Facebook Twitter
హైబ్రీడ్

తెలుగువ‌న్‌-అక్ష‌ర‌యాన్ ఉగాది క‌విత‌ల పోటీలో ద్వితీయ‌ బ‌హుమ‌తి రూ. 2,116 పొందిన క‌విత 'హైబ్రిడ్‌'

 

ఇంటిముందల మట్టిని
సిమెంటు మట్టుపెట్టి గట్టిపడ్డది
వాకిట్ల కళ్ళాపికి జాగలేక
కన్నీళ్లు పెట్టుకుంటా కనుమరుగైంది
రంగు రంగుల ముగ్గులేస్తే మురిసిపోయే న్యాలతల్లి
హంగులద్దిన వార్నిష్ పెయింటింగ్లకు బాకిపడ్డది
గడపకు పసుపు పెట్టె పడతులు లేక
కలప కలత సెందుతానే ఉంది
పచ్చని పరిమళాల ఆకుల తోరణాలు మాడ్రానైజ్ లోమంటకలిసినయి
ప్లాస్టికు పువ్వుల దండలై యార్లాడుతూ పకపక నవ్వుతున్నాయ్
యాపాకు నుండి మామిడికాయ దాకా అంతా మాయే
ఆరు రుసుల జీవితాన్ని ఆస్వాదించే
ఆరడుగుల దేహం ఎందుకో మళ్ళి మళ్ళి స్వార్థాన్ని రుచి చూస్తుంది
నీడనిచ్చే చెట్టు కాడల మీద కత్తి పెడితే
వాయువే కాదు నీ ఆయువు గూడా కలుషితమే
మట్టంటకుండా పనిసేద్దాం అనుకున్నావ్ గదా
చూసిన్వా మళ్ళి మట్టికుండ కాడికే వచ్చినవ్
మోకాళ్ల మీద నడిసినప్పుడు కాసింత మట్టి తిన్న
మనిషివే గదా
మర్చిపోయినవా కడకు మన కాయం గింత మట్టి
అయితదని
పండగలంటే ప్రకృతి పరిమళాలా గుభాళింపు
పస్తులుండేటోళ్ళ కడుపునింపితే వచ్చే కన్నీళ్లు
నీకు ఎర్కనా
మనని పలకరియ్యనింకే పదిమందుండరు అని
గుర్తుచేయ్యనింకనే పండగలోస్తాయ్
ఇంకోపారి చెప్తున్నా
స్వార్థాలు వీడిన సమాజం వచ్చినప్పుడే వసంతం..
గప్పుడే మనిషి మళ్ళి కోయిలయ్యి ఒక కొత్త పాట పాడగలడు
(న్యాలతల్లి=నేలతల్లి,
యార్లడుతూ=వేలాడుతూ,యాపాకు=వేపాకు,ఎర్కన=తెలుసా)


ర‌చ‌న‌:  పోలీస్ ప‌టేల్ సుష్మ‌