Facebook Twitter
తులసికోట: గోవ్యాఘ్రసంవాదం

కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం...ఈ నాలుగునెలలూ అమ్మ తులసికోట దగ్గరే ఎక్కువగా గడిపేది. తెల్లారుజామున ఎప్పుడు లేచేదో ఏమో! నేను లేచేసరికి తులసికోట చుట్టూ దీపాలు వెలుగుతూ ఉండేవి. బంగారురంగులో కోట మెరిసిపోయేది. 
 ఓం తులసీదేవ్యే చ విద్మహే
 విష్ణుప్రియాయై చ ధీమహి
 తన్నో వృందా ప్రచోదయాత్!
 తులసిగాయత్రీమంత్రంతో అందరినీ అమ్మ మేల్కొలిపేది. నూట ఎనిమిదిసార్లు గాయత్రిని పఠించేదమ్మ. తర్వాత శ్రీతులసిస్తోత్రాన్ని చేసేది. 
 నమస్తులసి కల్యాణి నమో విష్ణుప్రియే శుభే
 నమో మోక్షప్రదే దేవి నమః సంపత్ర్పదాయికే! అనేది. ఆ తర్వాత గోవ్యాఘ్రసంవాదాన్ని పాటగా వినిపించేది. ఆ పాటంటే నాకు చాలా ఇష్టం. అడవిలో తనకి చిక్కిన గోవును పులి తింటానంటుంది. తిందూగాని, ముందు నా బిడ్డకి పాలిచ్చి రానీ అంటుంది గోవు. పులిని ప్రాధేయపడుతుంది. బాగా ఆకలిమీద ఉన్నాను, ఇచ్చినమాట నిలబెట్టుకో! తప్పుగా ప్రవర్తించకు! వెళ్లిరా అంటుంది పులి. బిడ్డను చేరుకుంటుంది గోవు. బిడ్డకి పాలిచ్చి, దానికి జాగ్రతలుచెబుతుంది. తర్వాత సాటిగోవుల్ని తన బిడ్డని దయతో చూడమని వేడుకుని, పులిని చేరుకుంటుంది గోవు. చేరుకుని తనని తినమంటూ...
 అన్నరావో! పులీ రావో!
 ఆకలంటే దోషమొచ్చును!
 పచ్చికండలు, పచ్చినెత్తురు 
 గుక్కనిండా తినుర అన్నా! 
 అంటూ చాలవంటే...మూపుమీది కండలు ఉన్నాయి, పొందికగా ఉన్నాయి. కమ్మగా తినమంటుంది. అమ్మగొంతులో ఆ పాట నన్ను కదలించివేసేది. కన్నీరుపెట్టించేది. చెప్పేది సూటిగా చెప్పాలి. బొమ్మ కళ్లకుకట్టాలి అనేదానికి ఇంతకుమించిన కథనరీతి లేదనిపించింది. కథను చెప్పేతీరూ, సన్నివేశాన్ని దృశ్యమానంచేయడం ఇక్కణ్ణుంచే  నేర్చుకున్నాను నేను. నా అభ్యాసాన్ని పక్కనపెడితే...అసలు ఈ గోవ్యాఘ్రసంవాదం ఎవరు రచించారు? ఎందులోనిది ఈ కథ అని వెదికితే...చాలా విషయాలు తెలిశాయి.   
 పదహారవ శతాబ్దంలో వచ్చిన కథాకావ్యాలలో భోజరాజీయం ప్రముఖమైనది. దీనిని అనంతామాత్యుడు రచించాడు. సర్పతి అనే సిద్ధుడు, భోజరాజుకి వినిపించిన కథల సమాహారమే భోజరాజీయం. ఇది ఏడు ఆశ్వాసాల కథా కావ్యం. మా అమ్మ పాడిన గోవ్యాఘ్ర సంవాదం కథ ఈ కావ్యం లోనిదే! అయితే ఇది పద్య కావ్యం. దీనిని పాటగా మలిచినవారు ఎవరన్నది తెలుసుకోలేకపోయాను. అమ్మను అడిగినా, లాభంలేకపోయింది. 
 పాటగా రాసిందెవరో తెలీదురా! మా అమ్మపాడేది. నేను విన్నాను, నేర్చుకున్నాను, పాడుతున్నాను అన్నదంతే! ఈ కథకు సంబంధించి ఓ పద్యం తెలుసన్నది. చెప్పిందిలా.  
 ఆడకు మసత్య భాషలు
 కూడకు గొరగాని వాణి గొంకక యేరు లే
 గ్గాడిన నెదురుత్తర మీ
 జూడకు విని వినని వాణి చొప్పున జనుమీ!
 దీని అర్థం ఏమిటో తెలుసా? అసత్యాలు మాట్లాడకూడదు. అక్కరకురానివారితో స్నేహంకూడదు. నీకు హానికలిగించేమాటలు ఇతరులు మాట్లాడుతుంటే...వినీ వినట్టుండాలి. అడిగితే ఎదురుజవాబుచెప్పకుండా అక్కణ్ణుంచి వెళ్లిపోవాలి. 
 మీ పెద్దన్నయ్యకి నాగార్జునసాగర్ లో ఉద్యోగం వచ్చినప్పుడు, వాడక్కడ ఒంటరిగా ఉండాల్సిరావడంతో...మీ నాన్నగారు ఈ పద్యం వాడికి వినిపించి, అర్థాన్ని విడమరిచారు అన్నది అమ్మ. దూడకి ఆనాడు ఆవు చెప్పిన జాగ్రత్తలివి అన్నది. 
 వ్యక్తిత్వ వికాసం, టొప్పీ టొపారం అంటూ ఆంగ్లంనుంచి అనేక వందలపుస్తకాలు తెలుగులోకి అనువాదం అవుతున్నాయి. ప్రచురణకర్తలు కూడా వాటినే ప్రధానంగా ప్రచురిస్తూ వస్తున్నారు. అందులో ఉన్నదేమిటో...మన కావ్యాల్లో లేని దేమిటో నాకు ఈనాటికీ అర్థంకాదు. సరళవ్యావహారికంలో రాస్తే దేనినయినా పాఠకులు చదువుతారు. మూలాన్ని తెలుసుకోవాలంతే!
 అదలా ఉంచితే ఇంట్లో ఈ తులసి కోట ఎందుకు? ఈ పాటలూ, స్తోత్రాలూ దేనికి? ఓసారి అమ్మను అడిగాను. ఎందుకంటే...తులసి ఇంట్లో ఉండడం చాలా మంచిదిరా! అది జలుబు, దగ్గు, ఫ్లూ...ఇంకా అనేక రకాల రోగాలను పోగొడుతుంది. గాలిని శుద్ధిచేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇంట్లోని వారికి పిచ్చి పిచ్చి ఆలోచనలు రానివ్వదు. మంచి ఆలోచనలు కలిగిస్తుంది. డబ్బుకి కూడ కొదవ ఉండదంటారు. అదృష్టాన్ని తెస్తుందిరా! నరఘోషను అడ్డుకుంటుంది. కుటుంబ సంబంధాలు బాగుంటాయి. ఒక మొక్క ఇంత మేలుచేస్తూ ఉంటే...దానికి కోటకట్టడం, దాని చుట్టూ ప్రదక్షిణ చెయ్యడం, దాన్ని కీర్తించడంలో తప్పు ఉందంటావా? ఆలోచించు అన్నది అమ్మ. 
 అప్పుడు అమ్మ చెప్పినా పెద్దగా ఆలోచించలేదు, ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే...ఇవన్నీ గుర్తుకొచ్చాయి. మొన్న కార్తీకపున్నమికి మా శ్రీమతి గుప్పెడు ఒత్తులు వెలిగించి, తులసికోట దగ్గర కూర్చుని దానిని స్తుతిస్తూ ఉంటే...అమ్మా, తులసికోటా, గోవ్యాఘ్రసంవాదమూ దృశ్యాలు దృశ్యాలుగా కదలాడాయి.  
కొన్నికథలూ, పాటలూ అంతే! గుండెల్ని కెలికేస్తాయి. 

 -జగన్నాథశర్మ