TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
బాధ్యత
అది మా తమ్ముడి పుట్టినరోజు. ఇంట్లో మా అమ్మ చాలా హడావిడి చేస్తోంది. తనకు కాళ్ళు ఒకచోట నిలవడం లేదు. బంధువులంతా వచ్చారు; కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక భోజనాలు చేసి వెళ్ళిపోయారు. వాళ్లంతా వెళ్ళాక, భోజనం చేసే చోటును శుభ్రం చేసుకుని, మా కుటుంబ సభ్యులం అందరం భోజనానికి కూర్చున్నాము. నేను అందరికీ భోజనం వడ్డిస్తున్నాను. ఆ రోజు వంటలన్నీ మాకు ఇష్టమైనవే. సాధారణంగా మా నాన్నకి వంటకాలు ఇష్టమైతే అన్నం గబగబా తినేస్తాడు. కానీ ఎందుకనో, ఇవాళ్ల ఆయన చెయ్యి అంత చురుకుగా కదలట్లేదు. 'భోజనం నచ్చలేదేమో' అన్నట్లు ఒకసారి మా నాన్న మొహం వైపు చూసాను.
మా నాన్న ముఖంలో సంతోషం-దు:ఖం రెండూ కనిపించాయి ఒకేసారి. "ఎందుకు?! అయినా భోజనం చేసేటప్పుడు అడగద్దులే" అని మౌనంగా ఊరుకున్నాను. భోజనం పూర్తి అయ్యాక, మా నాన్న లేచి. బయట అలా కుర్చీలో కూర్చోగానే నేను మెల్లగా వెళ్ళి ఆయన పక్కనే కూర్చున్నాను. "నాన్నా, ఏమైంది? ఇవాళ్ల నువ్వు సంతోషంగా లేవు ఎందుకు? భోజనం కూడా సరిగా చేయలేదు" అన్నాను. "ఏవో రకరకాల జ్ఞాపకాలు వచ్చాయి తల్లీ! ఏమంత గొప్ప సంగతులు కాదులే" అన్నాడు నాన్న, దాటవేస్తూ. "నేను ఇప్పుడు పెద్దదాన్నయ్యాను నాన్నా! చెప్పు, ఏమీ పర్లేదు" అన్నాను నేను. నాన్న విచారంగానే నవ్వాడు. "నేను నీ అంత ఉన్నప్పుడు బాగానే చదివేవాడిని తల్లీ! కానీ ఎందుకో మరి, ఇంగ్లీష్ పరీక్ష రోజునే నాకు జ్వరం వచ్చింది: అస్సలు లేవలేని పరిస్థితి! దానితో నేను ఇంగ్లీష్ పరీక్షకు హాజరు కాలేక, పదవ తరగతి తప్పాను. నీలాగే నేను కూడా గవర్నమెంట్ బడిలో ఫస్టు వచ్చేవాడిని. పరీక్ష తప్పటంతో ఇంక చదువు ఆపేశాను. ఆ తరవాత కొన్నేళ్లకు మీ అమ్మతో పెళ్ళి అయ్యింది; తర్వాత బంగారు తల్లివి, నువ్వు పుట్టావు!" అన్నాడు.
నేను ఒక నవ్వు నవ్వాను. నాన్న కొనసాగించాడు: "నువ్వు పుట్టిన మూడు సంవత్సరాలకు వాడు పుట్టాడు. పుట్టిన మూడు నెలలకల్లా వాడిని మళ్ళీ ఆస్పత్రిలో చేర్చాము.." అని. నాకు ఈ సంగతి తెలీదు- "ఎందుకు నాన్నా?" అడిగాను. "ఊపిరితిత్తుల్లో కఫం చేరిందట- ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. బాగా పెద్ద బిల్లే వచ్చింది. ఆసుపత్రి చార్జీలకోసం ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అప్పటికప్పుడు మన ఇల్లు అమ్మేసా. ఆ తరవాతే మనం ఈ ఇంట్లోకి బాడుగకు వచ్చి చేరాం.
ఇల్లు ఇరుకైపోయి, ఆ వెంటనే మగ్గం నేయటం కూడా ఆపేశా. ఆ తరవాత మెల్లగా నెలకింత డబ్బు ప్రోగుచేసి, కొంత డబ్బు అప్పు చేసి ఒక ట్రాక్టర్ తెచ్చుకున్నాను. అటుపైన ట్రాక్టర్ ద్వారా ఇల్లు నడిపించా. ఒకవైపున మిమ్మల్ని చదివిస్తూ, ఆ అప్పు తీర్చేసి, మెల్లగా ఈమధ్యే క్రొత్త అప్పుతో రెండో ట్రాక్టర్ తెచ్చాం". నేను నిశ్శబ్దంగా తల ఊపాను. నాకు ఈ సంగతి తెలుసు. నాన్న తనలో తనే అనుకుంటున్నట్లు చెప్పాడు: 'నువ్వే నా మొదటి కొడుకువి, మొదటి కూతురువి కూడా నువ్వే తల్లీ. నువ్వు ఆరో తరగతిలో చేరేప్పుడు నేను నిన్ను ఏం అడిగానో గుర్తుందా?" "లేదు నాన్నా!" అన్నాను. "అప్పట్లో మన ఊరి బళ్ళో ఆరో తరగతి కొత్తగా మొదలెట్టారు. 'నువ్వు ఇక్కడ చేరతావా, టవున్లో ప్రైవేటు బడికి వెళ్తావా?' అని అడిగాను నిన్ను.
'నాన్నా! ప్రైవేటు బడి ఎందుకు, దండగ?! నేను మన ఊర్లో గవర్నమెంటు బడికే వెళ్తాను. ఇక్కడ టీచర్లు బాగా చెబుతారు కదా!' అన్నావు. నాకు అప్పుడు చాలా సంతోషం వేసింది తల్లీ.. ఆ చిన్న వయస్సులోనే మన ఆర్థిక స్థితిగతులు నీకు అర్థం అయ్యాయి. 'పిండి కొద్దీ రొట్టె చేసుకోవాలి' అని కూడా నీకు తెలిసింది. అందుకేరా నువ్వే నా మొదటి కొడుకూ, మొదటి కూతురూనూ. కానీ వీడికి ఆ దృష్టి లేదు. వీడి చదువు మటుకు ప్రైవైటు బడిలోనే సాగింది చూడు-" అన్నాడు. నేను నవ్వాను. "అప్పటికీ ఇప్పటికీ మనం కొంచెం నిలద్రొక్కుకున్నాంలే నాన్నా!" అన్నాను. "ఒకవేళ మనం ఆ ఇల్లు అమ్మకపోయినా, వాడిని ఆసుపత్రిలో చేర్చకపోయినా మనం కేవలం ముగ్గురమే ఉండేవాళ్లం తల్లీ- నువ్వూ. నేనూ, మీ అమ్మా.." అంటుంటే మా నాన్న కళ్ళలోను, నా కళ్ళలో కూడాను నీళ్ళు తిరిగాయి. అంతలోనే నాన్న సర్దుకొని "తల్లీ , బాగా ఆలస్యమైంది. పడుకోపోరా. ఉదయాన్నే బడికి వెళ్ళాలి" అన్నాడు. నేను పడుకున్నా రాత్రంతా అవే ఆలోచనలు. ఆ రోజు తర్వాత జీవితమంటే 'బాధ్యత' అని, ఆషామాషీ కాదని అర్థమయ్యింది నాకు.
- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో