లోపలి మనిషి!
వసపిట్టొకటి అంతరంగంలో
బయటకొచ్చి కూసేసేయాలనీ
మాటలన్నిటినీ సరిదిద్దేయాలనీ
కుదరదు గమ్మునుండమని నేను!
కులమతప్రాంతాల మధ్య చిచ్చులెట్టి
భావోద్వేగాలు పెంచబోతుంటే
సమాజాన్ని నిలువునా చీల్చబోతుంటే
అధర్మమంటది గమ్మునుండమని నేను!
గుప్పించిన హామీలు మర్చిపోతుంటే
మడమత్రిప్పి నడకలు మారుస్తుంటే
అస్మదీయులకు ఆస్తులు దోచిచ్చేస్తుంటే
అన్యాయమంటది గమ్మునుండమని నేను!
కుయుక్తుల సమరంలో గెలిచిన సీట్లు
అక్రమాలతో ఆర్జించిన కోటానుకోట్లు
పైరవీలతో పైపదవులకు వేసుకున్నమెట్లు
వదిలించేస్తావేమిటీ గమ్మునుండమని నేను!
అర్ధరాత్రులప్పుడప్పుడు నిశ్శబ్దంలో
ప్రపంచం గాఢనిద్రలోనున్నపుడు
మనం నిర్భయంగా మాట్లడుకోవట్లేదూ
ఇప్పుడుగాదులే గమ్మునుండమని నేను!
నిష్టూరంగా వాగివాగి విసిగిస్తున్నావు
విస్కీరమ్ముల్తో నిలువెల్లా ముంచేసినా
సిగిరెట్టు పొగల్తో ఉక్కిరిబిక్కిరి జేసినా
చంపేస్తున్నావు గమ్మునుండమని నేను!
తెలుసుగా మిత్రమా నేనెవరో
అలవోకగా రంగులు మార్చేయగలను
మనస్సాక్షివైతే మాత్రమేంటి ఏమార్చగలను
సడీసప్పుడు జేయక గమ్మునుండమని నేను!
- రవి కిషొర్ పెంట్రాల, లండన్!
