Facebook Twitter
నెమలి అందం కథ

నెమలి అందం కథ

 


ఒక అడవిలో ఒక నెమలి, పావురం, కోయిల స్నేహంగా ఉండేవి. కోయిల కాకిలాగా నల్లగా ఉండేది. పావురం బూడిద రంగులో మట్టికొట్టుకున్నట్లు ఉండేది. కానీ‌ నెమలి మటుకు రంగు రంగుల పింఛాలతో చాలా అందంగా ఉండేది. అడవిలో‌ని పక్షులన్నీ నెమలి అందాన్ని పొగుడుతూ ఉండేవి. దాంతో నెమలికి చాలా గర్వం పేరుకున్నది. అయితే పావురం, కోయిల మటుకు దాని అందానికి ఏమంత ప్రాధాన్యతనిచ్చేవి కాదు. దాన్ని ప్రత్యేకంగా చూసేవి కావు. "నా గొప్పతనాన్ని ఇవి గుర్తించట్లేదు" అని నెమలికి అవంటే కోపం. ఒక రోజున అడవికి ఓ వేటగాడు వచ్చాడు. వాడి చేతిలో వలలు, విల్లంబులు ఉన్నాయి. దొరికిన జంతువును,పక్షినల్లా వాడు ఎత్తుకుపోతాడు! 


వాడు అడవిలోకి రావటాన్ని దూరం నుండే గమనించింది పావురం. దానికి గొంతు ఏమంత లేదు కదా, అందుకని అది పరుగున వచ్చి ఆ సమాచారం కోయిలకు అందించింది. వెంటనే కోయిల తన గట్టి గొంతుతో "వేటగాడు వచ్చాడు పారిపోండి! వేటగాడు వచ్చాడు దొరకకండి!" అని పాడుతూ అడవంతా తిరగటం మొదలెట్టింది. కోయిల పాట విని అడవిలోని జంతువులన్నీ తమకు తోచిన దిక్కుకు పరుగెత్తాయి. పక్షులన్నీ తమకు తోచిన తావుల్లో కదలకుండా మెదలకుండా కూర్చున్నాయి. వేటగాడు అడవిలోకి అడుగు పెట్టేసరికి అక్కడంతా నిశ్శబ్దం! అక్కడ వాడికి ఒక్క జంతువు గాని, పక్షిగాని ఎదురవ్వలేదు!

 

 

నెమలికి కూడా కోకిల పాట వినబడింది. కానీ అది పోయి దాక్కోకుండా అక్కడక్కడే, నేలకు దగ్గరగా తిరగటం మొదలు పెట్టింది. పావురం దాని దగ్గరికి వెళ్ళి "నేస్తమా! అడవిలోకి వేటగాడు వచ్చాడు. దొరికావంటే పట్టుకుపోతాడు. గబగబా ఎక్కడికైనా వెళ్ళి దాక్కో!" అన్నది. నెమలి పావురంతో వాదించటం మొదలు పెట్టింది. "నేను ఎంత అందంగా ఉంటానో మీకెవ్వరికీ అర్థం కాదు. నా అందాన్ని ఆస్వాదించే అదృష్టం ఆ వేటగాడికే ఉంటే అలాగే కానివ్వు మరి" అంటోంది ఎంతకీ. అంతలోకే కోయిల కూడా వచ్చింది అక్కడికి. "ఇదిగో, నీ అందం ముఖ్యం కాదిక్కడ. 


వేటగాడు పట్టుకెళ్లి నీ ఈకలన్నీ‌ పీక్కుంటాడు. నిన్ను వండుకొని తినేస్తాడు" అని బెదిరించ బోయింది. అయినా నెమలి బెదరలేదు. "అట్లా ఏమీ లేదు. మీకు అందాన్ని మెచ్చుకోవటం రాదు. ఇంత కాలానికి నన్ను ప్రేమించగలిగే ఒకే ఒక్క వ్యక్తి వస్తుంటే మీకు భయం వేస్తోంది. లోభం కొద్దీ నన్ను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు!" అని అరిచింది. దాని అరుపులు విని వేటగాడు అటువైపుగా రానే వచ్చాడు. వాడిని చూడగానే పావురమూ, కోయిలా ఎగిరి దూరంగా పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నాయి. నెమలి మాత్రం వయ్యారంగా పురి విప్పి, వేటగాడి ముందు సంతోషంగా నాట్యం చేయబోయింది.

 


మొరటైన ఆ వేటగాడు అదను చూసుకొని గబుక్కున ముందుకి దూకి, నెమలిని మొత్తంగానే మడిచి సంచిలో పెట్టేసుకున్నాడు! దూరం నుండి చూస్తున్న పావురం, కోయిల రెండూ "ఘోరం! ఘోరం!" అని కేకలు పెట్టాయి. వేటగాడు వాటివైపు ఓసారి చూసి, తన చేతిలోని బాణంతో వాటిని ఒకసారి బెదిరించి ముందుకు సాగాడు. ఆ క్షణంలోనే పావురానికి ఒక ఆలోచన వచ్చింది. అది కోకిల కేసి చూసి కనుసైగ చేసి, వేటగాడి తలని తన్నుతున్నట్లు ఎగిరి దగ్గరలో ఉన్న ఒక పొద మీద వాలింది. అది ఎంత దగ్గరలో ఉన్నదంటే, వేటగాడికి దానిమీద ఆశ పుట్టింది. వాడు ఆ పొద దగ్గరికెళ్ళి, పావురాన్ని అందుకోబోయాడు గానీ, వాడి చేతికి అందకుండా పావురం వెనుకకు అడుగులు వేస్తూ పోయింది. చివరికి వేటగాడు తన చేతిలోని సంచీని క్రింద పెట్టి, పొదమీదికి వంగాడు.


"సమయం ఇదే" అని గుర్తించిన కోకిల గబుక్కున సంచిమీద వాలి, దాని మూతి విప్పి, అప్పటికే స్పృహ తప్ప బోతున్న నెమలిని సంచిలోంచి బయటికి నెట్టింది. ఏం జరిగిందో వేటగాడికి అర్థమయ్యేలోగా పక్షులు మూడూ మూడు దిక్కులకు ఎగిరిపోయాయి! శక్తినంతా కూడగట్టుకొని చెట్ల కొమ్మల మీదుగా దుంకుతున్న నెమలి వెంట పడ్డాడు వేటగాడు! అయినా దాన్ని అందుకోలేక, చివరికి నిరాశగా ఇంటి దారి పట్టాడు! ఆ తర్వాత ఎప్పుడో చెరువు వొడ్డున కలిసినప్పుడు "వేటగాడు మరీ ఇంత మొరటుగా ఉంటాడనుకోలేదు. నా అందాన్ని చూసి కనీసం మంచిగా మెచ్చుకుంటాడనుకున్నాను!" అన్నది నెమలి, పావురం-కోయిల లతో. "ఇంకా నయం! వాడు నిన్ను ఎత్తుకెళ్ళి వండేసి ఉంటే అప్పుడు తెలిసేది నీకు!" అంది పావురం. "ఏమోనబ్బా! నాకు తెలీదు! మీరు మటుకు నన్ను కాపాడారు. థాంక్స్" అని నెమలి చక్కా పోతుంటే పావురం కోయిల బిత్తరపోయి ఒకదాని మొహం ఒకటి చూసుకున్నాయి!

 

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో