Facebook Twitter
తెలివైన పిల్లలు

తెలివైన పిల్లలు

 


మాలిపురంలో ప్రవీణ్, మహేష్ అనే ఇద్దరు స్నేహితులు కలిసి మెలిసి ఉండేవాళ్ళు. వాళ్ళ తెలివి తేటల్ని గురించి ఊళ్ళోవాళ్లంతా గొప్పగా చెప్పుకునే వాళ్ళు. ఒకసారి ఆ ఊరి రాజుగారి భవనంలో దొంగతనం జరిగింది. రాణిగారు ఎంతో మక్కువగా పెట్టుకునే ఆభరణాల మూటని ఎవరో సునాయాసంగా దొంగిలించారు! రాజుగారు చాటింపు వేయించారు: ఈ ఆరణాల దొంగల్ని పట్టించిన వాళ్లకు వంద బంగారు నాణాలు బహుమతిగా ఇస్తానని. ఊళ్ళో వాళ్ళంతా మహేష్, ప్రవీణ్‌లతో "ఒరే, మీరు ఇంత తెలివైనవాళ్ళు, ఆ దొంగలెవరో కనుక్కోండి గదా" అన్నారు. ప్రవీణ్ కొంచెం ఆలోచించి, "ఈ పని చేసేవాళ్ళకు రాజుగారి భవనం గురించి, రాణిగారి నగల మూట గురించీ బాగా తెలిసి ఉండాలి. అంటే రాణిగారి దగ్గర పనిచేసే వాళ్ళే ఎవరో ఈ పని చేసారన్నమాట" అన్నాడు.

 

"రాణిగారి చెలికత్తెల్ని అందరినీ ఒక్కరొక్కరుగా పిలిపించి అడిగితే సరి!" అన్నాడు మహేష్. "రాణిగారి నగల్ని వాళ్లెవరో ఇంత త్వరగా అమ్ముకోలేరు. అందుకని ఆ మూటకి మూట ఎక్కడో భద్రంగా ఉండే ఉంటుంది ఇంకా" అన్నాడు ప్రవీణ్. "దొంగలు రాణివాసంలో వాళ్ళే. కనుక నగల మూట కూడా ఇంకా రాణివాసంలోనే ఉంటుంది. బయటికి చేరుకొని ఉండదు" అన్నాడు మహేష్. ఇద్దరూ కలిసి రాజుగారి దగ్గరకెళ్ళి, "మేం మీ నగల మూట ఎక్కడుందో కనుక్కుంటాం. మాకు ఓ రెండు మూడు రోజులు రాణివాసంలో ఉండేందుకు అనుమతి-నివ్వండి. అట్లాగే పొగ చుట్టలు కూడా ఓ పదో ఇరవయ్యో తెప్పించండి" అన్నారు. రాజుగారు సరేనన్నారు. "ఎవరో ఇద్దరు పిల్లలు రాణిగారి ఆభరణాల దొంగల్ని పట్టుకునేందుకు వచ్చారట" అని ఊరంతా తెలిసిపోయింది.

ఆరోజు రాత్రి రాణివాసంలో కల్లోలం రేగింది. "మంట! మంట!" అని అరుపులు రేగాయి. రాణివాసం అంతటా పొగ క్రమ్ముకున్నది. రాజుగారు పరుగున వచ్చారు రాణివాసానికి- "ఏం జరిగింది, ఏమైంది? ఎవరికీ ఏమీ జరగలేదు గద?!" అంటూ. మహేష్, ప్రవీణ్ ఆయనకు ఎదురేగి, "ఏమీ పరవాలేదు ప్రభూ! ఇది మేం చేసిందే. నగల మూట ఇదిగోండి!" అని రాణిగారి పరుపు క్రింద నున్న మూటను తీసి ఇచ్చారు రాజుగారికి. రాజుగారు ఆశ్చర్యపోయారు. "ఇది ఇక్కడికి ఎట్లా వచ్చింది? మీకెలా దొరికింది?" అని ప్రశ్నలు కురిపించారు.

 

"ఏమీ లేదు ప్రభూ!‌ఈ పనిని రాణివాసంలో పనిచేసే చెలికత్తెల్లోనే ఎవరో ఒకరు చేసి ఉంటారని మాకు అర్థమైంది. అట్లాగే నగలమూట ఈ కోటని దాటి పోలేదనీ అర్థమైంది. అందుకని దొంగ ఎవరో దాన్ని తీసి, ఈ చుట్టు ప్రక్కలే, ఎవరూ చూడ సాహసించని స్థలంలో, దాచి ఉంచిందని ఊహించాం. 'మంట' పేరుతో హడావిడి చేసేటప్పటికి, అందరూ బయటికి పారిపోతారు, కానీ దొంగ మటుకు తాను మూటని దాచిన తావుకు పరుగెడుతుంది- మేం ఇక్కడే ఉండి, రాణివాసంలో పనిచేసేవారినందరినీ గమనిస్తూ ఉన్నాం. అమాయకపు దొంగ పొగ మంటకు భయపడి తను దాచుకున్న మూటని మాకు చూపించేసింది!" నవ్వారు పిల్లలిద్దరూ.

రాజుగారు వాళ్ల తెలివిని మెచ్చుకొని, "ఇంతకీ దొంగలెవరో చూపనేలేదు మాకు" అన్నారు. "ఆ దొంగ ఇంకా ఇక్కడెందుకుంటుంది? పారిపోయింది మహారాజా! పోనివ్వండి, మళ్ళీ అయినా మనకు దొరక్కపోదు" అన్నాడు మహేష్. రాజుగారు తన మాట ప్రకారం వాళ్లకు వంద బంగారు నాణాల్ని, ప్రశంసా పత్రాన్నీ అందజేసారు. అదే రోజున, పిల్లలిద్దరూ ఇంకా ఊరికి బయలు దేరకనే వాళ్లకో ఉత్తరం అందింది: "ఇల్లలకగానే పండగ కాదు. మీ వంద బంగారు నాణాలను మీ ఊరికే వచ్చి దోచుకెళ్తాం. ఎవరు అడ్డుకుంటారో చూస్తాం" అని. మహేష్, ప్రవీణ్ ఇద్దరూ గట్టిగా నవ్వారు. "మన ఊరికి రమ్మను..ఈసారి దొంగల్ని అందరినీ పట్టించేద్దాం" అనుకున్నారు. ఇద్దరూ తమ బహుమతిని పట్టుకొని ధైర్యంగా తమ ఊరికి వెళ్ళిపోయారు. "ఆ దొంగలు ఎవరో మన ఊరుకు రావల్సిందే కదా, ఇవాల్టినుండి మన ఊరికి వచ్చే కొత్త మనుషుల్ని గుర్తు పెట్టుకుందాం మనం" అన్నాడు మహేష్.

పిల్లలిద్దరూ జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. మూడో‌రోజున ఆ ఊరికి కొందరు దృఢకాయులు వచ్చారు. "మన బంధువులు వీళ్ళే!" నవ్వాడు ప్రవీణ్. "ఊరికి కాపలా ఉండే సైనికులను హెచ్చరించాలి, వీళ్ళ గురించి!" అన్నాడు మహేష్. ఆ రోజు రాత్రి ఊరిమధ్యలో ఉన్న మర్రిచెట్టు తొర్రలో దాక్కున్నారు వీళ్ళిద్దరూ. అర్థరాత్రి అవుతున్నదనగా దృఢకాయులు ఎక్కడినుండో బయటికి వచ్చి, మిత్రుల ఇళ్ళున్న వైపుకు నడవసాగారు. వాళ్లని ఆ తొర్రలో నుండి గమనిస్తున్నారు మిత్రులు.. దొంగలు మర్రిచెట్టు దగ్గరికి రాగానే తొర్రలోంచి "అహ్హహ్హహ్హ- ఆహహ్హహ్హహ్హ" అని రాక్షసులలాగా నవ్వారు ఇద్దరూ. 

ఆ నవ్వులకు బిత్తరపోయిన దొంగలు "ఎవరది? ఎవరక్కడ? బయటికి వచ్చి ఎదురు నిలవండి! ఎవరది?!" అని అరిచారు బింకంగా. తొర్రలోంచి మహేష్ మళ్ళీ ఓసారి నవ్వాడు. ప్రవీణ్ బొంగురు గొంతుతో "ఒరే!‌ మేం ఈ ఊరిని కాపాడే రాక్షసులం! మాకు ఎదురు నిలుస్తార్రా మీరు! అహ్హహ్హహ్హహ్హ" అని నవ్వాడు. "రాజుగారినుండి ఆభర-ణాలతోబాటు మీరు డబ్బుల్నీ దోచుకున్నారు గదరా! ఆ డబ్బులు మొత్తం ఈ మర్రిచెట్టు ముందు పెట్టేసి చెంపలేసుకొని పోండి. లేదంటే మీ పని ఇవాల్టితో సరి!" అరిచాడు మహేష్. దొంగలు గడగడా వణికారు. తమ దగ్గరున్న మొత్తం డబ్బునూ మర్రిచెట్టు ముందు పెట్టి పారిపోబోయారు. అంతలోనే అందరూ కాపలా సైనికులకు దొరికిపోయారు. వాళ్లద్వారా అంత:పురపు దొంగ కూడా దొరికిపోయింది! రాజుగారు మరోసారి పిల్లలిద్దరినీ సన్మానించారు!

కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో