TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
పరివర్తన
శ్రావణి వాళ్ళ తరగతిలో పిల్లలందరూ పాఠాలను శ్రద్ధగా వినేవారు ఒకరు తప్ప. ఆ వినని పిల్లాడు కలెక్టరు గారి అబ్బాయి బబ్లు. అతను చివరి బల్ల మీద కూర్చుని బాగా అల్లరి చేసేవాడు. అందరినీ ఏడిపించేవాడు. అయినా ఎవ్వరూ అతన్ని తప్పు పట్టేవాళ్ళు కారు కలెక్టరు గారి అబ్బాయి కనుక. ఒకరోజున శ్రావణి వాళ్ళ తరగతికి హెడ్మాస్టర్ గారు వచ్చారు. "ఉపాధ్యాయ దినోత్సవానికి ఇంకా మూడు రోజులు మాత్రమే ఉన్నది. ఆ రోజున ప్రతి తరగతి నుండీ ఒకరు మాట్లాడాల్సి ఉంటుంది: ఉపాధ్యాయుల గొప్పదనం గురించి చెప్పాలి. మరి మీ తరగతి నుండి ఎవరు మాట్లాడతారు?" అడిగారు. శ్రావణి టక్కున చెప్పేసింది: "మా తరగతి నుంచి బబ్లు వస్తాడండి" అని.
బబ్లు చకాలున తల ఎత్తాడు. "నేను రాను!" అని అరుద్దామనుకున్నాడు. అయితే అంతలోనే హెడ్మాస్టరుగారు బబ్లూని నిలబడమని, విపరీతంగా మెచ్చుకునేశారు: "నాకు చాలా సంతోషంగా ఉంది. బబ్లూ ఇచ్చే స్పీచ్‌ని వినేందుకు మేమందరం ఎదురు చూస్తూంటాం" అని చెప్పేసారు. దాంతో బబ్లు నోరు మూత పడింది. అందరి ముందూ "ఇది మోసం! నేను మాట్లాడను! ఇదంతా కావాలని చేసింది శ్రావణి!" అని అనలేకపోయాడు. బిక్క మొహం పెట్టుకొని ఊరుకున్నాడు. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ల నాన్న అక్కడ కుర్చీలో కూర్చుని ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి,"నాన్నా! ఉపాధ్యాయుల గొప్పదనం గురించి ఏమని చెప్పాలి? వాళ్ళు నిజంగా గొప్పవాళ్ళా, నాన్నా?" అని అడిగాడు బబ్లు. "అవును బబ్లూ! వాళ్ళు చెప్పే చదువు వల్లనే మనకి ప్రపంచం గురించి తెలుస్తుంది. అందుకే గురువులను దైవంతో పోల్చారు.
నేను ఈరోజున ఈ స్థానంలో ఉన్నానంటే అది మాకు చదువు చెప్పిన ఉపాధ్యాయుల వల్లనే!" అన్నాడు బబ్లూ వాళ్ళ నాన్న. ఆ తర్వాత బబ్లూ తోటమాలి దగ్గరకు వెళ్ళాడు. "అంకుల్, అంకుల్! టీచర్లు నిజంగా గొప్పవాళ్ళేనంటావా?" అని అడిగాడు. "అవును చిన్నబాబూ! వాళ్ల వల్లనే మనమూ గొప్పవాళ్లమౌతాం" అన్నాడు తోటమాలి. "అవునా? మరి వాళ్ళంతా నిజంగానే గొప్పవాళ్లయితే, మరి నువ్వు తోటమాలిలా ఎందుకు ఉన్నావ్? నువ్వూ ఏ కలెక్టరో, సర్పంచో, డాక్టరో అయి ఉండొచ్చుగా?" అన్నాడు బబ్లూ, తెలివిగా. తోటమాలి విచారంగా ముఖం పెట్టి "నేను వాళ్ల మాట వినకపోవడంతో ఇదిగో, ఇట్లా అయ్యాను. అటూ ఇటూ కాకుండా సరిగ్గా స్థిరపడలేకపోయాను" అన్నాడు.
"అదేంటి? చదువుకునే రోజుల్లో నువ్వు ఏంచేసేవాడివి?" అడిగాడు బబ్లు. "నేను వెనక బెంచీలో కూర్చుని పిల్లికూతలు కూసేవాడిని" అని తోటమాలి అనగానే బబ్లూకి తన భవిష్యత్తు కనిపించింది. ఉపాధ్యాయ దినోత్సవంనాడు బబ్లు చాలా చక్కగా మాట్లాడాడు. అందరూ అతన్ని బలే మెచ్చుకున్నారు. బబ్లూకి ఒక్కసారిగా చెప్పలేనంత సంతోషం అనిపించింది. తరవాత వాడు శ్రావణి దగ్గరికి వెళ్ళి "నువ్వు హెడ్మాస్టరు గారికి నా పేరు చెప్పగానే ముందు చాలా కోపం వచ్చింది. కానీ నువ్వు నాలో మార్పు తెచ్చేందుకే అలా చేశావని తెలుసుకున్నాను. నన్ను క్షమించు" అన్నాడు. "అయ్యయ్యో, అట్లా అంటావేంటి? నీలో మంచి మార్పు తీసుకురావడం నా బాధ్యత! నేను నిన్ను మార్చాననుకో, అప్పుడు నాకు గురువును అయినంత సంతోషం వస్తుంది ..." అన్నది శ్రావణి నవ్వుతూ.
- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో