Facebook Twitter
రుచి లేని పండు

రుచి లేని పండు

 

హరిపురంలో నివసించే పవన్, గణేష్ ఇద్దరూ మంచి మిత్రులు. హరిపురాన్ని ఆనుకునే దట్టమైన అడవి ఒకటి ఉండేది. ఊళ్ళో వాళ్ళందరికీ ఆ అడవి అంటే భయం. ఎవ్వరూ ఆ అడవిలోకి పోయేవాళ్ళు కాదు. ఒకసారి పవన్, గణేశ్ ఇద్దరూ ఆడుకుంటూ ఆడుకుంటూ తమకు తెలీకుండానే అడవిలోకి ప్రవేశించారు. కొద్దిసేపటికి ఇద్దరికీ చాలా ఆకలైంది. చుట్టూ చూసుకుంటే ఏముంది, ఆకాశమంత ఎత్తైన చెట్లు, పొదలు- అన్ని దిక్కులా ఆవరించి ఉన్నాయి! వాళ్ళకు భయం వేసింది. "ఒరే! ఇక్కడికి ఎందుకొచ్చాంరా? ఎవరూ లేరు, ఇదేదో ఘోరంగా ఉంది?!" అన్నాడు పవన్. "ఎవ్వరూ లేని చోట్ల దయ్యాలు భూతాలు ఉంటాయిరా! ఇక మనపని ఇంతే!" అన్నాడు గణేశ్. ఇద్దరూ కొంచెం సేపు అక్కడే నిలబడి ఒకరి తర్వాత ఒకరు వణికారు. 

ఆ తర్వాత, కొంచెం తేరుకున్నాక, "తినేందుకు ఏమైనా దొరుకుతాయేమో‌ చూద్దాంరా!" అన్నాడు పవన్, ఇద్దరూ అటూ ఇటూ చూసారు. అక్కడికి దగ్గర్లోనే వింత చెట్టు ఒకటి కనబడింది. ఆకాశాన్ని అందున్నేంత ఎత్తుగా, పెద్ద పెద్ద ఆకులతో పచ్చగా ఉందది. దాని కాయలు, పళ్ళలో ఒక వింత మెరుపు ఉన్నది. పవన్, గణేష్ ఇద్దరూ‌ మెల్లగా చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఆ పండ్లను చూసిన కొద్దీ వాళ్ళకు ఇంకా ఎక్కువ ఆకలైంది. గణేష్‌ గబగబా చెట్టు పైకి ఎక్కి, పండ్లను కోసి, పవన్ దగ్గరికి విసిరాడు. పవన్ ఒక పండును కొరికి చూశాడు. తియ్యగా లేవు- ఏదో ఒక రకమైన చప్పదనం! "ధూ!" అని ఉమ్మేసి, పండును క్రింద పడేసాడు. పైనుండి చూసిన గణేష్‌ ఇక కోయటం ఆపి చెట్టు దిగి వచ్చాడు. 

 

మెరిసే పళ్ళని చూస్తూ, "ఇట్లా అవుతుందనుకోలేదురా! ఇప్పుడెలాగ? ఇవన్నీ వదిలేసి ముందుకు పోదాం! త్వరగా ఇల్లు చేరుకుంటే అదే చాలు!" అన్నాడు. అంతలో ఏదో మెరుపు మెరిసినట్లయింది. ఇద్దరూ గట్టిగా కళ్ళు మూసుకున్నారు. కళ్ళు తెరిచి చూస్తే ఆశ్చర్యం- తమ చుట్టూ చెట్లు లేవు! ఇద్దరూ తమ ఊరి పొలిమేర దగ్గరే నిలబడి ఉన్నారు! పవన్ వాళ్ళ తాత, వాళ్లని వెతికేందుకు వచ్చిన మనుషులు అందరూ వాళ్లకేసి అనుమానంగా చూస్తున్నారు. "ఇక్కడికెట్లా వచ్చాం? ఆ చెట్టేది?" అని అరుస్తున్న పిల్లలకేసి జాలిగా చూసారు పెద్దవాళ్ళు. అంతలోకే వాళ్ళ చూపులు చుట్టూ నేలమీద పడి ఉన్న పండ్లమీద పడ్డాయి.

 

తాత ఒక పండును చేతిలోకి తీసుకొని ఆసక్తిగా చూసాడు. "ఈ పండ్ల చెట్టే, నేను ఎక్కింది! ఏదీ ఆ చెట్టు?" అరిచాడు గణేష్. అంతలోకే తాత ఏదో అరవటం, అక్కడ చేరిన పెద్దవాళ్లంతా గబగబా క్రింద పడిన పండ్లను ఏరుకొని ఎవరి దారిన వాళ్లు పరుగు పెట్టటం చకచకా జరిగిపోయాయి. పిల్లలిద్దరూ ఆశ్చర్య పోయారు. తర్వాత చెప్పాడు తాత ఆ పండ్లలోపలి టెంక అంతా మేలిమి బంగారం! ఇట్లాంటి పండ్ల గురించి కథల్లో చదవటమే తప్ప, నిజంగా ఎవ్వరూ చూసి ఉండలేదు! ఇప్పుడు అకస్మాత్తుగా అవి కనిపించే సరికి, జనాలంతా ఎవరికి దొరికినన్ని వాళ్ళు ఎత్తుకుపోయారు! "అయితే నేమి? బంగారం పండ్లు తినడానికి పనికిరావు!" అని గట్టిగా నవ్వారు పవన్- గణేశ్, వాళ్ళ తాత తెచ్చిచ్చిన మామూలు పండుని కొరికి తింటూ.

కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో