కవిత్వం ఎల్లప్పుడూ గాలిలా వీస్తుంది
కవిత్వం ఎల్లప్పుడూ
గాలికన్నా వేగంగా అంటుకుంటుంది
కవిత్వం ఎల్లప్పుడూ
సూర్యునిలా వెలుగుతుంది!
నీరు పల్లానికే ప్రవహిస్తుంది
కవిత్వం ఏటికి ఎదురీదుతుంది
కవిత్వం తల్లి పాలలా స్వచ్ఛంగా ఉంటుంది!
భూమి ఉన్నంత లెక్కన కవిత్వం
కొత్త విత్తులా నాటుకు పోతుంది
కవిత్వం ధరణిపై నవ కళ్యాణానికి ఎప్పుడూ
శ్రీకారం చుడుతూనే ఉంటుంది !
అది మనిషిలా నడుస్తుంది
మానవ మేథలా మాట్లాడుతుంది
కవిత్వానికి ఎన్నడూ వయో భేదాల్లేవ్ లింగభేదాల్లేవ్
కుల మత జాతి ప్రాంతాల భాషా తేడాల్లేవ్!
అది వర్తమానంపై క్షణ క్షణం సంభాషిస్తూ
భవిష్యత్ చిత్ర రచనలో
ఒక అలుపెరుగని విశ్వమోహనధారి కవిత్వం!
కవిత్వం మనలా మరణించదు
కవిత్వం హత్య కు గురికాదు
అది బూటకపు ఎన్‌కౌంటర్లకు దొరకదు
కవిత్వం ఖైదు నుండీ కూడా ప్రవహిస్తుంది
సామాజిక పురిటిగదిలో లయించే
కవిత్వమొక నిరంతర పూర్ణగర్భిణి!
ఒకతరాన్నుండి మరో తరానికి
కవిత్వమెప్పుడూ వారధిగా సారథిగా
భాషకు గోసకు ఒక అంతర్గత
జ్వరతీవ్రతకు లోచూపుగా
ఒక అగ్నిపర్వత లావాలా
ఎగిసిపడుతూ సాగిపోతూనే ఉంటుంది!
ఎప్పుడైనా నాలుగు వాక్యాలు రాసి
వస్తువేదో చేజారి పోయిందని బాధపడుతూ
హడావుడి పడుతూ అలిసి పోయి
ఒక అసంపూర్ణ గేయాల్నిఅలా వదిలేసి పోయినా
తప్పిపోయిన బిడ్డ రాకడ కోసం కవిత్వం
తల్లిలా తనువంత కళ్ళు చేసుకొని
ఎదురు చూస్తూ ఉంటుంది!
కవిత్వం కవులపాలిట జీతం ఎరుగని కావలి!!
కవిత్వం కవుల జీవితాలెరిగిన హమాలీ!!!
కవిత్వం పసిపాపలానూ నవ్వుతుంది
అది పడుచు పిల్లలానూ గలగలలాడుతుంది
అంతమాత్రాన,
బంపర్ ఆఫర్ ఇవ్వటానికి కవిత్వం
మాటల గారడీల మాయజాలం కాదు
అది ముసురుకున్న చీకట్లను పారద్రోలే తారాజువ్వ
అది సృజనకు ఆచరణకూ మధ్య నుండే అగ్ని సరస్సు !
శాఖోపశాఖలై ఊడలు ఊడలుగా దిగి
అన్ని భాషానిఘంటువులలోకి తనదైన శైలిలో సంతకాలుచేస్తూ
కవిత్వం కాలవాహినిలా విస్తరిస్తూనే పోతుంది
కవిత్వమెప్పుడూ రోగగ్రస్త సమాజంలో
ఒక ప్రజా వైద్యునిలా పనిచేస్తూ ఉంటుంది
అదే ఒకవీరునిలానూ కవాతు చేస్తుంది
కవిత్వం కాలం కత్తుల వంతెన మీద
యుద్ధ తంత్ర నినాదమై
ఎల్లప్పుడూ ముందు నడుస్తూనే ఉంటుంది
చిరంజీవి కవిత్వం!
చిరాయువు ఇవాళ్టి కవిత్వం!!
- సజ్జా వెంకటేశ్వర్లు
