Facebook Twitter
కథల కథ

కథల కథ!

 


ఒక అడవిలో ఒక కుందేలుండేది. ఆ కుందేలు ఎప్పుడూ సంతోషంగా ఎగురుతూ,నవ్వుతూ ఉండేది. అడవిలో ఎవరు ఎదురైతే వాళ్ళకు ఓ కథ చెప్పుకుంటూ ఉల్లాసంగా జీవించేది. ఒకసారి దానికి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే, పాపం అది ఊరికే పడుకొని ఉండిపోయింది. చుట్టూతా ఎవరున్నారన్న ధ్యాసే దానికి లేకుండా పడిపోయింది. చివరికి కుందేలు బంధువులు పట్టుబట్టి దాన్ని డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళారు. డాక్టరుగారు దాన్ని పరీక్షించి ఏవేవో గోలీలు రాసిచ్చారు. బంధువులు బలవంతంగా కొన్ని మాత్రలు దానిచేత మింగించారు, వద్దన్నా వినకుండా. వాటితో మూడోరోజుకల్లా కుందేలుకు జ్వరం తగ్గిపోయింది. కానీ దాని మనసుకు ఏమైందో, మరి, ఇప్పుడు అది పూర్తిగా నిశ్శబ్దం అయిపోయింది. ఆ కథలన్నీ ఎటుపోయాయో, ఏమో? ఒక్కటీ లేకుండా మాయమయ్యాయి!

 

ఇక కుందేలు ఆగలేకపోయింది. తప్పిపోయిన ఆ కధల్ని వెతుక్కుంటూ అడవిలో అంతా తిరిగేది. ఇదివరకు ఉన్న ఉత్సాహం, ఉల్లాసం ఇప్పుడు దానికి లేకుండా పోయాయి. ఊరికే "నాకథలు! నాకథలు" అని అరుచుకుంటూ పోయింది, పాపం. కానీ కథలు!- వాటిని రమ్మంటే వస్తాయా, పొమ్మంటే పోతాయా?- అవిమాత్రం పూర్తిగా ముఖం చాటు చేసుకున్నాయి.

 

అలా దారీ తెన్నూ లేకుండా తిరుగుతున్న కుందేలు చివరికి అడవి అంచున ఉన్న ఓ గుడిశ దగ్గరకు చేరుకున్నది. ఆ సమయానికి బాగా చీకటి పడింది. ఇంట్లో ఓ తల్లి బిడ్డను నిద్ర పొమ్మంటున్నది. బిడ్డ కథ చెప్పమంటున్నది. తల్లి ’పని ఒత్తిడి ఉన్నది- ఊరకుండమంటు’న్నది. బిడ్డ గునుస్తోంది. అటూ ఇటూ పొర్లు తున్నది. "కథ చెప్పాల్సిందే" నని పట్టుబడుతున్నది. చూరు క్రిందనున్న కుందేలుకు గుండె వేగంగా కొట్టుకున్నది. లోపల అలజడి ఎక్కువైంది. అంతలోనే దాని నోట్లోంచి అద్భుతమైన కథ ఒకటి ఊడిపడింది. అసంకల్పితంగా, అనాలోచితంగా, బిగ్గరగా కథ చెప్తున్న కుందేలుగానీ, ఆశ్చర్యపోతున్న తల్లిగానీ, నిద్రముంచుకొస్తున్న బిడ్డగానీ- ఎవ్వరూ గుర్తించలేదు- కుందేలు కథలు అసలు నిజానికి ఎక్కడికీ పోలేదు! కుందేలులోనే ఉన్నాయి! కొన్ని రోజులు ఊరికే నిద్రపోయాయంతే! మళ్ళీ అవసరం ఏర్పడే సరికి, మళ్ళీ అవకాశం వచ్చేసరికి, అవి తిరిగి వెల్లువయ్యాయి. తన నోట్లోంచి వస్తున్న కథ పూర్తవగానే కుందేలుకు ఈ సంగతి అర్థమైపోయింది. దాని మనసు తేలికైంది. మళ్ళీ దానిలో కథలు తయారవుతున్నాయిప్పుడు!

 

కథల తీరే అది. మన లోతుల్లోంచి ఎక్కడినుండో ఊడిపడుతుంటాయి అవి. కథలకూ తమవైన ప్రాణం ఉంటుంది. అవీ నవ్వుతాయి, ఏడుస్తాయి, వస్తాయి, పోతాయి. వాటికి తమదంటూ స్వేచ్ఛ ఒకటి ఉంటుంది. ఎవరైనా, ఎప్పుడైనా చెప్పేస్తామంటే రావు, కథలు. వాటికి ఇష్టమైతేనే వస్తాయి. ఇష్టం కాకపోతే గుర్తుకు రామంటాయి, వేరే పనుల్ని గుర్తుకు తెస్తాయి. ఒక్కోసారి అవి బయటికి రాకపోతే కంగారు పడకండి. సరైన సమయం, సందర్భం రాగానే అవి తప్పక వెలువడతాయి! 

 

కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో