుర్తుంచుకో!’ అని అరిచాడు తేజ.
‘వాళ్లు ఇచ్చింది నాకు.. నా పేరుంది చూడు సరిగ్గా.. నీదెలా అవుతుంది. ఏదో చిన్న సాయం చేశావని చూపించడానికి తెచ్చాను. ఆంటీ, అంకుల్ చూస్తారని ఇచ్చి వెళ్లాను. అంతేగానీ అది నీదయిపోదు.. పిచ్చి వేషాలు వేయకురోయ్!’ అని మాల కౌంటర్ ఇచ్చింది.. నేను వెనకే ఉన్నానన్న దైర్యంతో. ‘అవునురా.. అది పరీక్షరాసి తెచ్చుకున్న ప్రైజు నీదెలా అవుతుందిరా పిచ్చి సన్నాసీ!’ అడిగింది మా అమ్మ.
‘మామ్మా! ప్లీజ్.. నీకు అర్ధం కాదు. అదంతా దాని పన్నాగం..’ అని మాల వేపు చూశాడు. ‘ఏడిశావ్‌గాని ఏడున్నరవుతోంది.. స్నానం చేసిరా తిని చదువుకుందువుగానివి’ అన్నాను. ‘అయితే ఒక షరతు ఈ షీల్డ్ కావాలి!’ అన్నాడు తేజ.
‘ఇది మరీ బాగుందిరా..చిన్నపిల్ల చక్కగా చదివేది.. దాన్ని ఏడిపిస్తావేంట్రా!’ అంది మా ఆవిడ.
‘అదంతా కాదు..ఈ షీల్డ్ చూడ్డానికీ బాగుంది.. దాని పేరుండవచ్చుగాక.. నేను ఉంచేసుకుంటా. అంతే!’
‘బుద్ధున్నాడికి ఒక్క మాట చెప్తాం.. నీకెలా చెప్పగలం.. సేవ్.. రేపు రావే.. తీసికెలుదుగానీ’ అని మాలని పంపేసింది మా అమ్మ.
అందరూ టెన్త్ తేజాని వాడి కోపాన్ని, అర్ధంలేని వాదనని భరించి నవ్వుకుంటూ ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లారు. నేను మాత్రం అలా చూస్తుండి పోయాను. తేజా ఆ షీల్డ్ చూస్తూ నవ్వుకుంటూ గదిలోకి వెళ్లాడు.
‘అబ్బాయ్.. వీడేవిట్రా ఇలా తయారయ్యాడు..నువ్వేనా బుద్ధిచెప్పు’ అంటూ అమ్మ అంది.
‘వీడు రాను రాను మరీ నా ప్రాణానికి ట్రంప్‌లా తయారవుతున్నాడు’ అని తినడానికి వెళ్లాను.
మర్నాడు మరీ విడ్డూరం జరిగింది..
ఉదయాన్నే మా బెడ్‌రూమ్ బయట గోడకి కాయితం అంటించి ఉంది. దాని సారాంశం ఇది..
‘అన్ని విధాలా సాయం చేసినందుకు తేజకి మాల బహుమతి’ అని రాసి దాని కింద ఆ షీల్డ్ బొమ్మ వేసుంది.ఆ బొమ్మ కింద మాల చేసినట్టు పెద్ద సంతకం కూడా!!



