TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
పావురాల గోల
సుద్దాలకొట్టంలో నివసించే గిరీష్ పావురాలను పెంచేవాడు. పిల్లవాడుగా ఉన్నప్పుడు అతనొక పావురాన్ని కాపాడాడు. దాంతో అది, దాని పిల్లలు వాడికి దగ్గరైనాయి. తల్లిదండ్రులు తన ఖర్చులకోసం ఇచ్చిన డబ్బులతో వాడు ఆ పావురాలకు మేత తీసుకొచ్చేవాడు అప్పట్లో. చూస్తూండగానే ఆ నాలుగు పావురాలూ ఎనిమిది అయినాయి. వాటికి ఇక మేత చాలకొచ్చింది. దాంతో మరిన్ని డబ్బులకోసం గిరీష్ తల్లిదండ్రులను పీడించటం మొదలెట్టాడు. మొదట్లో మురిపెం కొద్దీ వాడు అడిగిన మొత్తాలు ఇస్తూ వచ్చారు తల్లిదండ్రులు. కానీ పావురాల సంఖ్య పెరుగుతూనే పోయింది! తల్లి దండ్రులు మాత్రం ఎంత అని తెస్తారు? ఒక స్థాయి దాటే సరికి వాళ్ళు 'కొన్ని పావురాలను అమ్మెయ్యి' అనసాగారు. అయితే గిరీష్ తన పావురాలను అమితంగా ప్రేమించేవాడు. వాటిని అమ్మటం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు! అట్లా చూస్తూ చూస్తూండగానే అతని సంరక్షణలోని పావురాలు వందకంటే ఎక్కువయ్యాయి!
పావురాలకు ఇప్పుడు వసతి కల్పించటం కష్టమైంది. అవి వేసే రెట్టలని శుభ్రం చేయటం పెద్ద పనవుతున్నది. "వాటికి తిండి పెట్టి మేపటం ఎందుకు? వదిలేస్తే పోలేదా?" అని కూడా అనిపించింది గిరీష్ తల్లి దండ్రులకు. అయితే గిరీష్ తన పావురాలను ఎప్పుడూ లెక్క పెట్టుకుంటూ ఉండేవాడు. అవి తప్పిపోకుండా వాటికి రెక్కల క్రింద స్కెచ్ పెన్ లతో గుర్తులు పెట్టాడు కూడా. వాటిలో ఏ ఒక్కటి తగ్గినా పెద్ద గొడవ చేసేవాడు వాడు! ఇదంతా తల్లిదండ్రులకు పెద్ద సమస్య అయి కూర్చున్నది. ఒకసారి ఆ గుంపులోని పావురం ఒకటి తప్పిపోయింది. దానికోసం చాలా గొడవ చేసాడు గిరీష్. బడి ఎగగొట్టి మరీ వెతికాడు. సాయంత్రం కావొచ్చింది గానీ పావురం జాడ లేదు. "పోనీరా! ఒక్కటే గా!" అన్నారు తల్లిదండ్రులు. కానీ వాడు వింటేగా? రోజంతా అన్నం తినలేదు; ఏడ్చుకుంటూ కూర్చున్నాడు, గోడకు ఒరిగి. ఊరి చెరువుకు అవతలగా ఎవ్వరూ పోని గుబురు ప్రదేశం ఒకటి ఉంది. తన పావురం అక్కడికి ఏమైనా వెళ్ళిందేమోనని గిరీష్‌కి అనుమానం.
ఆ అనుమానంతో వాడు అప్పటికప్పుడు బయలుదేరి ఆ గుబురులోకి పోయాడు. తన పావురం అక్కడే ఉన్నది! అయితే వీడిని చూడగానే అది దగ్గరికి రావటానికి బదులు, పారిపోవటం మొదలెట్టింది! గిరీష్ ఆ పావురం వెనుకే పరిగెత్తాడు. పరుగెత్తుతూనే ఆ పావురం రెక్కల వెనక ఉన్న గుర్తులు చూసాడు. అతను తన పావురాలకు మూడు రంగుల గుర్తు వేసి ఉన్నాడు. కానీ ఈ పావురానికి రెండే రంగుల గుర్తు ఉంది! ఒక్క క్షణం పాటు "ఇది నా పావురం కాదేమో" అనిపించింది అతనికి. "కానీ ఆ పరిసరాల్లో ఎక్కడా పావురాలను పెంచేవాళ్ళు లేరు, తను తప్ప! ఇది తనదే, ఒక రంగు చెరిగిపోయి ఉండాలి!" అనుకుని, అతను ఆ పావురాన్ని వెంబడిస్తూ ముందుకు సాగాడు. ఈ పావురం గబగబా వెళ్ళి అక్కడే 'కుక్కూ గుక్కూ' మంటూ కూర్చొని ఉన్న ఒ పెద్ద పావురాల గుంపులో కలిసిపోయింది. గిరీష్ ని చూడగానే ఆ పావురాల గుంపు మొత్తం రెక్కలు టపటప లాడించుకుంటూ పైకి లేచింది. పట్టు వదలని గిరీష్ ఆ గుంపు వెనకాలే పరుగు తీసాడు. పావురాలన్నీ ఎగురుకుంటూ చాలా దూరం పోయి, చివరికి ఒక క్రొత్త రాజ్యంలోకి ప్రవేశించాయి.
ఆ రాజ్యంలో ఎక్కడ చూసినా పావురాలు ఉన్నాయి. గిరీష్ మనసులోనే లెక్కించుకుని, "ఐదారు వేల పావురాలు ఉండచ్చేమో!" అనుకున్నాడు. వాడి ఆ పావురం వాటితో కలిసి పోయింది. దాన్ని గుర్తుపట్టటం కూడా కష్టమే ఇక! కానీ దాన్ని మర్చిపోలేని గిరీష్ వారి రాజ్యంలో అడుగు పెట్టాడు. చూడగా అక్కడి సైనికులు పది పదిహేనుమంది కలిసి ఓ పావురం వెంట పడుతున్నారు! ఆశ్చర్యపోయిన గిరీష్ తనకు ఎదురైనవాడిని ఒకడిని ఆపి సంగతి కనుక్కున్నాడు. "మా రాజ్యంలో ఇప్పటికే చాలా పావురాలు ఐనాయి. ఇప్పుడు వాటిని పెంచుకోవటమే కష్టంగా ఉందంటే, ఇట్లా కొత్త పావురాలు వస్తుంటాయి. పావురాలు పట్టటంలో శిక్షణ పొందిన మా సైనికులు వాటిని వెంబడించి పట్టుకుంటారు. తర్వాత వాటితోపాటు మరిన్ని పావురాలను బయటి రాజ్యాల వాళ్లకు ఎవరికైనా ఇచ్చేస్తారు" అని చెప్పాడతను!
అంతలో పావురం ఎగురుకుంటూ వచ్చి గిరీష్ భుజం మీద వాలింది. దాని వెనకనే వచ్చిన సైనికులు వాడిని చూసి, 'వేరే రాజ్యంవాడు' అని గుర్తించి, తక్షణం బంధించారు. పావురంతో సహా రాజుగారి ముందు ప్రవేశ పెట్టారు. "ఎవరురా, నువ్వు?! మా రాజ్యంలోకి పావురాలను ఎందుకు తీసుకు వచ్చావు? ఇప్పటికే ఉన్న పావురాలతో చస్తుంటే, నువ్వు మరిన్ని పావురాలు తెస్తే మేం ఎలా బ్రతకాలి?" అడిగాడు మహారాజు కోపంగా. గిరీష్ బిత్తరపోయి "మహారాజా! మాది తమ పొరుగు రాజ్యం. తమరి రాజ్యానికి పావురాలు తేకూడదని నాకు తెలీదు. వాస్తవంగా నాదగ్గర నూరు పావురాలు ఉన్నాయి. అందులో నుంచి ఒక పావురం తప్పిపోయి మీ రాజ్యపు పావురాల గుంపు లోకి చేరింది. నేను దానిని వెంబడిస్తూ ఇటుగా వచ్చాను" అని చెప్పాడు.
రాజుగారితో పాటు సభికులు అందరూ గట్టిగా నవ్వారు. "చూడగా మీ రాజ్యం వాళ్ళు పెద్ద అమాయకులలాగా ఉన్నారు. నీకు కావాలంటే మేం ఓ ఐదువందల పావురాలు ఇచ్చి పంపిస్తాం" నవ్వుతూ చెప్పాడు ఒక సభికుడు. "కాదు వెయ్యి ఇస్తాం" అన్నాడు మరొకడు. "ఓ ఐదువేలు పట్టుకుపోవయ్యా, మాకు వీటి పీడ వదుల్తుంది" అన్నారు మంత్రిగారు. సభలో వాళ్లంతా విరగబడి నవ్వారు మళ్ళీ. గిరీష్‌కు తల తీసేసినట్లు అయ్యింది. "పావురాలకు ఎంత పెట్టినా సరిపోవట్లేదు. మేం వాటికి కావలసిన ధాన్యాన్ని పొరుగు దేశాలనుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. లేకపోతే అవి పంటల్ని నాశనం చేస్తున్నాయి. వాటి సంఖ్యని పరిమితంగా ఉంచుకోకపోతే చాలా కష్టం. అందుకనే ఈమధ్య మేం పావురాల మాంసాన్ని తినేవారికి అదనపు జీతాలు కూడా ఇస్తున్నాం మా దేశంలో" వివరించాడు ఒక మంత్రి. "నిన్ను చూస్తే ఎవరో మంచివాడివి లాగా ఉన్నావు. వంద పావురాలు ఉన్నాయంటున్నావు. వాటికి తిండి ఎలా పెడుతున్నావు? చూస్తూ చూస్తూండగానే అవి మీ రాజ్యం అంతా పరచుకునేన్ని ఐపోతాయి జాగ్రత్త! మీ రాజ్యంలో పావురాల మాంసం తినేవారు లేరా?" అడిగారు రాజుగారు. "ఉన్నారు మహారాజా! కానీ, నేను నా పావురాలను ఎవ్వరికీ ఇవ్వను.." గొణిగాడు గిరీష్.
రాజుగారు నవ్వారు. "పిచ్చివాడా! ముందు ఏమీ ఆలోచించకుండా నీ దగ్గరున్న పావురాలని ఎన్నిటిని వీలైతే అన్నిటిని తినే వారికి అమ్మెయ్యి. నీ ఆర్థిక స్తోమత నువ్వు చూసుకోవాలి. లెక్క లేకుండా ఖర్చు పెట్టటం మంచిది కాదు- అయినా ఎంతని ఖర్చు చేస్తావు? దేనికైనా ఒక అంతు ఉండాలి" అని మెత్తగా తిట్టి, అతనికి మరి కొన్ని పావురాలను కూడా అదనంగా ఇచ్చి పంపారు రాజుగారు. గిరీష్ చాలా సంతోషంగా ఇంటికి వచ్చాడు. అయితే త్వరలోనే అతని దగ్గర పావురాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవటం మొదలెట్టాయి. రాజుగారి మాటలు గుర్తుకు తెచ్చుకున్న గిరీష్ భయపడి, వాటిని అమ్మటం మొదలెట్టాడు. వాడిలో వచ్చిన మార్పుకు వాడి తల్లిదండ్రులు చాలా సంతోషపడ్డారు. తమకు ఎన్నడూ కనబడని రాజుగారికి మనసులోనే దండాలు పెట్టుకున్నారు.
- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో