.webp)
అనగనగా... చదువుతూ తొలుత మమత కవిత్వ సౌందర్య సమ్మోహనంలో మూర్ఛిల్లాను. అర్థం చేసుకోవడానికి తగిన వ్యవధి ఇవ్వనంత సౌందర్యం ఆ కవిత్వానికి వుంది. పదాలు, వాక్యాలు సరళమవుతూ భావసాంద్రత పెరిగిన కవిత్వానికి ఆ లక్షణం వుంటుంది. ఆ తర్వాత ఒకటి రెండుసార్లు చదివాను. ఆ కవిత్వం అర్థాలు చెప్పే తాళం చెవి కోసం అన్వేషించాను. ఆ కవితలకు కూర్చిన అనన్య బొమ్మల్లో ఆ తాళం చెవిని వెతకడానికి ప్రయత్నించాను. అయితే, తాళం చెవి కవిత్వానికి ద్వారాలు తెరిచిందా, లేదా అనేది చెప్పలేని మానసిక స్థితి.
వ్యక్తిగత జీవితాలు, సమాజం తలకిందులుగా వున్నాయని, తలకిందుల విలువలు ఆధిపత్యం సాధిస్తున్నాయని మమత తన కవిత్వంలో పలుకుతూ అవి ఎంత అందంగా, ఎంత సున్నితంగా వుండాలో చెప్పారు. కవిత్వం మొత్తంలో ఒక ఆశాకిరణం కనిపిస్తూ వుంటుంది. దానివల్ల కవిత్వానికి ఒక సానుకూల జీవన దృక్పథం సౌందర్యం అలవడింది. కవిత్వంలో అమ్మ, కూతురు, పిచ్చుక పదే పదే వస్తుంటాయి. దానివల్ల మానవ సంబంధాల్లోని సున్నితత్వం కవిత్వమంతా విస్తరించింది. ఒకటి మనల్ని వీడితే మరోటి వస్తుందనే నమ్మకాన్ని కలిగిస్తూ జీవితాన్ని అలా స్వీకరించి అనుభవించడమే అనే తాత్త్వికతను అందిస్తుంది. ‘ఇంత జరిగాక తెలుసుకున్నది కాసేపు విరబూసి వెళ్లిపోవడమే’ (నిర్నిమిత్తం) అంటారు మమత.
‘అన్ని దారులనూ అతి జాగ్రత్తగా మూసేసి
ముఖద్వారానికి బండరాయిని భద్రంగా అదిమిపెట్టుకున్న
గుహల గురించి మాట్లాడుకుని
ప్రయోజనమేమీ ఉండదని తెలుసుకుని ఆకాశానికి ఎగిసిన పడికిలిని
నిలువెల్లా హత్తుకుని
విశ్వప్రేమను నేనే అవుతాను’ (నిరంతరం)
అంటూ సంకట పరిస్థితిలో తాను అండగా వుంటాననే నమ్మకాన్ని ఈ కవి కలుగజేస్తారు.
మమత బాధిత సమాజానికి తన గొంతును ఇచ్చారు. ఇజ్రాయిల్ దాడుల్లో గాజాలోని పసిపిల్లల పరిస్థితిపై ఆమె ఆవేదన చెందుతారు. ‘గుర్తింపు’ అనే కవితలో
‘కళ్లలో ఉబికిన నీళ్లలో తేలుతూ
అయిలన్ కుర్దీ
గుండెలో హోరుమని
పాలస్తీనా పాపాయిల ఏడుపు’
అంటూనే ‘చీకటి కూడా మెత్తగా అల్లుకుపోతోంది చుట్టూ’ అంటారు. ‘ఎంతటి వెర్రివాడవు!’ అనే కవితలో కూడా పిల్లల దుస్థితిని, నిస్సహాయతను వ్యక్తీకరించారు. మహిళలపై అత్యాచారాలపై ఆమె రాసిన ‘క్షమించు’ అనే కవిత అత్యంత పదునైన కవిత. ‘రక్షించగలనా నిన్ను మనిషి నుంచి’ అని ఆమె పురుషుల్లోని క్రౌర్యాన్ని ఎత్తిచూపారు. ‘ఆరని జ్వాలలు’ రోహిత్ మరణంపై రాసిన కవిత. కులం, మతం రాజ్యమేలుతున్న వైనాన్ని ఆమె ఎత్తి చూపారు.
‘చెంపలపై కులం వేళ్ల చారలను
కన్నీళ్లతో మలుపుకుంటున్నవాళ్లు `
చూస్తున్నారు నిన్నూ, నన్నూ’ (భయంగా వుంది)
అంటూ ఉదారవాద ప్రజాస్వామిక ఆకాంక్ష కోసం అందరమూ ఒక్కటవుదాం అని నినదిస్తారు. మొత్తంగా, మమత కవిత్వం చదివి అనుభవించాల్సిందే. దాన్ని విశ్లేషించడం వల్ల ఆ అనూభూతి మాధుర్యాన్ని కోల్పోతామనిపిస్తుంది. ఒక్కసారి ఆ పుస్తకాన్ని తెరవండి. కడదాకా సాగిపోతారు. అర్థమై కానట్లు అనిపిస్తూ ఒక మధురమైన అనుభూతికి లోనవుతాం. గలగల పారే సేలయేరును ఆ కవిత్వం తలపిస్తుంది.
మమత ‘అనగనగా...’ అనే సంపుటిలో కొన్ని అనువాద కవితలు కూడా కవినిస్తాయి. అవి అత్యంత పదునైన కవితలు. అవి ఇజ్రాయిల్ దుర్మార్గం చర్యలకు అల్లాడుతున్న జీవితాలు వాటిలో కనిపిస్తాయి.
-కాసుల ప్రతాప్ రెడ్డి



