Facebook Twitter
తండ్రి ఆజ్ఞ

పురాణ కాలంలో  మేధాతిథి అనే ముని వుండేవాడు.  అతనికి  చిరకారి అనే పేరున్న   కుమారుడు ఉన్నాడు. చిరకారి బుద్ధిమంతుడు. అతడికి ఒక మంచి అలవాటు ఉంది. ఏదైనా  పని అప్పగిస్తే  పనిని  మొదలు పెట్టే  ముందు  చక్కగా ఆలోచించేవాడు. ఆ పని జరగడం వల్ల మంచి జరుగుతుందనుకుంటే చేసేవాడు.  లేదంటే ఆగిపోయేవాడు. 
 ఒక రోజు మేధాతిథి,  తన కొడుకు చిరకారిని  పిలిచి  “మీ అమ్మ ఒక అపరాధం చేసింది. ఆమెపై నాకు కోపం  వచ్చింది. వెంటనే  ఆమెను  చంపు”  అని ఆజ్ఞాపించాడు. అలా ఆదేశించిన మేధాతిథి అంతే వేగంగా  బయటకు వెళ్ళిపోయాడు. 
 తొందరపడి పనులు చేసే అలవాటు లేని చిరకారి తండ్రి మాటలు వినగానే కలవర పడ్డాడు.   తండ్రి అప్పగించిన పని గురించి  బాగా  ఆలోచించాడు. 
“తండ్రి ఆజ్ఞ మీరకూడదన్నది సత్యమే కానీ  తల్లిని చంపడం పాపం కదా. ఆమెను  తప్పక  రక్షించుకోవాలి.  తల్లిదండ్రులకు కలిగిన   పుత్రుడు తల్లినే చంపే  పని చేయాలా”  అనుకుని బాధ పడ్డాడు.   
చిరకారి   ఆలోచనల్లో ఉండగా    బాల్యం నుండి అతడికి తల్లి  చేసిన సేవలు  గుర్తుకి వచ్చాయి.    

“ తల్లిని చంపితే నరకం వస్తుంది. అలాగని తండ్రి  ఆజ్ఞను ధిక్కరించినా  పాపమే.  వంశాన్ని  నిలబెట్టే విషయంలో   తల్లి  నేల అయితే తండ్రి అందులో బీజాన్ని  నాటుతాడు.  కాబట్టి  తల్లిదండ్రులిద్దరికీ సంబంధించిన వాడినవుతాను.  “ఆత్మా లై పుత్ర నామాసి” అన్న శృతి వాక్యాన్ని అనుసరించి తండ్రియే బిడ్డగా జన్మిస్తాడు. అంటే నా తండ్రి అంశతో  నేను  పుట్టాను.  తపస్సు, ధర్మం, విద్య,  శ్రేష్టమైన దైవం అన్నీ తండ్రియే. 
అరణిని మధించడం చేత అందులో నిప్పు పుడుతుంది.  అలాగే అవయవాలు,  శరీరం అంతా తల్లి వల్లనే కలుగుతాయి. అన్నిటికీ మించి భరించ శక్యం కాని గర్భధారణ కష్టాన్ని కూడా తల్లి అనుభవిస్తుంది.  తర్వాత కూడా బిడ్డ కోసం  తల్లి పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు.  తండ్రి బాధ్యత బిడ్డల యోగక్షేమాలు  విచారించడమే కానీ  నిజానికి బిడ్డను సంరక్షించేది  తల్లే.  తండ్రి కన్నా తల్లే   గౌరవంలో గొప్పదని ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి.  నిజానికి  కొడుకు చిన్న వయసులో ఉన్నా,   యుక్త వయసులో ఉన్నా,  వృద్ధుడైనా  సరే కొడుకు మీద తల్లికి ప్రేమ ఒకేలా  ఉంటుంది.  తల్లి అనే వస్తువే ఈ  లోకానికి  మూల కారణం.  నీచ  ప్రాణులకైనా,   ఉత్తమ ప్రాణులకైనా,  తల్లి అవసరం ఒకేలా ఉంటుంది.  తల్లి అనే పదార్ధం ఉన్నచోట సుఖం ఉంటుంది.  లేకపోతే శాంతి ఉండదు.  ధనవంతుడికైనా,  బీదవాడికైనా,  పండితుడికైనా,  మూఢుడికైనా,  బలవంతుడికైనా,   బలహీనుడికైనా  తల్లి జీవించి ఉంటేనే సుఖంగా  ఉంటుంది. 
మహాపూజ్యురాలైన  తల్లిని చంపడం మహాపాపమనే సముద్రంలో ముంచి వేస్తుంది.  కాబట్టి  తల్లిని చంపడానికి  నాకు చేతులెలా వస్తాయి?” .  అతడి ఆలోచనలు  అలా ఎన్నో విధాలా  సాగాయి.  

 బయటకు  వెళ్లిన  మేధాతిథి కోపం తగ్గగానే  మరోలా ఆలోచించాడు.   “ భార్యని చంపమని నా కొడుకు చిరకారితో  చెప్పాను.  కోపంలో  చెప్పినా సరే  తొందరపడి పనులు చేసేవాడు కాదు నా కొడుకు. క్షణికావేశంలో   తీసుకున్న నిర్ణయం వలన అనర్ధం జరిగిందేమో.  వాడు తల్లిని చంపేసి ఉంటే ఇప్పుడెలా ” అనుకున్నాడు. 

అలా అనుకోగానే  అక్కడ నుండి ఇంటికి  వెళ్ళాడు  
చిరకారిని   పిలిచి “ నాయనా !  ఎన్నో కష్టాలను ఓర్చుకుని నీ తల్లి  నీకు జన్మనిచ్చింది.  పెంచి పెద్ద చేసింది. ఆమెని చంపమని  నీతో చెప్పాను.  నువ్వు  తొందరపడి నిర్ణయాలను తీసుకోవని నాకు తెలుసు. మీ తల్లి   బ్రతికే ఉంది కదా”   అని  అడిగాడు అనుమానంగా .  

తండ్రి  మాటలు వినగానే చేతిలోని  కత్తిని  కింద పడేసి  ఆయన కాళ్ళ మీద పడ్డాడు చిరకారి. లోపల ఉన్న మునిపత్ని కూడా వచ్చి భర్త  పాదాల మీద పడింది. ఇద్దర్నీ లేవనెత్తి కౌగలించుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఆశీర్వదించాడు మేధాతిథి. దీర్ఘంగా ముందు  వెనుకలు ఆలోచించి, నిర్ణయం తీసుకున్న కొడుకును  మెచ్చుకున్నాడు. 

వాళ్ళతో   మేధాతిథి “ ఒక  కార్యం చెయ్యాల్సి వచ్చినపుడు ధీరత్వంతో మంచి చెడ్డలు ఆలోచించి  పని చెయ్యాలి .  పనులు చేసేటప్పుడు ఆలోచించి చేసేవాడిని ఆర్యుడనీ , ఆలోచించకుండా చేసేవాడిని అనార్యుడనీ అంటారు.  తొందరపడకుండా చాలాసేపు ఆలోచించి యితడు మిత్రుడు,  యితడు శత్రువు,  యితడు యోగ్యుడు,  యితడు అయోగ్యుడు అని పరిశీలించి ఆచరించే బుద్ధిమంతుడు సమస్త శుభాలను పొందుతాడు. అలాంటి  బుద్ధిమంతుడివైన  నువ్వు నా కొడుకువైనందుకు ఎంతో   గర్వపడుతున్నాను” అని కొడుకుని కౌగిలించుకుని ఆశీర్వదించాడు.  

“ధర్మరాజా!  అందువల్ల మంచి చెడ్డలు చక్కగా ఆలోచించి తొందరపాటు లేకుండా చేసే కార్యాలు శాశ్వత ఫలితాలనిస్తాయి. తొందరపడి ఒకడు పనిచేస్తే ఆ పనిచేసిన వాడికి తర్వాత పశ్చాత్తాపం కలిగిస్తుంది. అట్లా కాకుండా చక్కగాను, దీర్ఘంగాను ఆలోచించి దోషం లేదని నిర్ణయించుకుని పని చేసిన వాడికి శుభాన్ని,  కీర్తిని కలిగిస్తుంది”  అని భీష్ముడు ధర్మరాజుతో  చెప్పిన కథ ఇది.