Facebook Twitter
కలలను మోసుకు తిరుగుతున్న కవి

‘అక్షరాలకు పురుడు పోసి నడకలు నేర్పుతాను
స్పందనల వెల్లువలో  నిలువెల్లా తడుస్తూ 
కవిత్వమై జాలువారుతాను’
 
ఇవి మద్దికుంట లక్ష్మణ్ రాసిన ‘కలం’ అనే కవితలోని పాదాలు. అక్షరాలా మద్దికుంట లక్ష్మణ్ తన కవిత్వంలో అదే పని చేశాడు. ఆయన  వర్గమూలాలు పేర కవితా సంపుటిని వెలువరించాడు. ఇందులో ఒక కవితను కూడా తీసేయడానికి వీలు కాదు. అంత తాజాదనంతో కవితలు వున్నాయి. కవిత్వమంతా మల్లెపూల పరిమళాలను వెదజల్లుతూ వుంటుంది. నేను  కొన్ని అక్షరాలు ఒక గమ్యం  అనే కవితలో తిరగబడిన అక్షరాలను బుదగరించి, అలక వహించిన అక్షరాలను బతిమిలాడి, ఆగమాగం అయ్యే అక్షరాలను క్రమంలో పెట్టి తాను ఎలా కవితను అల్లుతాడో చెప్పాడు. ఆ అక్షరాలన్నీ
‘తీరా గమ్యం చేరాక
కాంతులీనుతూ మెరిసిపోతున్న తమ రూపాల్ని చూసుకుని
అమాంతం నా మీద పడి ఊపిరి సలపకుండా 
ఉక్కిరిబిక్కిరి చేస్తాయి’ 

అని లక్ష్మణ్ మురిసిపోయాడు. ఆయన కవితలన్నీ ఆయన మాత్రమే కాదు, పాఠకులూ మురిసిపోయే విధంగా వున్నాయి. అల్లిక ఆ విధంగా వుంది.
కవిత్వం గురించే ఆయన మరో రెండు కవితలు రాశాడు. ‘కొన్ని అందమైన రంగు రంగుల వాక్యాలు’ అనేది అందులో ఒకటి. తన మిత్రుడు తెచ్చిన అక్షరాల మూటను విప్పి చూపిస్తే తాను అచ్చెరువు చెందాడు, ఆనందించాడు. అక్షరాలను పదాలుగా, అందమైన వాక్యాలుగా మార్చిన కవితలను వినిపించి తిరిగి వాటిని మూట కట్టుకుని వెళ్లిపోయాడు మిత్రుడు. అలా వెళ్లిపోయిన తర్వాత `
‘ఇందాక గమనించలేదు కానీ
కొన్ని వాక్యాలను 
మా ఇంట్లోనే వదిలి వెళ్లిపోయినట్టున్నాడు.
చూద్దును కదా
రంగు రంగుల అందమైన వాక్యాలను
మా ఆవిడ చీపురుతో చెత్తబుట్టకెత్తుతోంది’  
అని ఆవేదన చెందుతాడు. 

అదే భావాన్ని ఆయన ‘ఉంగుటం’ అనే కవితలో ఇలా వ్యక్తీకరించాడు` 
‘ఇంతా చేసి పద్యం ప్రాణం పోసుకుని
రంగురంగులుగా విరబూయాల్సిన సమయంలో
భార్య, పిల్లలు, ఇరుగుపొరుగు
తలా ఒకటి ఊడబెరికి అవతల పారేస్తుంటారు’ 

అని అంటాడు. కవిత్వ రచన ఒక పనికి మాలిన వ్యవహారంగా చూసే లోకంలో లక్ష్మణ్ కవిత్వమై పల్లవించాడు. అదే ఇక్కడ వ్యక్తమైంది.
లక్ష్మణ్ తన కవిత్వాన్ని అనుభూతి ప్రధానం చేశాడు. అర్థం కాని పదాలు గానీ వాక్యాలు గానీ ఆయన కవిత్వంలో కనిపించవు. పొల్లుమాటలు వుండవు. ప్రతి కవిత కూడా పోతపోసినట్లుగా వుంటుంది. అక్షరాలు, పదాలు, వాక్యాలు సరళంగానే వుంటాయి. కానీ వాటిలోని భావం సాంద్రంగా వుంటుంది. ఆ భావాన్ని గుండెల్లోకి ప్రవహింపజేస్తుందీ కవిత్వం.
కవి కష్టజీవుల పక్షాన్నే వుంటాడు. మద్దికుంట లక్ష్మణ్ అందుకు మినహాయింపు కాదు. కానీ ఆయన వారి శ్రమ గురించి చెప్పే విషయంలో అతిశయోక్తులకు వెళ్లడు. వారి శ్రమను దోచుకునే శక్తులపై కఠిన పదజాలం వాడడు. రైతు శ్రమ ఫలితం అతని దక్కకుండా పోవడంలోని అర్థాన్ని కవితాత్మకంగా, సున్నితంగా మనకు ఎరుక పరుస్తాడు ‘తక్కెడలో చెమట చుక్కలు’ కవితలో  
‘తక్కెడలో వాళ్ల చెమట చుక్కల బరువు
ఎప్పుడూ అల్కగనే 
పాసంగంలో సెంటు తుంపరల దురువు
ఎప్పుడూ మోతకోలుగనే’ 

అని వైరుధ్యాలను కళ్లకు కడుతాడు. 
‘మిగులు మనుషులం కాదు’ అనే కవితలో ధనదాహంతో ప్రకృతిని నాశనం చేస్తూ ఆదివాసీల జీవితాలను అల్లకల్లోలం చేసే పెట్టుబడిదారీ వ్యవస్థ గురించి `
‘ప్రపంచాన్ని పెట్టుబడితో అలుముకున్నవాడికి
ప్రజలైనా ప్రకతైనా పచ్చనోట్ల కిందే లెక్క
అడవిని చెరబడుతున్నానని భ్రమిసేవాడికి
గాలిని బంధిస్తున్నానని మురిసేవాడికి
ఈ అడవితో ఈ గాలితో పెనవేసుకున్న
మా జీవితాలు ఎలా అర్థమవుతాయి’ 

అని అంటాడు. 
‘ఎ రివర్ దట్ రిటర్న్‌స్ ఒన్‌డే’ కవిత బహుశా ఉత్తర తెలంగాణలోని నక్సలైట్ ఉద్యమం గురించి రాసింది కావచ్చు. ఉద్యమం తెచ్చిన మార్పును చెప్తూ చివరగా 
‘వొట్టిపోయినదాని గురించి 
ఎందుకంత నస...
అని మీరు నిలదీయవచ్చు
కానీ ఇది ఏదో ఒకనాడు
పోరుగానమై హోరెత్తకపోదు’
అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాడు లక్ష్మణ్.
ఆధునికత తెచ్చిన మార్పును, ఆ ఆధునికతలో మానవ సంబంధాలు ధ్వంసం అవుతున్న తీరును ‘దూరం’ అనే కవితలో అయన చిత్రిక కట్టాడు.
‘ఆ వూరికి ఈ వూరికి దూరం
కేకపెట్టే కిలోమీటరో
ఒకప్పుడు పిల్ల తొవ్వ మాత్రమే వుండేది’ 
అది ఆత్మీయ సంబంధాలతో విలసిల్లుతూ వుండేది. 
వరుసలు పెట్టి పలకరించడాలు వుండేవి. 
బాగోగులు అడిగి తెలుసుకునే ప్రేమలు వుండేవి. ఇప్పుడేమైంది?
‘మహా అయితే చేయి ఎత్తడాలు చేయి ఊపడాలు
డీజిల్ పెట్రోల్ వాసనల్లో మట్టి వాసన మాయం
అంతా మొసమర్రని కంపు
ఊపిరి ఉక్కిరి బిక్కిరి’

 అధునికత, అభివృద్ధి తెచ్చిన మార్పు ఇలా వుంది మరి. 
సాగునీరు అందితే పల్లెలు ఎలా పచ్చనిల్లి, పరవశిస్తాయో ‘నీటికళ’ అనే కవితలో లక్ష్మణ్ కవితాత్మకంగా చెప్పాడు. ఇందుకు ఆయన స్థానిక వత్తికారుల పేర్లను ఎంచుకున్నాడు. దానివల్ల కవితాస్వాదనకు ఏ మాత్రం ఆటంకం ఏర్పడదు. అదీ ఆయన కవిత్వ నిర్మాణంలోని సౌందర్యం. 
పల్లెలో   తల్లిలా విలసిల్లే మహిళ నగరానికి నెట్టివేయబడింది. పల్లెలు ధ్వంసం అవుతుంటే ఉపాధిని వెతుక్కుంటూ నగరం చేరిన మహిళ గురించి
 ‘పల్లె తల్లి’ కవితలో చెబుతూనే ఆమె కళ తప్పి దీనురాలిగా మారిన వైనాన్ని కళ్లకు కట్టాడు. ఈ కవిత ఒక దయాపారావతం.
నిజానికి, మద్దికుంట లక్ష్మణ్ ‘వర్గమూలాలు’ అనే సంపుటిలోని ప్రతి కవితా, ప్రతి కవితలోని ప్రతీ వాక్యమూ ఉటంకింపదగినవే. ఒకసారి ఆ పుస్తకం తెరిస్తే ఆ కవిత్వంలోని ఆర్ద్రత, సౌందర్యం మనకు అర్థమవుతాయి. కవితల్లోని క్లుప్తత మనలను కట్టిపడేస్తుంది, వ్యర్థపదాలు, వాక్యాలు వుండవు. అభివ్యక్తి వల్ల ప్రతి కవితనూ మద్దికుంట లక్ష్మణ్ ఆస్వాదయోగ్యం చేశాడు.
‘చూపుల్ని పేజీలపై చిందరవందరగా ప్రసరించకండి
అక్షరాల అర్థాలు మారిపోతాయి
ఒకదాని వెంట ఒకటి క్రమం తప్పకుండా వెళ్లే
చీమల బారులా అక్షరం అక్షరం వెంట జాగ్రత్తగా వెళ్లండి
అప్పుడే అక్షర పరమార్థం బోధపడుతుంది’

-కాసుల ప్రతాపరెడ్డి