TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
తృప్తిపరుడు
ఒక ఊరిలో రాము అనే పేదవాడు ఉండేవాడు. అడవిలో కట్టెలు కొట్టి, వాటిని అమ్ముకొని జీవనం సాగించేవాడు అతను.
ఒక రోజు అతను అలా కట్టెలు కొట్టుకుంటూ ఉంటే ఏవో మాటలు వినపడ్డాయి. 'ఎవరివబ్బా, ఈ మాటలు?' అని కొన్ని అడుగులు ముందుకు వేసి చూశాడు రాము. అక్కడ మూడు ఆవులు మాత్రం ఉన్నాయి. అవి మాట్లాడుతున్నాయి!
అట్లా మాట్లాడే ఆవుల్ని చూసి రాము చాలా ఆశ్చర్య పోయాడు. అవి మ్యాజిక్ ఆవులన్నమాట! వెంటనే అతను వెనక్కి వెళ్ళి, ఆవులకు ఇష్టమయ్యే చక్కని పచ్చగడ్డిని కోసి తెచ్చాడు. తను దూరంగా ఉంటూ గడ్డిని మాత్రం ఆవులకు అందేలా వేస్తూ వచ్చాడు. ఆ ఆవులు ఆ గడ్డిని మేస్తూ తమకు తెలీకుండానే రాము వెంట వాళ్ల ఇంటికి వెళ్ళాయి.
ఒకసారి ఇల్లు చేరుకోగానే రాము వాటిని గబగబా కొట్టంలోకి తీసుకువెళ్ళి కట్టేసాడు. తనేమో పేదవాడు- మామూలు ఆవుల్ని కూడా కొనుక్కునేంత శక్తి లేదు. అట్లాంటి తనకోసం మాట్లాడే ఆవుల్ని దేవుడే పంపించాడని తన అదృష్టానికి పొంగిపోతూ, సంతోషంగా నిద్రపోయాడు. ఉదయాన్నే లేచి ఆవులతో మాట్లాడాలని కొట్టం తలుపు తెరిచి చూస్తే ఏముంది? ఆవులు లేవు!
అయితే రాము తెలివైన వాడు కదా, చుట్టు ప్రక్కల అంతా జాగ్రత్తగా వెతికాడు. కొంచెం దూరంగా బురదలో ఆవుల అడుగుజాడలు కనిపించాయి. వాటిని అనుసరిస్తూ అడవిలోకి వెళ్ళాడు రాము. కొట్టంలోంచి తప్పించుకొని అక్కడికి వెళ్ళిన ఆవులు అతను తమవెంట రావటం చూసి కంగారు పడ్డాయి. "ఇదేంటి, వీడు మనవెంట పడ్డాడు?" అని అవన్నీ ఒక్కసారిగా క్రిందపడి, చచ్చిపోయినట్లు నటించడం మొదలు పెట్టాయి. ఆవులు అన్నీ అట్లా క్రింద పడి ఉండటం చూసి రాము చాలా ఆందోళనతో పోయి వాటి పక్కన కూర్చున్నాడు. తన కారణంగానే అవన్నీ చచ్చిపోయాయేమో అని వాడికి చాలా బాధ వేసింది. అంతలో ఒక ఆవు కనురెప్పలు కదలడం చూసాడు వాడు. "ఓహో! ఇవి నన్ను చూసే ఇట్లా నటిస్తున్నాయన్నమాట!" అనుకున్నాడు.
"ఎందుకు నన్ను మోసం చేస్తున్నారు? నేను మీకు మేత, నీళ్ళు ఇచ్చి నా దగ్గర ఉంచుకుందామనుకున్నాను- అంతే తప్ప మిమ్మల్ని నేను ఏమీ చేయలేదే?" అడిగాడు రాము.
అప్పుడు మూడు ఆవులూ లేచి, నవ్వుతూ అన్నాయి- "మేము మనుషుల దగ్గర జీవించలేము, రామూ! అయితే నీ మంచి మనస్సుని బాధ పెట్టటం కూడా మాకు ఇష్టం లేదు. నీ పేదరికాన్ని పోగొట్టడానికి ఏవైనా మూడు వరాలు ఇస్తాము- కోరుకో " అని.
"ఒక మంచి ఇల్లు, మీ లాంటి మూడు చక్కని ఆవులు, ఓ ఎద్దులబండి ఇవ్వండి చాలు" అని కోరుకున్నాడు రాము.
"ఇతను దురాశకు లోనవ్వలేదు; తనకు తగినట్లుగానే వరాలను కోరుకున్నాడు!" అని ఆవులు సంతోషపడ్డాయి.
"సరే, ఇవన్నీ రేపు ప్రొద్దున నువ్వు నిద్ర లేచేసరికి నీ దగ్గర ఉంటాయి" అని చెప్పి ఆవులు రాముకి కనపడకుండా వెళ్ళిపోయాయి.
పొద్దునలేచి చూసేటప్పటికి రాము ఒక పెద్ద ఇంట్లో ఉన్నాడు! ఇంటి బయట మూడు చక్కని ఆవులు , ఒక ఎద్దుల బండి ఉన్నాయి! వాటితో రాము తన జీవితాన్ని సంతోషంగా గడిపేసాడు.
Courtesy..
kottapalli.in