TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
ఓ సంచలన రచయిత - శరత్ చంద్ర!
ccc కానీ ఓ 30 ఏళ్ల క్రితం పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఎవరిని కదిపినా కూడా శరత్ నవలల చిట్టా చదివేవారు. డిటెక్టివ్ నవలలకి పోటీగా శరత్ నవలలు అమ్ముడుపోయేవి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆధునిక భారతదేశంలో అత్యంత పాపులర్ రచయిత శరత్చంద్రే! శరత్చంద్ర బెంగాల్లోని దేవానంద్పూర్ అనే గ్రామంలో 1876లో జన్మించారు. శరత్ తండ్రి బద్దకిష్టి. ఎప్పుడూ పగటి కలలలో తేలిపోతుండేవాడు. ఏ ఉద్యోగంలోనూ స్థిరంగా ఉండేవాడు కాదు! దానికితోడు ఐదుగురు సంతానం. అంచేత పేదరికం ఎప్పుడూ వారికి తోడుగా ఉండేది. శరత్కు తండ్రి నుంచి ఆస్తులైతే రాలేదు కానీ, సాహిత్యం పట్ల అభిలాష మాత్రం వారసత్వంగా అందింది. 1903లో ఉద్యోగం కోసం బర్మాకు చేరుకున్న శరత్, అక్కడే తన సాహితీవ్యాసంగాన్ని ఆరంభించాడు. అదే ఏడాదిలో వచ్చిన ‘మందిర్’ అనే రచనను ఆయన తొలి ప్రచురణగా చెబుతారు.
అప్పుడొకటీ అప్పుడొకటీ, కథ ఒకటీ నాటకం ఒకటీ రాస్తూ ఉద్యోగం చేస్తూ ఉన్న శరత్ జీవితం... మళ్లీ బెంగాల్కు చేరుకోవడంతో వేగాన్ని అందుకొంది. 1916లో కోల్కతా సమీపంలోని హౌరాలో స్థిరపడిన శరత్ తన కలానికి పదునుపెట్టాడు. అదే సమయంలో సంస్కృత కావ్యాలని కూడా అధ్యయనం చేసే అవకాశం లభించడంతో, ఆయన రచనలు మరో స్థాయికి చేరుకున్నాయి. విప్రదాసు, చంద్రనాథ్, బడదీదీ, నయావిధాన్, శ్రీకాంత లాంటి 30కి పైగా నవలలు దేశాన్ని ఒక్క ఊపు ఊపేశాయి. శరత్ నవలలో ప్రతి ఒక్కటీ ప్రత్యేకమే! 1926లో వచ్చిన ‘పతేర్బడీ’ స్వాతంత్ర్య సంగ్రామం నేపథ్యంలో వచ్చిన నవల. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సామన్య జనాల్ని అది ప్రభావితం చేస్తోందన్న భయంతో ప్రభుత్వం ఆ నవలను నిషేధించాల్సి వచ్చింది. ఇక భగ్న ప్రేమికునికి మారుపేరుగా నిల్చిపోయే దేవదాసు గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది! బలమైన స్త్రీపాత్రలతో సాగే ‘పరిణీత’ వంటి నవలలూ ప్రజాదరణ పొందినవే! ఆనాటి ప్రజల జీవనవిధానాలనీ, సంప్రదాయలనీ చిత్రించే ‘పల్లీసమాజ్’ వంటి నవలలూ చిరకాలం గుర్తుంచుకోదగ్గవే!
శరత్ బెంగాల్ రచయిత మాత్రమే కావచ్చు. కానీ అనువాదాల పుణ్యమా అని దేశం యావత్తూ ఆయనను తన అభిమాన రచయితగా ఆరాధించింది. ఒకానొక సమయంలో శరత్ నవలలు చదివేందుకే బెంగాలీ నేర్చుకున్నవారు కూడా కనిపించేవారు. ఇక తెలుగువారి సంగతైతే చెప్పనే అవసరం లేదు. శరత్ తెలుగువాడేమో అన్నంతగా ఆయనను ఆదరించారు. విజయా సంస్థ వ్యవస్థాపకులలో ఒకరైన చక్రపాణి బెంగాల్ నేర్చుకుని మరీ శరత్ నవలలను తెలుగులోని అనువదించారు. తెలుగు చిత్రరంగం కూడా శరత్ పట్ల విపరీతమైన ఆభిమానం చూపింది. దేవదాస్ నవలల ఆధారంగా వాగ్దానం, తోడికోడళ్లు, బాటసారి, దేవదాసు, అర్ధాంగి వంటి చిత్రాలను నిర్మించింది. ఎన్టీఆర్ తొలిచిత్రమైన ‘మనదేశం’ కూడా ‘విపుర్దాస్’ అనే శరత్ నవల ఆధారంగానే రూపొందించారని చెబుతారు.
శరత్ నవలలోని నాయకులందరూ సిగ్గరులే! కొండొకచో వ్యసనపరులే! శరత్ కూడా తన జీవితంలో అలాగే ఉండేవాడట. విపరీతంగా తాగడం, నల్లమందు తినడం చేసేవాడట. 1938లో లివర్ కేన్సర్తో చనిపోవడానికి ఆ తాగుడే కారణం కావచ్చునంటారు. శరత్ వ్యసనాలని పక్కనపెడితే ఆయన వ్యక్తిత్వం మాత్రం ఆయన సాహిత్యమంత ఉన్నతంగానే ఉండేదట. శరత్ ఆనాటి స్వతంత్ర్య సంగ్రామంలో పాల్గొని 15 ఏళ్లపాటు హౌరా కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు. ఆయన జాతిబేధాలను పాటించేవారు కాదట! హౌరాలోని సంతేబర్ ప్రాంతంలో ఉండగా శరత్ కులమతాలను పాటించకపోవడం చూసి, అక్కడి ప్రజలు ఆయనను వెలివేశారు. దాంతో స్వయంగా ఒక ఇంటిని నిర్మించుకుని పదకొండేళ్లపాటు ఆ ఇంట్లోనే నివసించారు. ఆనాడు శరత్ నివసించిన ఇంటిని, బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికీ సంరక్షిస్తూ వస్తోంది. శరత్చంద్ర వాడిన వస్తువులనూ, నాటిన చెట్లనూ ఇప్పటికీ ఆ ఇంటి ప్రాంగణంలో చూడవచ్చు.
శరత్ తన జీవితకాలంలోనే గొప్ప రచయితగా పేరు పొందాడు. అయినా తాను అంతటివాడినన్న అభిజాత్యం కానీ, తన కీర్తికి తగిన గౌరవం దక్కాలన్న కక్కుర్తి కానీ ఆయనలో కనిపించేది కాదు. అందుకేనేమో టాగూర్ వంటి సమకాలికులు ఆయనను ఎంతగానో గౌరవించేవారు. ప్రస్తుతం శరత్ని అభిమానించడానికి ఆయన వ్యక్తిత్వం గురించి మనకి తెలియనవసరం లేదు. కానీ ఒక్కసారి ఆయన రాసిన పుస్తకం ఏదన్నా చేత పట్టుకుంటే చాలు... రచయితగా ఆయన సత్తా ఏమిటో మనకి తేలిపోతుంది. మంచో- చెడో, కాల్పనికమో- వాస్తవికమో, ప్రేమో- విషాదమో, వ్యసనమో- పవిత్రతో... ఇతివృత్తం ఏదైనా పాఠకుడిని తను సృష్టించిన ప్రపంచంలోకి లాక్కుపోయేలా రాయడం ఎలాగో తెలిసిపోతుంది.
- నిర్జర.