రచయితలనూ, కవులనూ కోల్పోయిన జాతి, తన బాల్యాన్నీ, భవిష్యత్తునీ కూడా కోల్పోతుందని నేనెక్కడో చదివాను. ఆ మాట నిజం అనిపిస్తోందిప్పుడు. అప్పుడు...నేను ‘ఉగాది‘వారపత్రికకు ఎడిటర్ గా ఉన్నప్పుడు...అలా అనిపించలేదు. చాలా ఆశాజనకంగా ఉండేవాణ్ణి. ముప్పయి మూడేళ్ల నాటి మాటిది.
ఈనాడు, ఈవారాల్లో రిజైన్ చేసిన తర్వాత ‘ఉగాది’ వారపత్రికకి ఎడిటర్ ని అయ్యాను. అయితే ఆ రాని పత్రికకు కాని ఎడిటర్ గా మిగిలిపోయాను. మిగిలిపోతే మాత్రం ఏం? ఎన్ని జ్ఞాపకాలను మూటగట్టుకున్నానో! ఎన్ని అనుభవాలను చేజిక్కించుకున్నానో! ఎంతమంది మహాత్ములను దర్శించానో!
ఉత్తరాలు రాసి, ఫోన్లుచేసి రచనలు అడగడం కాదు, వెళ్లి రచయితలను ప్రత్యక్షంగా కలసి, రచనలడిగితే బాగుంటుందన్నది నా ఆలోచన. నా ఆలోచన మేనేజ్ మెంట్ ముందుపెడితే వారు సరేనన్నారు. వెళ్లిరండన్నారు. అంతే! రచయితలను కలవడమే మహదానందంగా ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను చుట్టేశాను. అప్పుడే శ్రీమధురాంతకం రాజారాంగారిని దర్శించాను.
రాజారాంగారు ఆనాడు చిత్తూరుజిల్లా దామలచెరువులో ఉండేవారు. నేనొస్తున్నట్టుగా ఉత్తరంరాస్తే, రండని ఆహ్వానించారు. చిత్తూరులో ఓ రాత్రి బసచేసి, మర్నాడు దామలచెరువు బయల్దేరాను. పొద్దునే ఏడుగంటలకు బస్సులో బయల్దేరాను. ఎనిమిదిన్నరకి చేరుకున్నానక్కడికి. సన్నగా వర్షం కురుస్తోంది. మట్టిరోడ్డేమో! బురద బురదగా ఉంది. భుజాన వేలాడుతున్న సంచిని నెత్తినపెట్టుకుని, రాజారాంగారిల్లు ఎక్కడని అడిగితే...అదిగో! అదే అని చూపించి వెళ్లిపోయాడు ఓ పెద్దమనిషి. ఎత్తుమీద ఉంది ఇల్లు. ఇటూ అటూ పెద్దపెద్ద అరుగులూ, మధ్యలో మెట్లూ ఇల్లు బాగుంది. వెళ్లి తలుపుకొట్టాను. తెరుచుకోలేదు. ఆలోచిస్తూ నిలబడితే...ఆయన స్కూలుకి వెళ్లిపోయాడయ్యా! నువ్వెవరు? అడిగాడు ఇందాక ఇల్లుచూపించిన పెద్దమనిషే తిరిగొచ్చి. నేను ఫలానా అని చెప్పి, ఎక్కణ్ణుంచి వచ్చానో కూడ చెప్పి, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కలవాలి అన్నాను. కలవాలంటే...స్కూలుకి వెళ్లాలి. స్కూలు ఇక్కడకి మూడునాలుగు కిలోమీటర్లు దూరంలో ఉందన్నాడు ఆ వ్యక్తి. నడిచేవెళ్లాలంటూ, అదృష్టం బాగుంటే...ట్రాక్టరో, ఎడ్లబండో దొరుకుతుందన్నాడు. ఎలా వెళ్లాలో దారి చూపించాడు.
గతరాత్రి ఆకలి అనిపించలేదు. భోంచెయ్యలేదు. ఇప్పుడు కొంచెం ఆకలిగా ఉంది. టిఫిన్ చేద్దామనిపించింది. హోటల్ కోసం చూస్తే...రాజారాంగారి ఇంటి ఎదురులైన్లో ఓ పాక విలాస్ కనిపించింది. వెళ్లి రెండిడ్లీచెప్పాను. ఇచ్చాడు యజమాని. ఇడ్లీ గట్టిగా ఉంది. చల్లగా ఉంది. తినాలనిపించలేదు. ఓ ఇడ్లీతో సరిపెట్టుకుని, స్కూలు దారిపట్టాను. సన్నగా వర్షం కురుస్తూనే ఉంది. పచ్చగా పొలాలూ, చెట్లూ బాగున్నాయి పరిసరాలు. ఒక ట్రాక్టర్ వచ్చింది. అందులో కూర్చునేందుకు ఖాళీలేదు. నేనడగలేదు. వెళ్లిపోయిందది. తర్వాత ఓ ఎడ్లబండి వచ్చిందిగాని, అడిగినా ఎక్కించుకునే అవకాశంలేదనిపించింది. రాజారాంగారు పనిచేసే స్కూలు ఎక్కడని అడుగుతూ ముందుకు నడిచాను. దారి తప్పాను. ఆ దారిలో కనిపించిన ఓ వ్యక్తిని రాజారాంగారు పనిచేసే స్కూలు ఇటే కదా? అంటే...కాదయ్యా అటు, ఆ పెద్ద రోడ్డు మీంచి నడచివెళ్లన్నాడు ఆ వ్యక్తి. అతను చెప్పినట్టుగానే నడిచాను. స్కూలు కనిపించింది. పిల్లలతో గోలగోలగా ఉంది స్కూలు. అంతా మధ్యాహ్నభోజనపథకం కింద భోజనాలు చేస్తున్నారు. నాకూ ఆకలి అనిపించింది. అడిగితే మొహమాటపడకుండా స్కూలులోనే భోంచేద్దామనుకున్నాను. రాజారాం మాస్టారు ఉన్నారా? అడిగాను.
లేరయ్యా! ఓ గంటక్రితమే వాళ్లబంధువులింట ఏదో ఫంక్షన్ ఉందని వెళ్లిపోయారు. ఇక్కడకి దగ్గరే ఆ బంధువిల్లు. వస్తానంటే...రండి! తీసుకెళ్తాను అన్నారు మాస్టారు సహోద్యోగి. పదండి అన్నాను. ఆసరికి వర్షం తగ్గింది. పొలాల గట్లంట నడుస్తూ, సహోద్యోగి అడిగిన అనేక ప్రశ్నలకు జవాబుచెబుతూ, గొంతు ఆర్చుకుపోతే...దాహం అన్నాను. దగ్గరే ఇల్లు! వచ్చేశాం. అక్కడ నీళ్లు తాగుదురుగాని అని నడిపించారాయన. ఆ దూరం ఆయనకి దగ్గరేమో! నాకు చాలా దూరం అనిపించింది. కాళ్లు లాగేశాయి. కళ్లు తేలిపోయాయి. అలాగే రాజారాంగారి బంధువింటికి చేరుకున్నాను. గృహప్రవేశంట! పూలతోరణాలూ, మామిడితోరణాలూ కట్టి ఉన్నాయి. వాకిలిలో నవారుమంచలో పడుకుని కనిపించారు రాజారాంగారు. నిద్రపోతున్నారాయన. సార్! నమస్తే అన్నాన్నేను. మేలుకున్నారాయన. కళ్లిప్పిచూసి, ఎవరూ? అడిగారు. చెప్పాను. అయ్యయ్యో! మీరా? రండి రండి అని మంచం మీదినుంచి లేచి, ఆహ్వానించారు రాజారాంగారు.
వస్తానని నన్ను తోడుకుని వచ్చిన సహోద్యోగి వెళ్లిపోయినతర్వాత అన్నారిలా.
మీరింతవేగంగా వస్తారనుకోలేదు. సర్లెండి! వచ్చారు, ఆనందం.
భోంచేశారా? అడిగారు. లేదన్నాను. అయ్యయ్యో అని తెగ బాధపడ్డారు రాజారాంగారు. బంధువుని పిలిచి నాకు భోజనం వడ్డించమన్నారు. ముందు మంచినీళ్లివ్వండి, దాహంగా ఉంది అన్నాను. అయ్యో అన్నారు. జాలిపడ్డారు. గ్లాసుతో నీరు తెచ్చి ఇచ్చారు. రెండుమూడుగ్లాసులు నీరు ఏకబిగిన నేను తాగుతూంటే చూసి, కళ్లు చెమర్చుకున్నారు.
కూర, పప్పు, పులుసు...భోజనం వడ్డించారు. కడుపునిండా తిన్నాను. బూరెలూ, లడ్డూ కూడా పెట్టినట్టు జ్ఞాపకం. తేరుకుని, రాజారాంగారితో సహా మంచంమీద కూర్చున్నాను. నొప్పి పెడుతున్న కాళ్లను చేత్తో నొక్కుకుంటుంటే...చాలా దూరం నడచినట్టున్నారు, కాళ్లు లాగుతున్నాయా? అడిగారు. అవునంటే...మంచం మీద పడుకోమన్నారు. వెళ్లి గోరువెచ్చని కొబ్బరినూనె తెచ్చి నా కాళ్లకు ఆ నూనె పట్టించి, గట్టిగా నొక్కసాగారు. ఏంటిసార్ ఇది? వద్దొద్దు అని లేవబోతుంటే...పడుకోబాబూ! తప్పేం ఉంది ఇందులో అన్నారు. ఎంతగా గొడవపడ్డా వినలేదాయన. నిద్రపట్టిందంతలో. ఓ గంట తర్వాత మెలకువ వచ్చింది. పదండి! మనింటికి పోదాం అన్నారు రాజారాంగారు. ఇద్దరం దామలచెరువు బయల్దేరాం. పొలాలగట్లంట కొద్దిదూరం నడచి, రోడ్డుచేరుకునేసరికి, ఎడ్లబండి కనిపించింది. ఏఁవయ్యా! దామలచెరువుతీసుకుపోతావా? అడిగారు రాజారాం. రండయ్యా అన్నాడు బండివ్యక్తి. నేనూ, రాజారాంగారు బండెక్కి కూర్చున్నాం. మళ్లీ సన్నగా వర్షం మొదలైంది. ఉత్తరీయం నాకు కూడా కప్పి, తడవకుండా చేశారాయన. ఇంటికి చేరుకున్నాం.
పిల్లలంతా తిరుపతిలో ఉన్నారు. మా ఆవిణ్ణి మీకు పరిచయంలేదు, మరచిపోయాను, అక్కణ్ణే ఉంది, బంధువులింట అన్నారు రాజారాంగారు. ఇంటిలోనికి తోడుకుని వెళ్లారు. మీరు స్నానంచేసినట్టులేదు. రండి! ముందు స్నానం చెయ్యండి అన్నారు. పెరట్లో పెద్దనూతిదగ్గరకు తీసుకుని వెళ్లారు. నూతినీరు వెచ్చగా ఉంటుందనిచెప్పి, తలంటారు. తెల్లటిలుంగీ, లాల్చీ ఇచ్చి కూర్చోమన్నారు తర్వాత. ఆకలివేస్తే చెప్పండి, ఇద్దరికీ ఉప్మాచేసి పెడతానన్నారు. లేదని చెప్పి, కబుర్లు మొదలెట్టాను. కథ, శైలి, శిల్పం అంటూ పెద్దపెద్దమాటలు మాట్లాడసాగాను. నవ్వుతూ విన్నారు రాజారాంగారు. నేనే మాట్లాడుతున్నాను, మీరేమీ మాట్లాడడం లేదంటే...కథగురించి ఏం చెప్పమంటారు? కథ రాసేటప్పుడు, దాని ఆఖరివాక్యం అందిపుచ్చుకున్నాకే మొదటి వాక్యం రాయాలన్నారు. రచయిత అయ్యేందుకు దగ్గర దారులు ఏమీలేవు బాబూ! రాయాలి. తిరగ రాయాలి. రాస్తూ తిరగ రాస్తూ ఉంటే రచయితలు అవుతారన్నారు. రచన నచ్చడం, నచ్చకపోవడం తర్వాతి సంగతి, ముందు రచనను చదించగలగాలి. అది రచయితలు తెలుసుకోవాలి. తెలుసుకుంటే...బాగుంటుంది అన్నారు. ఎప్పుడూ నా దగ్గర రెండు పుస్తకాలు ఉంటాయి. ఒకటి చదవడానికి. రెండు రాసుకోడానికి అని నవ్వారు.
రాత్రి అయింది. అన్నారుగాని, ఉప్మాచెయ్యలేదు రాజారాంగారు. ఎక్కణ్ణుంచో తీసుకువచ్చి పెట్టారు. మళ్లీ ఇద్దరం మాటల్లో పడ్డాం. పాఠకునికి ఏంకావాలి బాబూ? అతన్ని జీవించేలా చెయ్యడం, ప్రేమించేలా చెయ్యడం, అందుకు మనం రెండు మంచి వాక్యాలు రాస్తేచాలు! పొంగిపోతారన్నారు. రచయితగా మనం తీర్పులు చెప్పకూడదు. ఇదీ పరిస్థితి అని పాఠకులకు ఉన్నదున్నట్టు చెబితే చాలన్నారు. రచయిత జీవితంలో చెప్పుకోదగినది రాయడం, చదవడమే! ఒక లైబ్రరీని ఆసాంతం చదివితేగాని, ఒక పుస్తకం రాయకూడదన్నారు. రచయితలు రెండుసార్లు జీవితాన్ని రుచి చూస్తారు. అనుభవించినప్పుడు, ఆ అనుభవాన్ని అక్షరబద్ధం చేసినప్పుడు అని ఆవలింత తీశారు. నిద్రరావడంతో పడుకుందాం అన్నారు. ఆ రాత్రి నాకు నిద్ర రాలేదు. రాజారాంగారు చెప్పిన మాటలు గురించే ఆలోచిస్తూ గడిపాను. తెల్లారింది. చిత్తూరుకి బయల్దేరాను. కథ ఒకటి చేతిలోపెట్టి, జాగ్రత అన్నారు. మా ఊరొచ్చిన మొట్ట మొదటి సంపాదకులు మీరు, మిమ్మల్ని సరిగా గౌరవించానో లేదో అన్నారు. బలేవార్సార్ అన్నాను. బస్సెక్కాను.
ఒక కథ కోసం మీరింత దూరం వచ్చారంటే...మిమ్మల్ని తక్కువ అంచనా వెయ్యకూడదు. మీకు మంచి భవిష్యత్తు ఉంది అన్నారు రాజారాం. దీవించారు నన్ను. రాస్తున్నప్పుడు కన్నీరుపెట్టని రచయిత గురించీ, చదువుతున్నప్పుడు కన్నీరు పెట్టని పాఠకునిగురించీ ఆలోచించడం అనవసరం బాబూ! వాళ్లని పట్టించుకోకూడదు. రచయితలకుఅలారంతో పనేం ఉంది? వాళ్ల ఆలోచనలే వాళ్లని మేలుకొలుపుతాయి...చిత్తూరు చేరినా, తర్వాత హైదరాబాద్ చేరినా, ఆ తర్వాత రిటైరయి ఓ గట్టుకి చేరినా ఇంకా రాజారాంగారి మాటలు వినవస్తూనే ఉన్నాయి నాకు.
-జగన్నాథశర్మ
