Facebook Twitter
జగమెరిగిన రాజారామమోహనరావు

పత్రికలు కథలు స్వీకరించడంలేదు. రాసిన ప్రతి కథా తిరిగి వచ్చేస్తున్నది. తిరిగివచ్చిన కథలను ఏం చేసుకోవాలి? చించి పారేసే బదులు, పదిమందీ చదివేలా చేస్తే మేలనిపించింది. 
 నాలాంటి వర్ధమాన రచయితలంతా కూడబలుక్కున్నాం. ఓ లిఖిత పత్రిక ప్రారంభించాలనుకున్నాం. అప్పుడు రూపుదిద్దుకున్నదే ‘జ్వాల’. సంపాదకుకుడు ఎవరంటే? నువ్వే అన్నారంతా. దాంతో 1976 లోనే సంపాదకుడు  జగన్నాథశర్మ అయిపోయాను.  
 కథలకు బొమ్మలు గణేశ్ వేసేవాడు. ఆయనకి మా ఊరిలో పెద్దల బట్టల దుకాణం ఉండేది. పత్రికకు పెట్టుబడి ఆయనే పెట్టాడు. కాగితాలూ, కలర్ పెన్నులూ అన్నీ ఆయనే కొనిచ్చాడు. స్వీకరించిన కథలూ, కవితలూ, జోకులూ అన్నీ పత్రికలో నేనే రాసేవాణ్ణి. అరఠావు సైజులో 200 పేజీల పత్రికంతా నా చేతి రాతతో నిండిపోయేది. దానిని బౌండు చేయించి, పాఠకులకోసం స్థానిక గ్రంథాలయంలో ఉంచేవాణ్ణి. గ్రంథాలయంలో పత్రికను ఉంచేందుకూ, నలుగురికీ చెప్పి దానిని చదివేలా చూసేందుకూ లైబ్రరేరియన్ కు రోజూ ఓ టీ తాగించేవాణ్ణి. టీ కోసం కాదుగాని, లైబ్రరీరియన్ కి నా కష్టం, నా ఇష్టం నచ్చిందేమో! జ్వాలను ప్రముఖంగా ప్రదర్శించేవాడు. అందరూ చదివేలా చేసేవాడు.     
 రెండు సంచికలు విడుదలయి, పాఠకుల మన్నలను అందుకోవడంతో ఊరిలో ప్రముఖులంతా నన్ను ఆదరించసాగారు.  
 శ్రీ రామవరపు వేణుగోపాలరావుగారు ఆనాటికే యువ మాసపత్రికకు సంపాదకునిగా ఉండి, అనివార్య కారణాలవల్ల రాజీనామా చేశారు దానికి. మా ఊరికి వచ్చారు. స్వంతంగా పత్రికను ప్రారంభించే ఉద్దేశంలో ఉన్నారు. ఆ పత్రికకోసం పెద్దపెద్ద రచయితల కథలనూ, నవలలనూ సేకరించి ఉంచారాయన. ఆ సంగతి తెలుసుకున్న నేను, ఆ పెద్ద రచయితల కథలిస్తే మా లిఖితపత్రికలో వేసుకుంటానన్నాను. పెద్దగా నవ్వారాయన. నవ్వి, నా స్నేహితుల కథలు కొందరివి ఇస్తాను, అయితే వాటిని వేసుకునేందుకు ఆ రచయితల అనుమతి తీసుకోవాలన్నారు. డి. వెంకట్రామయ్య, గుమ్మా ప్రసన్నకుమార్, శ్రీకంఠమూర్తి, వి. రాజారామమోహనరావు...చాలా మంది స్నేహితుల కథలు ఉన్నాయి వారి దగ్గర. అయిదువందల పదాలలో ఉన్న వి. రాజారామమోహనరావు కథ నాకు నచ్చింది. వారి అనుమతి కోసం గణేశ్ దుకాణం నుంచి హైద్రాబాద్ కి ట్రంకాల్ బుక్ చేసి మాట్లాడాను. 
 లిఖిత పత్రికలో కథ వేసుకుంటారా? అనుమతి కావాలా? అని పగలబడి నవ్వారు రాజారామమోహనరావు. వేసుకోండి అన్నారు. పారితోషికం ఇస్తారా? అడిగారు. అయిదు రూపాయలిస్తాం. మని ఆర్డర్ చేస్తాం అన్నాను. వద్దు! మీరే ఉంచుకోండి. మరిన్ని కాగితాలూ, కలాలూ కొనుక్కోండి అన్నారు. అది మొదటిసారి రాజారామమోహనరావుతో నా పరిచయం. 
 ఇట్టే అయిదేళ్లు గడచిపోయాయి.  
 వేణుగోపాలరావు హైదరాబాద్ ఈనాడు అసోసియేట్ ఎడిటరయ్యారు. నేను కూడా ఈనాడులో జాయినయ్యాను. ఈనాడులో జాయినయిననాటికి, నా కథలు అనేకం పత్రికల్లో ప్రచురణకి నోచుకున్నాయి. బహుమతులు కూడా అందుకున్నాయి. చిత్రకారుడు చంద్ర సంపాదకుడిగా ఉన్న ‘పుస్తక ప్రపంచం’ లో నా కథలు తరుచూ ప్రచురణయ్యేవి. ఆనాడు ఆ కథల ప్రచురణకి ప్రధాన కారణం రాజారామమోహనరావని తర్వాత తెలిసింది. చంద్రా, వారూ స్నేహితులు. రామమోహనరావు చెప్పబట్టే నన్ను ప్రోత్సహించినట్టుగా చంద్ర చెప్పారోసారి.       
 నన్ను చూడడానికి చంద్ర సహా రాజారామమోహనరావు ఈనాడుకి వచ్చారు. నన్నుచూసి ‘కుర్రాడు’ అని నవ్వారిద్దరూ. రండి! టిఫిన్ చేద్దామని, ద్వారక హోటల్ కి తీసుకెళ్లారు. ఆకలిగా ఉన్నదంటే...ఫుల్ మీల్స్ పెట్టించారు. 
 ‘‘జాగ్రత్త శర్మా! ఇది హైదరాబాద్! ఇక్కడ నీ గొంతు వెయ్యిగొంతులై ప్రతిధ్వనిస్తుంది. నిన్ను భ్రమల్లో ముంచి తేల్చుతుంది. రకరకాల కోరికల్ని కలిగిస్తుందీ నగరం. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి.’’ చెప్పారు రాజారామమోహనరావు. 
 ‘‘మహానగరంలో బతుకు ఒత్తిడిమయంగా ఉంటుంది శర్మా! ఆ ఒత్తిడిలో నువ్వూ, నీ కలలూ రెండూ మాయమయిపోతాయి. మాయంకాకుండా జాగ్రత్తపడు.’’ చెప్పారు చంద్ర.
 నా బాగోగులు గమనించేందుకు మా అన్నగారు గణపతిరావు హైదరాబాద్ వచ్చారోసారి. పర్వాలేదు, బతికేస్తాడు అన్న భరోసా నా మీద కలిగిందేమో! రెండు రోజుల తర్వాత ఊరికి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. గోదావరి ఎక్స్ ప్రెస్ కోసం నాంపల్లి స్టేషన్ కివచ్చాం. రిజర్వేషన్ ఉంటే బాగుండేది. లేదు. జనరల్ టిక్కెట్టు తీసుకుని, ట్రయిన్ కోసం వేచి చూస్తున్నాం. అప్పుడు అటుగా వచ్చారు రాజారామమోహనరావు. నన్ను చూసి పలకరించారు. అన్నయ్యని పరిచయం చేసుకుని, రండి! చాయ్ తాగుదాం అనిచెప్పి, క్యాంటీన్ కు తీసుకెళ్లి చాయ్, బిస్కట్ తినిపించారు. ఇక్కడి కారా బిస్కట్స్ బాగుంటాయంటూ ఓ ప్యాకెట్ బిస్కట్లు అన్నయ్యకి కొని ఇచ్చారు. గోదావరికి రిజర్వేషన్ లేదని చెబితే...మీరేమీ కంగారు పడకండి! నేను చూసుకుంటానని, ఓ టీటీఈకి అన్నయ్యని అప్పగించారు. నా భుజమ్మీద చేయివేసి, ప్లాట్ ఫారం మీద నిల్చున్న రాజారామమోహనరావుని, కదలుతున్న ట్రయిన్ లోంచి చూసి, పొంగిపోయాట్ట మా అన్నయ్య! తమ్ముడికిక తిరుగులేదనుకున్నాట్ట! ఊరికి వెళ్లినప్పుడు అన్నయ్య చెప్పాడు.  
 నేనూ, రాజారామమోహనరావూ తరుచూ కలుసుకునేవాళ్లం. నేను పండక్కి ఊరికి వెళ్లాలంటే...రాజారామమోహనరావే ముందు టిక్కెట్లు రిజర్వ్ చేయించి, డబ్బులు తర్వాతిస్తే తీసుకునేవారు. తిరుగుప్రయాణానికి డబ్బులు ఉన్నాయి కదా? అని అడిగేవారు. ఉన్నాయంటే...నిజం చెప్పమని గద్దించేవారు. డబ్బులు చూపిస్తే...సరేననేవారు. ట్రయిన్ లో తినేందుకు  క్యాంటీన్ లో టిఫిన్స్ పాక్ చేయించి ఇచ్చేవారు. డబ్బులిస్తే తీసుకునేవారు కాదు. ఓ తమ్ముణ్ణి ఓ అన్నయ్య చూసుకునేట్టుగా చూసేవారు. 
 ‘అరణి’ కలం పేరుతో నేను కథలు రాసిన రోజుల్లో ‘అరణి’ నేనేనని మొదటిసారిగా గ్రహించింది రాజారామమోహనరావే! అక్కడా ఇక్కడా బహుమతులు అందుకుంటున్న నా కథలు చూసి, ఈ అరణి ఎవరో కాదు! శర్మే! ఉద్యోగ భయంతో పాపం! కలంపేరు పెట్టుకున్నాడు. పేరయితే మార్చుకున్నాడుగాని, శైలి ఎలా మార్చుకుంటాడు? అన్నారట చంద్రతో. మళ్లీ అసలు పేరుతో కథలెప్పుడు రాస్తాడో? అని బాధపడ్డారట! రాస్తాడు, దానికి బాధ ఎందుకు? అంటే...కలం పేరుకీ, అసలుపేరుకీ మధ్య చాలా తేడా ఉంటుంది. కలం మాస్క్ పెట్టుకోకూడదు అన్నారట. ఆ మాస్క్ తొలగించి, నేను కథలు రాసిన రోజు పొంగిపోయారాయన.
 రచయితగానే కాదు, పత్రికా రచయితగా కూడా నేనంటే చాలా ఇష్టపడేవారు రాజారామమోహనరావు. నేను ఏ పత్రికలో పనిచేసినా అడిగితేనే కథ రాసిచ్చేవారు. కథలపోటీల్లో కూడా నేను అంగీకరిస్తేనే పాల్గొనేవారు. వద్దంటే..పాల్గొనేవారు కాదు. ఇంకా మీకేనా బహుమతులు? కొత్తవారికి రానీయండి అంటే...అలాగే అనేవారు. అడిగితే కాదనక, పోటీకథలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించేవారు. ఎక్కడా శషభిషలుపోయేవారుకాదు. 
 కళింగాంధ్రకథకుల్ని ఇష్టపడే రాజారామమోహనరావు, మీరంతా కష్టజీవులయ్యా! అందుకే మీ కథలన్నా, మీరన్నా నాకిష్టం అంటారు. మీ భాషలో, మీ యాసలో గొప్ప సంగీతం ఉందయ్యా! ఆ సంగీతానికి పడిపోతారంతా అంటారు. 
 కథ ఎప్పుడూ ఓ వ్యక్తి జీవితాన్ని పూర్తిగా ఆవిష్కరించదు. కాకపోతే ఆ వ్యక్తి, వ్యక్తిత్వాన్ని కాగడాపట్టిచూస్తుంది. చూపిస్తుంది. రాజారామమోహనరావు కథలాంటివారు. కథ అంటే నవలను నిలువునా కొలిచే సాధనం. కథ అంటే కవిత వైశాల్యాన్ని తెలియజేసే జాణతనం. కథ అంటే గుండెగొంతులో ప్రతిధ్వనించే ఓ గొప్ప నినాదం. కథంటే...శ్రీ రాజారామమోహనరావు. 

జగన్నాథశర్మ