TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
తుంటరి బాలలు
కొత్తపల్లిలో ఉండే రాఘవరావుకు ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు 'బాల'కు పన్నెండేళ్ళు; కూతురు 'చంద్రిక'కు పదేళ్ళు. కొత్తపల్లిలోనే ఏడో తరగతి చదువుతున్నాడు బాల. చెల్లెలు చంద్రికేమో ఐదవతరగతి. బాల కాస్త తుంటరి పిల్లాడు. బుడుగు లాంటి మాటలు, చమత్కారపు తెలివితేటలు అతని సొంతం. అతను చేసే అల్లరికి, ఇచ్చే జవాబులకు బళ్లో అందరూ వాడిని 'బాల రామలింగా' అనో, 'బీర్బల్' అనో పిలిచేవాళ్ళు. అది సెలవు రోజు. జేజి తాతయ్యని అడిగి డబ్బులు తీసుకెళ్ళి, సందు చివర్లో ఉన్న స్వీట్ షాపులోంచి డజను లడ్డూలు కొనుక్కొచ్చింది చంద్రిక. కిటికీ సందుల్లోంచి చూడనే చూసాడు బాల. 'తనకి ఒక్కటీ ఇవ్వకుండా లడ్డూలన్నీ ఆ పిల్ల ఒక్కతే తినేస్తుందేమో' అని వాడికి అనుమానం వచ్చింది.
అందుకని, నేరుగా ఆమె దగ్గరకెళ్ళి, ప్రేమ ఒలకబోస్తున్నట్లే "చెల్లీ! నాకు కూడా నాలుగు లడ్డూలు ఇవ్వచ్చు కదా! గేదె తిన్నట్లు ఒక్క దానివే తినకపోతే?!" అన్నాడు. అట్లా అడిగితే ఎవరైనా ఎందుకిస్తారు? అందుకని వెంటనే చంద్రిక కూడా "ఆ చాల్లే! గుడ్ల గూబ ముఖమూ నువ్వునూ! నాకేదైనా లాభమా నీకు ఇస్తే?! నాకూ లాభం రావాలి కదరా, అన్నయ్యా?!" అంది. వెంటనే మన వాడి మెదడు కాంతి వేగంతో పని చేసింది. ఇప్పుడు తను వెళ్ళి జేజి తాతయ్యని అడిగినా ఆయన తనకు డబ్బులు ఇవ్వడు. కారణం తను ఎప్పుడూ జేజి గురించి పట్టించుకోడు. తనది నాయనమ్మ పార్టీ. తను ఆవిడ మాటే వింటాడు. అవసరం వచ్చినపుడే మాట్లాడతాడు జేజి తాతయ్యతో. అంతే కాక ఆయన ఏమైనా సాయం అడిగితే కూడా, ఈ తుంటరివాడు సేవ చేయడు.
అందుకని వెంటనే తన తీరు మార్చాడు వాడు: "ఎంత మాట అన్నావు చెల్లెమ్మా! మాటలతోటే పల్టీ కొట్టించావు. సరే, నేను ఓటమిని అంగీకరిస్తాను. మరైతే నేను నాన్నను చమత్కారంగా పల్టీ కొట్టించాననుకో, అప్పుడు మరి నువ్వు తెచ్చుకున్న లడ్డూల్లోంచి నాలుగు లడ్డూలిస్తావా?" అన్నాడు చంద్రికతో. "ఇంత ముచ్చటగా అడిగావు కాబట్టి, సరే అగ్రజా! ఈ ఒప్పందం నాకు ఒకే" అంది చంద్రిక. అసలు కథ ఏంటంటే, తను డజను లడ్లు తెచ్చుకునే ముందు జేజి తాతయ్యకు మాట ఇచ్చింది: "ఆరు నాకు, ఆరు అన్నయ్యకు" అని. 'ఇప్పుడు వీడు నాలుగు చాలు' అంటున్నాడు.. 'మరింకేమి?' అని, ఆ పాప పథకం. వెంటనే వాళ్ల నాన్న దగ్గరకు వెళ్ళాడు బాల. "నాన్నా ! నీ వెంట్రుకలు ఏమిటో తెల్లబడి పోతున్నాయి. ఎందువల్లంటావు?" అన్నాడు. న్యూస్‌పేపర్ చదువుతున్న తండ్రికి కొడుకు పథకం పూర్తిగా అర్థమైంది.
తను ఏమి అనాలని వాడు ఆశిస్తున్నాడో, ఆ తర్వాత వాడు ఏమి అనబోతున్నాడో కూడా తండ్రికి అర్థం అయ్యింది. అయినా కొడుకు ముచ్చట తీర్చటం కోసం "ఒరేయ్ బాలా! ఏ కొడుకైనా అల్లరి పనులు చేసినా, అబద్ధాలు చెప్పినా, వెంటనే వాళ్ల నాన్న వెంట్రుకలు ఒక్కొక్కటి చొప్పున తెల్లబడిపోతాయి" అని బదులిచ్చి, ముఖాన్ని పేపర్లో దాచుకున్నాడు. వెంటనే బాల అద్భుతమైన దొంగ సమయస్ఫూర్తితో "అవునా, నాన్నా! నువ్వెన్ని తప్పులు చేసావో, మరెన్ని అబద్ధాలు చెప్పావో కదా మరి, మన జేజి తాతయ్య గడ్డం, మీసాలు, తలవెంట్రుకలు సైతం తెల్లబడిపోయాయి. నాకంటే ఎక్కువ తప్పులు నువ్వే చేసి ఉండాలి కద, నాన్నా?! నక్షత్రకుడిలా మీ నాన్నని పీడించి వుంటావు!" అన్నాడు.
ఈ మాటలకి రాఘవరావు ఖంగు తిన్నట్లుగా నటించాడు. ఆనక తేలుకుట్టిన దొంగ వేషం వేసి, అవాక్కుగా కూర్చుండిపోయాడు. పక్కనే ఉన్న పరంధామయ్యకు ఈ జోకు పాతదే అని తెలీదు. మనుమడి తుంటరి సమాధానం వాడి సొంత తెలివే అనుకున్నాడాయన. దాంతో ఉల్లాసంగా బోసి నవ్వులు నవ్వాడు. బాలా వాళ్లమ్మ సుగుణ పగలబడి నవ్వింది. అత్తయ్యకు టీ ఇస్తూ. ఒప్పందం ప్రకారం చెల్లెలు గొల్లున నవ్వుతూనే నాలుగు లడ్డూల్ని వాడికి అందించింది. అటుపైన, వాడు అటు తిరగ్గానే మిగిలిన ఎనిమిది లడ్డూలనీ తాతయ్యకి చూపించి కన్నుగీటి, ఒక లడ్డూని నేరుగా ఆయన నోటికి అందించింది!
- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో