TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
గురువు
( పాటవెలదులు)
చదువు-సంధ్య నేర్పి శక్తి తోడ,
బతుకు బండి నడుపు బాట చూపి,
జ్ఞాన మిచ్చు దాత జగతి గురువు!
గురువు మొక్క బతుకు గురుతు తెలియు!
అక్షరాల మాల లల్ల తెలిపి,
అంకె గారడీల శంక తీర్చి,
జంకు లేక బ్రతుకు సాగ నేర్పు!
గురువు మొక్క బతుకు గురుతు తెలియు!
మంచి-చెడుల నడుమ మర్మ మెల్ల,
ఎంచి చూపు నొజ్జ యీశ్వరుండు!
పంచు జ్ఞాన విద్య పరమ ప్రీతి!
గురువు మొక్క బతుకు గురుతు తెలియు!
శిలను శిల్పముగను జేయు శిల్పి!
మట్టి బొమ్మకు ఘన మహిత గూర్చు!
అపర బ్రహ్మ శాస్త యవని లోన!
గురువు మొక్క బతుకు గురుతు తెలియు!
తనదు కనుల జూపు ధరణి నంత,
కొండ అద్ద మందు కూర్చి నట్లు!
తీర్ప రాని ఋణము దేశికునిది!
గురువు మొక్క బతుకు గురుతు తెలియు!
గురువు కన్న శిశువు గొప్ప నొంద,
కించ పడడు, తనకు కీర్తి యనును,
కన్న తండ్రి వలెను కరుణ జూపు!
గురువు మొక్క బతుకు గురుతు తెలియు!
బ్రహ్మ, విష్ణు, శివుల ప్రతిమ గురువు!
సకల దైవ రూపి చదువులయ్య!
భక్తి సేవ జేయ ముక్తి దొరకు!
గురువు మొక్క బతుకు గురుతు తెలియు!
కుసుమ. ఉప్పలపాటి.