TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
అడవిలో ఆసుపత్రి
అనగనగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలోని జంతువులన్నింటికీ, పాపం ఏదో ఒక సమయంలో గాయాలు తగులుతూనే ఉన్నాయి. గాయాలు తగిలినప్పుడు వాటిని ఎలా మాన్పుకోవాలో ఆ జంతువులకి తెలీదు! రాను రాను ఈ సమస్య బాగా పెద్దదైంది. పట్టించుకోకపోతే ఇంక వీలయ్యేట్లు లేదు. అందుకని, అడవిలోని జంతువులన్నీ ఒకసారి సమావేశమయ్యాయి. సింహం ఈ సమావేశానికి పెద్ద .
అది ముందుగా లేచి, "మనం అందరం ప్రతిరోజూ ఏవో కొన్ని గాయాల బారిన పడుతున్నాము. గాయాలు తగిలినప్పుడు వాటిని ఎలా మాన్పుకోవాలో మనలో చాలామందికి తెలీటం లేదు. సమస్య బాగా పెద్దది. మనమంతా కలిసి, ఐకమత్యంతోటే దీన్ని సాధించగలం. మీలో ఎవరైనా దీనికి పరిష్కారం సూచించగలరా?" అన్నది.
అప్పుడు నక్క లేచి "మనమందరం ఏకం అవుదాం. మనకు హాని కలిగించేవాళ్ళనందరినీ చంపేద్దాం" అన్నది. సింహం దాని మాటల్ని కొట్టి పడేస్తూ "ఇది వీలు కాదు- మనకు హాని కల్గించే దెబ్బల్ని మనం ఎలా చంపగలం?" అన్నది నవ్వుతూ. "వేరే ఎవరైనా దీనికి పరిష్కారం చెప్పగలరా?" అని మిగిలిన వాళ్ళ కేసి చూసింది.
అప్పుడు పులి లేచి "మనం గాయాల బారిన పడుతున్నది చాలా వరకు మనుషుల వల్లే, కాబట్టి వాళ్ళు మన అడవిలోకి రాకుండా అడ్డుకుంటే సరి" అన్నది.
"ఇది కొంచెం బానే ఉంది. ఐతే మనుషులను ఆపటం ఏమంత సులభమైన పని కాదు. ప్రస్తుతానికి సభను ఇంతటితో ముగిద్దాం. రేపు ఉదయం తొమ్మిది గంటలకల్లా సభ మళ్ళీ మొదలవుతుంది. ఆలోగా మీరు బాగా ఆలోచించి ఏదైనా మార్గం సూచించండి" అన్నది సింహం.
మర్నాడు జంతువులన్నీ ఏవేవో ఆలోచనలు చెప్పాయి గానీ, సింహ రాజుకు అవేవీ నచ్చలేదు.
ఇంతలో కుందేలు లేచి నిలబడి, "మహారాజా! గాయాలు,దెబ్బలు రకరకాల కారణాల వల్ల ఎదురవ్వవచ్చు- కేవలం మనుషుల వల్లనే కాదు. అందరూ కొంచెం ఆలోచించండి-
మానవులకు దెబ్బ తగిలితే వాళ్ళు ఆ దెబ్బ తగిలించిన వస్తువుల్ని ఏమీ అనరు- దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి వెళతారు! అందుకని, మనం కూడా మన సమస్యను దూరం చేసుకోవాలంటే వాళ్లలాగే ఒక ఆసుపత్రిని నిర్మించుకోవాలి. వేరే మార్గాలేవీ పని చెయ్యవు" అన్నది.
జంతువులన్నీ "అవునవును" అన్నాయి. ఇంత అద్భుతమైన ఐడియా ఇచ్చినందుకు కుందేలును అభినందించాయి.
అన్నీ జంతువులు కలిసి శ్రమించి ఒక ఆసుపత్రిని నిర్మించుకున్నాయి. ఆ తరువాతగానీ వాటికి అనుమానం రాలేదు- "అవునూ, మనం ఇంత కష్టపడి ఆసుపత్రి కట్టాం కదా, మరి మనకు డాక్టరు గారు ఏరి?" అని.
"ఇంకెవరు, ఈ ఐడియా ఇచ్చిన కుందేలే మనకు డాక్టరు" అన్నది సింహం.
అప్పటికే రకరకాల మందు మొక్కల గురించి చదివి పెట్టుకున్న కుందేలు "సరే, దానిదేముంది?" అన్నది.
అప్పటి నుండి అడవిలోని జంతువులన్నీ దెబ్బ తగిలితే చాలు- కుందేలు డాక్టరుగారి దగ్గరికి పరుగు పెట్టసాగాయి!
Courtesy..
kottapalli.in