TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
మనసులో ఘర్షణని మాటగా మార్చిన కవి- బైరాగి
కొందరు రచయితలు బతికుండగానే గొప్ప సాహిత్యకారులుగా కీర్తిని సాధిస్తారు. ఆ కీర్తితో పాటుగా వచ్చే సౌఖ్యాలనూ అనుభవిస్తారు. మరికొందరు ఉంటారు! వారి జీవితం సాహిత్యం కోసమే అన్నట్లుగా సాగుతుంది. ఎలాంటి భేషజాలకూ, భుజకీర్తులకీ లొంగకుండా సాహిత్యమే తొలి ప్రాధాన్యతగా బతికేస్తారు. కీర్తి వస్తోందా లేదా, డబ్బు అవసరమా పాడా... అన్న మీమాంసలేవీ వారిలో కనిపించవు. వారి నిర్లక్ష్యానికి తగినట్లుగానే పేదరికంతోనే సదరు జీవితం గడిచిపోవచ్చు. కానీ సాహిత్యం పట్ల నిబద్ధతతో వారు సృజించిన రచనలు తరతరాల వరకూ నిలిచే ఉంటాయి. అలాంటి రచయితలను ఉదాహరణగా చెప్పుకోవాలంటే ముందుగా ఆలూరి బైరాగే గుర్తుకువస్తాడు.
బైరాగి కలంపేరు కాదు. అతను పుట్టీపుట్టగానే తల్లిదండ్రులకు తోచిన పేరు. 1925లో తెనాలికి సమీపంలోని ఓ చిన్న పల్లెటూరులో ఆలూరు బైరాగి జన్మించారు. ఆయన ఎక్కువకాలం బడికి వెళ్లింది లేదు. బహుశా ఆ రోజుల్లో చదువుకునే అవకాశాలు కూడా అంతంతమాత్రంగానే ఉండిఉంటాయి. అందుకనే రెండో తరగతి దాకా బడిబాట సాగించిన బైరాగి తర్వాత అందుబాటులో ఉన్న హిందీ పాఠశలలో చేరారు. ఆ హిందీలో ఒకో మెట్టూ ఎక్కుతూ ఉన్నతాభ్యాసం కోసం ఉత్తరాదికి వెళ్లారు. అక్కడివారితో పోటాపోటీగా హిందీ నేర్చుకోవడమే కాదు... హిందీ కవిసమ్మేళనాలలో పాల్గొనేంతగా అద్భుతమైన కవితలను సృష్టించారట!
1946లో హిందీ ఉపాధ్యాయుడిగా తెలుగునాట తన వృత్తి జీవితాన్ని మొదలుపెట్టారు బైరాగి. ఒకపక్క వృత్తిలో సాగుతూనే అటు హిందీలోనూ, ఇటు తెలుగులోనూ కవితలు రాయడం మొదలుపెట్టారు. ఆ సమయంలో బైరాగి దగ్గర చుట్టమైన ఆలూరు వెంకట సుబ్బారావు (చక్రపాణి) కంటపడ్డారు. చక్రపాణి చందమామ పత్రిక వ్వవస్థాపకులలో ఒకరన్న విషయం తెలిసిందే కదా! హిందీలో వెలువడుతున్న చందమామకు సంపాదకత్వం వహించవలసిందిగా చక్రపాణి కోరడంతో, బైరాగి ఆ బాధ్యతలను స్వీకరించారు. కానీ స్వేచ్ఛపిపాసి అయిన బైరాగికి చందమామలోని వాతావరణం నచ్చలేదు. వినీలాకాశంలో కనిపించే చందమామే ఆయనకు ముద్దుగా తోచింది. దాంతో తిరిగి తెనాలికి చేరుకున్నారు.
ఆ రోజుల్లో విప్లవ కవిత్వం అంటే శ్రీశ్రీ గుర్తుకువచ్చేవారు, భావగీతిక అంటే కృష్ణశాస్త్రి మెదిలేవారు. కానీ బైరాగి కవిత్వం ఈ రెండు కోవలకీ భిన్నంగా సాగేది. తనలో మెదులుతున్న ఘర్షణకు అక్షరరూపంగా ఆయన కవిత్వం తోచేది. సమాజంలోని కుళ్లుని చూసిన తర్వాత, కలిగే వేదనని వ్యక్తీకరించేందుకు కవిత్వాన్ని సాధనగా ఆయన ఉపయోగించారు. అందాన్ని వర్ణించేందుకో, విప్లవాన్ని వల్లించేందుకో కాకుండా... జీవితాన్ని నగ్నంగా చూపించేందుకు తన కవితను వినియోగించారు. బైరాగి తొలి కవితా సంపుటి ‘చీకటినీడలు’లో ‘మీ నిద్రాసుఖసమయంలో/ స్వాప్నిక ప్రశాంతి నిలయంలో/ మేం పీడకలలుగా వస్తాం/ రౌరవదృశ్యం చూపిస్తాం’ అనే వాక్యాలు చదివితే ఆయన ఉద్దేశం ఏమిటో ఇట్టే అర్థమవుతుంది.
చీకటినీడలు పుస్తకంతో పాటుగా నూతిలో గొంతుకలు, ఆగమగీతి అనే కవితా సంపుటిలను కూడా బైరాగి రాశారు. వీటిలో ఆగమగీతి పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది. ఇవే కాకుండా దివ్యభవనం పేరుతో పదకొండు కథల సంపుటిని కూడా వెలువరించారు. బైరాగి చివరిరోజుల్లో క్షయవ్యాధికి లోనయ్యారు. కానీ ఆ వ్యాధి నుంచి ఉపశమనం పొందేందుకు ఆయన ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. ఫలితంగా 53 ఏళ్ల చిన్న వయసులోనే చనిపోయారు. బైరాగి చనిపోయిన తర్వాత తెలుగు, హిందీ, ఆంగ్లాలలో అముద్రితంగా మిగిలిపోయిన సాహిత్యమెంతో ఆయన సామాన్లలో బయటపడింది.
బైరాగి ఇంకొన్నాళ్లు బతికుంటే మరిన్ని అద్బుతమైన రచనలు వెలువడేవేమో! కానీ పరిపూర్ణమైన ప్రపంచం గురించి ఆలోచించినంతగా నిండైన జీవితం గురించి ఆయన తపించి ఉండడు. అందుకే ‘నే సృజించిన/ అనంత జీవన వసంతవనంలోన/ చావుకు తావులేదు నాకు చావు లేదు/ నేను మృత్యుంజయుణ్ని’ అంటూ పలవరించేవారు. ఆ పలవరింతలనే నేటి కవులు ప్రణవనాదాలు భావించి రాస్తే బైరాగిలా రాయాలి అని తపిస్తున్నారు. అలాంటి ప్రతి కవి తపనలోనూ బైరాగి జీవించే ఉంటాడు.
- నిర్జర.