TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
నక్క తిక్క కుదిరింది
అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక నక్క. అది ఒక రోజున వేటగాడు పన్నిన ఉచ్చులో చిక్కుకున్నది. చాలా కష్టపడి, చివరకు తప్పించుకున్నది. అయితే అలా పెనుగులాడుతున్నప్పుడు దాని తోక సగానికి పైగానే తెగిపోయింది. ఇప్పుడు దానికి పొడవైన కుచ్చు తోక లేదు: కేవలం ఒక పొట్టి తోక మాత్రమే మిగిలింది. దానితో ఆ నక్కకు పెద్ద దిగులు పట్టుకుంది. "అందరూ నన్ను చూసి నవ్వుతారే! ఎగతాళి చేస్తారే!" అనుకొంటూ తెగ బాధపడింది.
అలా దిగులుపడిన నక్క, తనకు సహజమైన వంకర బుద్ధితో "నాకొక్కదానికే కాకుండా మిగిలిన నక్కలన్నింటికీ పొట్టితోక ఉంటే తప్ప నాకీ అవమాన భారం తప్పద"నుకొంది. "అప్పుడు గానీ నేను అడవిలో ప్రశాంతంగా గడపలేను" అనుకొన్నది. అనుకున్నదే తడవుగా తమ జాతివారి సమావేశం ఏర్పాటుచేసింది. అడవిలోని నక్కలన్నీ సమావేశానికి హాజరయ్యాయి.
సభను ఉద్దేశించి మాట్లాడుతూ పొట్టితోక నక్క, "మిత్రులారా! భగవంతుడు మనకీ బొచ్చుతోకను ఎందుకిచ్చాడోకానీ , ఇదో పనికిమాలిన భాగం - మన శరీరంలో. ఇది పెద్దగా ఉన్నాఒకటే, చిన్నగా ఉన్నా ఒకటే. ఇది పెద్దగా ఉంటే మనకు ఎన్నో ప్రమాదాలు, చిక్కులూనూ. దానివల్ల ఎదురయ్యే కష్టాలను నేను ఎదుర్కొన్నానుకూడా! అందుకనే నేను నాఈ తోకను కత్తిరించేసుకున్నాను చూడండి" అని తెగిపోయిన తన పొట్టితోకను నక్కలకు చూపించింది. "కావున మిత్రులారా! నేను చెప్పేది ఏమిటంటే, మీరుకూడా నాలాగానే మీతోకలనూ కత్తిరించుకోండి. చిన్న తోకతో హాయిగా ఉండడానికి అందరూ సిద్ధంకండి. చిన్నతోక అందంగా ఉండదనకండి, అలవాటైతే బాగానే ఉంటుంది. అందం అనేది మన అలవాటు పైనే ఆధారపడి ఉంటుందని పెద్దలు చెబుతారు; అంతేకాక తోకను తెంపుకుంటే మనకు పొడుగు తోకతో వచ్చే బాధలూ తప్పుతాయి- ఏమంటారు?" అని మాట్లాడింది.
ఆ ఉపన్యాసం విన్న నక్కల్లో కొన్నిటికి ఆ ఆలోచన నచ్చింది. ఆ సలహా బాగుందనే భావించాయి అవి. అనుభవపూర్వకంగా చెప్పిన దానిని అనుసరించడంలో తప్పేముందని అవి అనుకున్నాయి.
అయితే వచ్చిన నక్కల్లో తెలివైన ముసలి నక్క ఒకటి ఉండింది. అది ఇలా అన్నది. " కొత్త విషయాలు తెలుసుకోవాలి, వీలయినన్ని నేర్చుకోవాలి. అందులో తప్పేమీ లేదు. కానీ, ఉన్న తోకల్ని చిన్నవి చేసుకోవడమేమిటి? ఇది చాలా తెలివి తక్కువ ఆలోచన. అసలు తోకలు చిన్నవిగా తెంపుకోవాల్సిన అవసరమేమిటి? ఆలోచించండి! భగవంతుడు, ఎందుకో, వాటిని కాస్తంత పెద్దవిగా ఇచ్చాడు. ఆయనకు తెలియదా, చిన్నవి పెట్టాలో, పెద్దవి పెట్టాలో? వీడికేదో అనుభవమైందని మిగిలినవారందర్నీ తోకలు కోసేసుకొమ్మంటే మనం కోసేసుకోవడమేనా? ఇందులో ఏదో మోసం ఉన్నట్లుంది. ఏ నిర్ణయమైనా ఆవేశంగా తీసుకోకూడదు. కాస్త ఆలోచించి నిర్ణయించుకోవాలి. ఇలాంటి మోసపు మాటలు వింటే, తర్వాత అందరూ బాధపడాల్సి వస్తుంది. వీడు చెప్తున్నట్లు అందరూ తోకలు తెంపుకోవాల్సిన అవసరమేమీలేదు. ఆలోచించండి" అని అన్నది ముసలి నక్క. నిజాన్ని గ్రహించిన నక్కలు ఒక్కటొక్కటే సమావేశం నుండి జారుకొన్నాయి. చివరికి అక్కడ పొట్టితోక నక్క మాత్రమే మిగిలింది- విచారవదనంతో..తన పాచిక పారనందుకు పరితపిస్తూ!
Courtesy..
kottapalli.in