TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
నీళ్ళను వెతికిన చేప
అనగా అనగా దేవి అనే చేపపిల్ల ఒకటి ఉండేది. అది చాలా తెలివైనది. రాళ్ళ సందుల్లో దాక్కుని ఆడుకోవటం అంటే దానికి చాలా సరదా. రాత్రిపూట సముద్రపు అడుగున, నేలబారుగా నడుస్తూ పోయే జలచరాల్ని గమనిస్తూ కూర్చోవటం కూడా దానికి చాలా ఇష్టం. ఒక రోజున అది తన స్నేహితులైన సముద్రపు గుర్రాలకోసం ఎదురు చూస్తున్నది. ఆ సమయంలో వాళ్ల అమ్మమ్మ గౌరమ్మ వేరే ఎవరితోనో అంటున్నది- "నీళ్ళలో బ్రతికే చేపలన్నీ.."అని. "నీళ్లా?" అని దేవి ఆశ్చర్యపోయింది. "నీళ్లంటే?" అమ్మమ్మకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. "నీళ్లు ఎక్కడుంటాయి?" అని ఆలోచనలో పడింది దేవి. కొంత సేపటికి, "ఆలోచించి లాభం లేదు. నేనే వెళ్ళి కనుక్కుంటాను- అదే నయం" అని బయలు దేరిందది. "అయితే నీళ్ల కోసం ఎక్కడ వెతకాలి?" అని దానికి అనుమానం వచ్చింది.
సముద్రపు గుర్రాలు రాగానే అది వాటిని అడిగింది: "నమస్కారం మిత్రులారా! నీళ్లు ఎక్కడుంటాయో చెబుతారా, కాస్త?" అని. సముద్రపు గుర్రాలు ఒకదాని ముఖం ఒకటి చూసుకున్నాయి. "ఏమంటున్నావు? నీళ్లా?! మాకెట్లా తెలుస్తుంది? మేమైతే ఇప్పటివరకూ ఆ మాటే వినలేదు!" అన్నాయి. "అయ్యో! క్షమించండి. నేను వేరే ఎవరినన్నా అడుగుతాను" అని దేవి ముందుకు సాగింది. కొంచెం దూరం పోయాక దానికి కొన్ని యీల్ చేపలు కనబడ్డాయి. అది అడిగింది-"హెల్లో! ఈల్ చేపలూ! నేను చాలా అవసరంగా వెతుకుతున్నాను- ’నీళ్లు ఎక్కడ ఉంటాయి?’ అని. మీరు నాకు కొంచెం వెతికి పెడతారా, దయచేసి?" అని. అవి "ఆఁ..ఊఁ" అని సణిగాయి. ఒక ఈల్ చేప దూరంగా ఉన్న ఒక గుహకేసి చూపిస్తూ "నీళ్లా?! మాకు తెలీదమ్మా, ఎక్కడని వెతకాలి? నువ్వు వెతికేవేవో బహుశ: ఆ కొండగుహలో ఉంటాయేమో మరి, చూడు" అన్నది.
దేవికి సాధారణంగా చీకటి ప్రదేశాలంటే ఇష్టం ఉండదు. కానీ అది అనుకున్నది- "ఓహో! నీళ్ళు గుహల్లో ఉంటాయన్నమాట! నేను ఎప్పుడూ గుహల్లో ఏముంటుందో చూడలేదు కదా, ఇప్పుడు పోయి చూస్తాను" అని, మెల్లగా ఆ కొండగుహలోకి పోయి వెతికింది. అక్కడ దానికి రకరకాల మొక్కలు, రాళ్ళు, వింతవింత పురుగులు, నేలమీద ప్రాకే జీవులు- అది ఇంతకు ముందెన్నడూ చూసి ఉండనివి- చాలా కనబడ్డాయి, కానీ-నీళ్లు మాత్రం కనబడలేదు! అది ఆ గుహలోంచి నిరాశగా వెనుదిరిగింది. గుహలోంచి బయటికి వస్తుంటే అకస్మాత్తుగా దానికొక నక్షత్రపు చేప ఎదురైంది. తన నిరాశలో దేవి దాన్ని చూసుకోనే లేదు- వెళ్ళి దాదాపు దాన్ని ఢీకొట్టింది! "ఓయ్! ఓయ్! కొంచెం చూసుకొని పోమ్మా, చిన్న చేపా!" అన్నదది. "అయ్యో! చూసుకోలేదు నక్షత్రం! క్షమించు. నేను ఇక్కడినుండి బయటికి పోబోతున్నాను" అన్నది దేవి. "అయినా ఈ చీకటి గుహల్లో ఏం చేస్తోంది, చిన్న చేప?" అడిగింది నక్షత్రం. "నేను నీళ్లకోసం వెతుక్కుంటూ వచ్చాను. ఇక్కడ వేరే ఏవేవో ఉన్నాయి గానీ, నీళ్ళు మాత్రం ఎక్కడా కనబడలేదు. అందుకని, బై! బై!" అని పోబోయింది దేవి.
"ఓయ్! ఓయ్! చిన్నచేపకు బలే సందేహం వచ్చిందే! ఆగు, ఆగు, ఒక్కనిముషం!" అని కేకలు పెట్టింది నక్షత్రం. "ఏమంటున్నావు నువ్వు? గుహలో నీళ్ళు లేవా?! అసలు నువ్వు ఈ గుహలోకి ఎట్లా వచ్చావనుకుంటున్నావు?" అడిగింది అది. "ఉం.. ఎట్లా వచ్చానా? ఈదుకుంటూ వచ్చాను!" అన్నది దేవి తెలివిగా. "ఓహో! మరైతే నువ్వు 'దేనిలో' ఈదుకుంటూ వచ్చావు?" అడిగింది నక్షత్రం. దాని గొంతులో ఇప్పుడు కొంచెం ఎగతాళి ఉంది. దేవికి ఆ ప్రశ్న అస్సలు అర్థం కాలేదు. ’దేనిలోనో’ ఈదటం ఏమిటి? తను కేవలం ’ఈదింది’ -అంతే కదా!" నక్షత్రం ఒక వెర్రి నవ్వు నవ్వింది. "ఓ నా ప్రియమైన చిన్న చేపా! నువ్వు ఒకవేళ నిజంగా నీళ్ళకోసమే వెతుక్కుంటుంటే మాత్రం, నీ వెతుకులాట ముగిసినట్లే. ఎందుకంటే, నీళ్ళు ఈ క్షణంలో నీ చుట్టూ ఆవరించి ఉన్నాయి!" అన్నది. దేవి ఇంకా గందరగోళపడింది. ఇప్పుడు తన పరిస్థితి ఏంటో తెలీలేదు దానికి. సిగ్గు ముంచెత్తగా అది "మరి, ఉం...ఈ గుహలో అంతా చాలా చీకటిగా ఉందిగదా, బహుశ: అందువల్లనే కావచ్చు..నేను నీళ్లను చూడలేకపోతున్నాను " అన్నది.
నక్షత్రం మళ్ళీ ఒకసారి నవ్వింది: "చిన్నచేప పాపా! నువ్వు నీళ్లను చూడాల్సిన అవసరం లేదు. నిజానికి చాలా చేపలు నీళ్ళను చూడనే చూడవు! నీళ్ళు మన లోపలా ఉన్నాయి, మన బయటా ఉన్నాయి. మనందరం ఈ నీళ్ల వల్లనే తయారౌతాం; నీళ్ల వల్లనే బ్రతుకుతాం; చివరికి ఈ నీళ్లలోనే కలిసిపోతాం. నీ చర్మం నిన్ను అన్ని వైపులా ఆవరించినట్లు, నీళ్ళు కూడా ఎల్లప్పుడూ ఆవరించి ఉంటాయి, నిన్ను. మనకు నీళ్లే జీవం! అవి లేకుండా మనం లేము" అని వివరించింది. దేవికి కొంచెం సేపు తను వింటున్నది నిజమో కలో అర్థం కాలేదు. "నా చుట్టూతానే నీళ్లను పెట్టుకొని, ఆ నీళ్లకోసం ఎక్కడెక్కడో వెతికానే!" అనుకున్నది.
ఆ పైన దేవికి మెల్లగా ఆ నీళ్లతోటి ఏమేం చేయచ్చో కూడా తెలిసింది. అది దానిలో బుడగలు ఊదింది; తన మొప్పల్ని వాడి దానిలో ఈదింది; తనకంటే చిన్న చేపలకు ఈదటంలో సాయం చేసింది; నిశ్చలంగా, అలా-ఊరికే- ఏమాత్రం కదలకుండా నిలబడి, నీటి అలలు తన చుట్టూ కదిలి తనకు హాయినిచ్చేట్లు చేసుకున్నది. ఒకసారి ’ఉన్నాయి’ అని గుర్తించాక, దేవి చేప జీవితానికి ఇక ఆ నీళ్లు మరింత ఆశ్చర్యానందాలను జోడించి, భలే సాయపడ్డాయి! చేపచుట్టూ నీళ్ళు ఉన్నట్లుగానే, మన చుట్టూ ఉంది- సంతోషం. మనం ఒక్కసారి దాన్ని గుర్తించామంటే, ఆ సంతోషం మనల్ని ముంచెత్తగలదు! దానికోసం వేరే ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరమే లేదు!
- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో