TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
పారిపోకు!
శివ బాగా చదివేవాడు కాదు. కానీ వాడికి చదవటం అంటే చాలా ఇష్టం! వినేందుకు ఇదేదో వింతగా ఉంది కదూ? నిజమే. ఇదో వింత సమస్య. చదవమని శివకి ఎవ్వరూ ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎందుకంటే వాడు రోజంతా పుస్తకాలు పట్టుకొనే కూర్చునేవాడు. అయితే అంత సేపు కూర్చున్నా వాడి లోపలికి ఏమీ ఎక్కేది కాదు! ఒక అరగంట పాటు కష్టపడి ఏమైనా బట్టీ కొట్టినా, మరో పది నిముషాల్లో దాన్ని మర్చిపోయేవాడు! దాంతో వాడికి వాడికే కష్టం అనిపిస్తుండేది. టీచర్లంతా వాడిని 'మొద్దు శివ' అనేవాళ్ళు. తోటి పిల్లలు ఎగతాళి చేసేవాళ్ళు.
శివ చిన్నప్పుడే వాళ్ల నాన్న ఇల్లు వదిలేసి ఎటో వెళ్ళిపోయాడు. ఇంట్లో అమ్మ, చెల్లి, తను- ముగ్గురే ఉండేవాళ్ళు. అందుకని వాళ్ళమ్మ వాడికి రకరకాల పనులు చెబుతూ ఉండేది- "ఫలానా వాళ్ళింటికి వెళ్ళి అప్పు తీసుకురా; కాఫీపొడి ఐపోయింది; ఆవాలు కొన్ని ఇమ్మను; కూలికి పో; వాళ్ళకు సున్నం పూసి పెట్టు, కాసిని డబ్బులు ఇస్తారు.." అంటూ. రాను రాను ఆవిడ ఇంకో రాగం మొదలు పెట్టింది: "ఎప్పుడూ పుస్తకాలు పట్టుకొని కూర్చుంటే ఇల్లెట్లా గడుస్తుంది? అయినా నీకు ఏమీ చదువు రావట్లేదు కదా, బడికి పోయేదెందుకు?" అని.
ఈ ప్రశ్నకు జవాబు ఎట్లా చెప్పాలో శివకు అర్థం కాలేదు. కానీ బడి మానెయ్యటం మాత్రం వాడికి అస్సలు ఇష్టం లేదు. ఇట్లా ఇంకొన్నినాళ్లు గడిచాయి. అయినా చివరికి అమ్మ మాటే నెగ్గింది. శివ చదువు మానేసి, గ్యారేజ్‌లో పనికి చేరుకోవాల్సి వచ్చింది. అయితే అక్కడా వాడికి కష్టాలే ఎదురయ్యాయి. గ్యారేజ్ ఓనర్ వాడితో పని చేయించుకునేవాడు గానీ, మనసు పెట్టటం లేదని విపరీతంగా తిట్టేవాడు. ఆ సమయంలో వాడికి పట్నం గురించి తెలిసింది. 'పట్నంలో ఎక్కడో ఒకచోట బతుక్కోవచ్చు. ఇట్లా రోజూ తిట్లు తింటూ ఉండనక్కర్లేదు..!'
దాంతో ఒక రోజున వాడు ఎవ్వరికీ చెప్పకుండా బయలుదేరి పట్నం వెళ్ళిపోయాడు. అక్కడ టీ దుకాణాల్లోను, హోటళ్లలోను పని చేసుకుంటూ ఇక ఇంటి ధ్యాస అనేదే లేకుండా వారం పది దినాలు గడిపాడు. అయితే త్వరలోనే వాడికి ఆ బ్రతుకు మీద రోత పుట్టింది. 'అదంతా ఓ మురికి ప్రపంచం! మురికిలోనే పెరుగుతూ, మురికిలో పడుకొని నిద్రపోతూ, బ్రతుకు-తారు అందరూ. ఇట్లా బ్రతకటం కంటే తను పల్లెలో ఉండటమే నయం!’
ఇక కొడుకు ఇల్లు వదిలి పెట్టి పోయే సరికి శివ వాళ్ల అమ్మ శాంతమ్మకు రెక్క తెగినట్లు అనిపించింది. అప్పటి వరకూ వాడిని చూసుకొని బ్రతుకు ఈడ్చిన ఆమె, ఇప్పుడు రోడ్డున పడింది. తల్లి, కూతురు ఇద్దరూ కూడా పట్టణం చేరుకున్నారు. పట్టణం అంత పెద్దదని ఆమె అనుకోలేదు. తీరా దాన్ని చూసేసరికి 'తను, తన కూతురు అక్కడ ఎట్లా బ్రతుక్కోవాలి?' అని ఆమెకు విపరీతమైన భయం వేసింది. తల్లి, బిడ్డ ఇద్దరూ రోడ్లమీద అడుక్కుంటూ పోయారు. శివ ఫొటో ఒకటి అందరికీ చూపిస్తూ "వీడు నా కొడుకు శివ. వీడిని ఎక్కడైనా చూశారా?" అని అడగడం మొదలుపెట్టింది, వాళ్ల అమ్మ.
సరిగ్గా ఆ సమయానికి ప్రభుత్వం వారు పట్టణంలోని బిచ్చగాళ్లని సంస్కరించే కార్యక్రమం ఒకటి మొదలు పెట్టి ఉన్నారు. వాళ్ళ బృందం ఒకటి రోడ్డు మీద అడుక్కుంటున్న తల్లిని, పిల్లని కనుగొని, వాళ్లని తాము నడిపే "హోం"కు తీసుకెళ్లింది. వీళ్ల అదృష్టం కొద్దీ అక్కడ ఉన్న అధికారి- మానవత్వం ఉన్నవాడు. ఆయన వాళ్ల వివరాలన్నీ అడిగి తెలుసుకొని, పోలీసుల సహాయంతో పట్నం మూలల్లో ఉన్న శివను వెతికి పట్టాడు. అప్పటికే పట్నపు జీవితం అంటే విసుగెత్తిన శివ, తల్లి-చెల్లెళ్ల స్థితిని చూసి చలించిపోయాడు. "నేను ఇల్లు వదిలి పారిపోతే వీళ్ల పరిస్థితి ఇంత ఘోరంగా అవుతుంది- దానికి నేనే బాధ్యుడిని కదా?" అని వాడిలో పశ్చాత్తాపం మొదలైంది.
"నేను మంచిగా ఉంటాను సర్, మేం అందరం మళ్ళీ మా ఊరికి వెళ్ళిపోతాం. నేను కూలి పని చేసైనా సరే, మా కుటుంబాన్ని పోషించుకుంటాను" అన్నాడు అతను, ఆత్మ విశ్వాసంతో. 'హోం' అధికారి శివను మెచ్చుకుని, "ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందిలే; నువ్వు అంత శ్రమ పడనక్కర్లేదు. నువ్వు-మీ చెల్లి చేయాల్సిందల్లా బాగా చదువుకోవటం; బాధ్యత గల పౌరులుగా ఎదగటం. దీనిలో వ్యక్తిగతంగా కూడా, నాకు చేతనైన సాయం నేను చేస్తాను. మీరు బాగా చదివి సమాజంలో మంచి పేరు సంపాదించుకోవటమే నాకు కావాలి" అన్నాడు, వాళ్లని ఊరికి సాగనంపుతూ.
అట్లా శివ, శివ చెల్లి కూడా మళ్ళీ బడిలో చేరారు. అయితే ఆశ్చర్యం, ఇప్పుడు శివకు తను చదివినవన్నీ అద్భుతంగా గుర్తుంటున్నాయి! అప్పటివరకూ అతన్ని 'మొద్దు' అన్నవాళ్ళంతా ఇప్పుడు 'శివ బలే తెలివైనవాడు. చాలా మంచివాడు కూడా" అనటం మొదలు పెట్టారు. శాంతమ్మ కూడా "చదువెందుకు?" అనటం మానేసింది. పైపెచ్చు "నన్ను క్షమించురా! నువ్వు చదువుకుంటా అన్నా చదువుకోనివ్వలేదు ఇన్నాళ్ళూ" అని బాధపడింది. ఆపైన శివ ప్రభుత్వ సహాయంతో పై చదువులు కూడా చదివి, పోటీ పరీక్షల్లో నెగ్గి, ప్రభుత్వాధికారి అయ్యాడు: "మానవత్వం ఉన్న మంచి అధికారి-ఈయనకు ప్రజల కష్టం తెలుసు" అనిపించుకున్నాడు.
- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో