Facebook Twitter
పరిష్కారం ఎప్పుడో..?

 

పరిష్కారం ఎప్పుడో..?

 

ఏంటో
అడుగలా బయటెట్టాలంటే
పట్టపగలే భయం

ముక్కుకు ముసుగేసుకుని
శానిటైజరెపుడు పక్కనెట్టుకుని
షాపింగుకెల్లొస్తే
సముద్రాన్నీదొచ్చినట్లు

చూపులెపుడు గమనిస్తుంటాయ్
పరిస్థితేంటని
పాలపాకెట్టు రోజు తానమడుతది
కూరగాయలేమో పసుపునీళ్ళలో జలకాలు పెండ్లికూతురిలా తాజాగా
ఇంట్లో కాలుపెడుతున్నవి

కషాయాలిపుడు టీ కాఫీలాయే
మొలకెత్తినగింజలు 
డ్రైఫ్రూట్స్
మారినాహారపలవాట్లు

ప్రాణాయామం నిత్యవ్యాయమం
శరీరానికి నూతనోత్సాహం
అయినా భయమే

మరణమనే చీకట్లు
విశ్వమంతా విస్తరిస్తున్నాయ్
జీవితాన వెలుగుల్ని చిదిమేస్తున్నాయ్

సామాజికదూరానికర్థం మారింది
కంటైన్మెంట్లు తూతూమంత్రమే
దవాఖానాలో మంచాల్లేవ్
బయటతిరుగుతున్నరందరు
పైసలున్నోడొకచోట
లేనోడింకొకచోటన్నట్టు
రెకమండేషన్లాయే

రోజురోజుకు మహమ్మారి
కమ్మేస్తూ కుమ్మేస్తుంది
పరిష్కరమెపుడోనని
ప్రపంచమెదురుచూస్తుంది

సి. శేఖర్ (సియస్సార్)