Facebook Twitter
ఎర్ర ముక్కు జింక

ఎర్ర ముక్కు జింక

 


అనగా అనగా ఒక ధృవపు జింక ఉండేదట. దాని పేరు రుడాల్ఫు. దానికి ఓ పొడవాటి ముక్కు ఉండేది, ఎర్రగా మెరుస్తూ. సాధారణంగా ధృవపు జింకలకు పొడవాటి ముక్కులు ఉండవు. ఉన్నా అవి అట్లా ఎర్రగా మెరవవు. అందుకని అందరూ రుడాల్ఫును 'ఎర్రముక్కు జింక' అని పిలిచి, ఏడిపించేవాళ్ళు. రుడాల్ఫు తన ఎర్ర ముక్కును చూసుకొని నిజంగా కుమిలిపోయేవాడు. మిగిలిన జింకలన్నీ అతన్ని ఎగతాళి చేస్తుండేవి. రుడాల్ఫు తల్లిదండ్రులు గాని, తోడబుట్టినవాళ్ళు గాని అతనివైపుకు చూడకుండా నేలబారున చూస్తూ మాట్లాడేవాళ్లు. అతన్ని తలచుకొని సిగ్గుపడేవాళ్ళు. "తనేం నేరం చేశాడని భగవంతుడు ఇట్లా శిక్షిస్తున్నాడు?" అని రుడాల్ఫు అనుక్షణం బాధపడేవాడు.

డిసెంబరు నెల. క్రిస్మస్ రానున్నది. క్రిస్మస్ తాత ప్రపంచంలోని పిల్లలందరికోసం బహుమతులు తీసుకొని, ప్రపంచాన్ని చుట్టి వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. మామూలుగా తన బండిని లాగే ధృవపుజింకలు-డాషర్, డ్యాన్సర్, ప్రాన్సర్, విక్సన్ లను సిద్ధం కమ్మన్నాడు. వాళ్లు లాగే ఆ బండిని ఎక్కి, తాత బయలుదేరగానే, ధృవపుజింకలన్నీ అంతటి గౌరవానికి నోచుకున్న తమ జాతి హీరోలను కీర్తిస్తూ హర్షధ్వానాలు చేశాయి. కానీ ఏం లాభం? ఆ సాయంత్రం భూమిని ఒక భయంకరమైన పొగమంచు కప్పేసింది. దారి ఏమాత్రం కనబడటంలేదు. క్రిస్మస్ తాత పిల్లలకు బహుమతులిచ్చేందుకు వచ్చేది ఇళ్ల పొగ గొట్టాల్లోంచే కదా! ఆ మంచుపొర ఎంత దట్టంగా ఉందంటే, తాతకు, పాపం ఒక్క పొగగొట్టం కూడా కనబడలేదు! ఆ పొగమంచులోంచి దారి కనుక్కోవాలని తాత తన చేతిలో ఉన్న లాంతరును ఎంత ఊపినా ప్రయోజనం లేకపోయింది.

 

ఏం చేయాలో పాలుపోక, క్రిస్మస్ తాత కంగారు పడుతున్న ఆ క్షణంలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు రుడాల్ఫు. అతని ముక్కు రోజూకంటే ఎర్రగా మెరిసిపోతూ వెలుగులు చిమ్ముతున్నది. తాత సాంతాక్లజ్ సమస్యకు పరిష్కారం దొరికినట్లైంది- రుడాల్ఫుకు బండి సారధ్యం లభించింది! క్రిస్మస్ తాత రుడాల్ఫును బండిలో అన్ని జింకలకంటే ముందు నిలిపి, కళ్లెం వేసి, తను బండినెక్కాడు. మరుక్షణంలో‌బండి ముందుకు దూసుకుపోయింది. రుడాల్ఫు క్రిస్మస్ తాతను ఆరోజు ప్రతి ఇంటి పొగగొట్టానికీ చేర్చాడు- భద్రంగానూ, వేగంగానూ. వాన, పొగమంచు, మంచు, వడగళ్ళు- ఇవేవీ ఆపలేకపోయాయి రుడాల్ఫును. ఎర్రగా మెరిసే అతని ముక్కు, అంత దట్టమైన పొగమంచునూ చీల్చుకొని ముందుకు పోయింది!

ఆ తర్వాత క్రిస్మస్ తాత అందరికీ చెప్పాడు, సంతోషపడుతూ- "రుడాల్ఫు గనక లేకపోతే ఆరోజున నేను ఎక్కడికీ కదలలేకపోయేవాడిని" అని. ఇప్పుడు అందరూ రుడాల్ఫునూ, అతని బలాన్నీ, అతని ఎర్రముక్కునూ కొనియాడటం మొదలుపెట్టారు! ఒకనాడు అతను సిగ్గుపడి, దాచలేక- దాచలేక- దాచుకున్న ఎర్రముక్కే, ఈనాడు ప్రతి ధృవపుజింకకూ కలల వెలుగైంది. అన్ని జింకలూ ఇప్పుడు అలాంటి ముక్కుకోసం తపించటం మొదలుపెట్టాయి! శక్తికీ, మంచితనానికీ మారుపేరైన రుడాల్ఫు క్రమంగా అందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు. గొప్ప పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్నాడు. లోపాలను తలచుకొని కుమిలిపోయే వాళ్లెవరైనాసరే- తన కథను విని స్ఫూర్తి తెచ్చుకునేంతగా ఎదిగాడు.


కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో