.webp)
ఉదయం ఏడవుతుండగా రమకి తన స్నేహితురాలింటికి వెళ్లాలనిపించింది. అంతే గబగబా అన్ని పనులూ ముగించుకుని భర్త అలా ఆఫీస్‌కి వెల్లేందుకు ఇల్లు దాటగానే ఫోన్ అందుకుంది. ఓ అయిదుగురిని కలుద్దామని అడిగింది. వాళ్లూ ఓకే అనేశారు. పదవుతుండగా దిల్‌సుక్‌నగర్ బస్టాండ్‌లో కలిశారు. నాలుగు బస్సులు వదిలేసి మెహదీపట్నం వెళ్లే బస్సు ఎక్కారు. అప్పటికే దాదాపు సీట్లు అయిపోయాయి. నిలబడాల్సివచ్చింది. టికెట్ చింతలేనపుడు నిలబడైనా విజయవాడ వెళ్లచ్చన్నది వారి లీడర్ రమ అబిప్రాయం. అందుకే వారందరూ తమతమ బ్యాగ్ లలోంచి ఆధార్ కార్డ్ ముక్క తీసి చేతబట్టారు.
అవతలవైపు అప్పుడే ఎక్కడానికి సతమతమవుతున్న రామం నానా అవస్థాపడ్డాడు. ఎలాగో ఇద్దరి మధ్య ఇరుక్కుని నిలబడ్డాడు. కాలు వెనకడుగు వేస్తే అక్కడ సీట్లో ఉన్న మహిళా మణి ఖస్సుమంటుంది, చేయి ఆడిస్తే మరో మహిళారత్నం తిడుతుంది. ఈ స్థితిలో కండక్టర్ కోసం గావుకేక వేశాడు. బస్సు ఆగినంత పనయింది. పెద్ద గుంతని తప్పించి డ్రైవర్ చాకచక్యంగా ముందుకు తీసికెళ్లడంలో బస్సు అందర్ని కంగారెట్టింది. కండక్టర్ రావడానికి మరో పది నిమిషాలు పట్టింది. అంతే అప్పటికే ఒక స్టేజీ దాటేసింది బస్సు. కండెక్టర్ వచ్చి విసుక్కున్నాడు. ఫ్రీ సర్వీస్ కాదుగానీ వాళ్ల ఆధార్ కార్డులు చూసి జీరో టికెట్ ఇవ్వడంతో ఇక్కడ పురుషులంతా తెగ కోపగించుకున్నారు. స్టేజి దాటిపోయినా రాలేదని. తీరా వచ్చాక దిల్‌సుక్‌నగర్ నుంచే టికెట్ లెక్కగట్టి డబ్బులు తీసుకున్నాడు. ఇదేదో తన ఆస్థంతా లాగేసుకున్నట్టు రామం ఆగ్రహించాడు.
మరో రెండు స్టేజీల తర్వాత ఇటు ఇద్దరు దిగితే వెనకాలే ఇద్దరు ఎక్కారు, అటు ఆరుగురు ఎక్కారు. ఇంత మంది ఆఫీసులకి ఇలా నానా అవస్థాపడి వెళుతున్నారా అని రామం చాలా జాలిపడ్డాడు. కానీ పక్కనే వినపడుతున్న చర్చా కార్యక్రమం అసలు సంగతి బయటపడేసింది. తను ఆనుకున్న సీటులో కూచున్న అమ్మలక్కలు వాళ్ల స్నేహితురాలి దగ్గరికి ముగ్గుల పుస్తకం తెచ్చుకోవడానికి వెళుతోందిట. ఆ పక్కనే ఉన్న మహిళ చాలా రోజులయింది అలా తిరిగి రావాలనిపించి ప్రయాణమయిందట. ఆ ముందు సీట్లలో ఇలా చాలామంది కోడలికోసం అత్తగారు, అత్తగారి కోసం చిన్నత్తగారు.. బాయ్‌ఫ్రెండ్ టికెట్ తీసాడని సినిమాకి వెళుతోన్న స్టూడెంటు, ఇంట్లో పని ఎగ్గోట్టేందుకు బస్సెక్కిన పెద్దింటి కోడలు.. ఇలా చాలామంది ఆధార్ కార్డును చాలా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ తెలివేదో చదువులోనో ఉద్యోగంలోనో చూపితే బాగుండేది అనుకున్నాడు రామం.
మహిళలకు బస్సు ప్రయాణాలు ఫ్రీ అని ప్రకటించి ప్రభుత్వాలు ఎంత లాభపడ్డాయో తెలీదుగాని మంత్రి వర్గాన్ని మాత్రం మహిళలు భువికి దిగివచ్చిన దేవతల కింద లెక్కేసుకుంటున్నారు. ఆ మగానుబావుల వల్లనే ఇంత సౌక్యం లబించిందక్కా! అని అనుకోని వారు లేరు. చెంచాడు కార్డు వెళ్లగలిగినంత దూరానికి బస్సు వీలు కల్పించడం వాళ్లకి ఎంతో పుణ్యఫలంగా భావించుకున్నారు. ముఖ్యంగా ఈ బృందం. తీరా చూస్తే, వీళ్లు ఒకరి నుంచి మరొకరి దగ్గరికి ఊసుపోక వెళుతున్నారు. అలా దాదాపు సాయంత్రం నాలుగింటిదాకా బస్సులో తిరిగి ఒళ్లు హూనమయినా కార్డ్ ఆనందంలో ఆ ఇబ్బందిని మర్చిపోయి నవ్వుకుంటూ టాటాలు చెప్పుకున్నారు.
ఈ బస్సుల్లో ప్రయాణించడం కంటే నడిచివెళ్లడం చాలా సుఖమనుకున్నాడు రామం. ఆధార్ కార్డు పుణ్యమా అని మహిళలకు బస్సులో సీట్లన్నీ వాళ్లవే అన్న భ్రమ నిజమయింది. అలా అనుకునే రెండు వేపులా పరుగున ఎక్కేస్తున్నారు. బస్సు ప్రయాణాన్ని ఇలా ఆనందించిన శకం మరోటి లేదు, ఉండదేమో! ఈ సౌకర్యం కల్పించిన ప్రభుత్వాలు ఏమనుకుంటున్నాయో ఏమోగాని నిజంగా అత్యవసరంగా బస్సులో వెళుతున్నవారి కష్టాలు మాత్రం ఎవరికీ పట్టడం లేదు. ఆధార్ కార్డు ఇంతగా పురుషులకు వెన్నుపోటు తెస్తుందని ఎవరు ఊహించగలరు దేవా! రామం ఇల్లు చేరాక కాస్తంత టీ తాగి పిల్లలతో మాట్లాడుతుంటే, అవతలి గదిలో భార్యామణి రేపటి బస్సుయాత్ర గురించి స్నేహితులను వాకబు చేస్తోంది!!



